Pages



Monday, 15 August 2011

ఏమో బాబోయ్!



అనన్య

మొన్న మా ఇంట్లో ఒక ఆదివారంనాడు ఏమీ తోచక అందరం టీవీ ముందు కూర్చున్నాం. ఏమి చూడాలి అనే విషయంలో ఇంట్లో నలుగురికీ నాలుగు అభిప్రాయాలు ఉన్నాయి. మాలో ఒకరికి హిందీ సినిమాలు నచ్చవు, ఒకరికి ఫలానా హీరో నచ్చడు, ఒకరికి ఫలానా సంగీత దర్శకుడి సంగీతం అంటే బోర్, ఒకరికి పాత సినిమాలు గిట్టవు. సరే...ఇలా కాదని సినిమా వద్దు, ఏదైనా స్పోర్ట్స్ చూద్దాం అన్నారు ఒకరు. మాలో ఇద్దరికి అసలా ఐడియానే నచ్చలేదు. సరే, న్యూస్ చూద్దామా అంటే, ఎప్పుడూ చూసే
దే, ఆదివారం కూడానా? అని నాకు ఒళ్ళు మండింది. సీరియల్ చూద్దామంటే మా ఆయన అంతెత్తున లేచారు. కార్టూన్లు చూద్దామంటే చురచురా చూశారు మా మామగారు. పోనీ ఇంగ్లీష్ సినిమా చూద్దామంటే మీరు చూడండి అంటూ పక్క గదిలోకి వెళ్లబోయారు మా అత్తగారు. ఇక అందరం టీవీ కట్టేసి కబుర్లు చెప్పుకున్నాం. ఆ కథ అక్కడికి అలా ముగిసింది.

ఇప్పుడంటే ఇన్ని చానెల్స్, ఇన్ని ఛాయస్ లు వచ్చాయి కాని, మా చిన్నప్పుడు దూరదర్శన్ మాత్రమే ఉండే రోజుల్లో వారానికి ఒకే ఒక్క తెలుగు సినిమా, ఒక్కటే ఒక్క హిందీ సినిమా  మాత్రమే వచ్చేవి. శనివారం సాయంత్రం అయ్యేసరికి హిందీ సినిమా కోసం, ఆదివారం సాయంత్రం అయ్యేసరికి తెలుగు సినిమా కోసం ఇంటిల్లిపాదీ టీవీ దగ్గరకి చేరేవారు. ఇప్పటిలా నచ్చకపోతే చానల్ మార్చే సౌకర్యం లేదు కదా అప్పట్లో. అందుకని ఏది వేస్తే అదే మహా ప్రసాదం అన్నట్లు స్వీకరించేవాళ్ళం. ఇక దూరదర్శన్ లో సినిమాలు వేసే ఉద్యోగం ఏ రసజ్ఞుడిదో తెలియదు కానీ, ఆరోజు ఏం పండగ వస్తే దానికి సంబంధం ఉన్న సినిమా పడేది. దీపావళి పండగ వస్తే ఆ రోజు సినిమాలో కనీసం దీపావళి గురించి పాట అయినా ఉండేది, టపాకాయలు కాల్చే సీన్ అయినా ఉండేది. రాఖీ పండగ వస్తే అన్నా చెల్లెళ్ళ సెంటిమెంట్ ఉన్న సినిమా, సంక్రాంతి పండగ వస్తే సంక్రాంతి పాట ఉన్న సినిమా...ఇలా సందర్భశుద్ధిగా ఉండేవి అప్పట్లో టీవీ ప్రోగ్రామ్లు.

పొద్దున్నే భక్తి సంగీతం, ఒక్క అరగంట వార్తలు, సాయంత్రం రైతుల కోసం పాడిపంటల మీదా, పశుపెంపకం మీదా ప్రోగ్రామ్లు, అడపా-దడపా బుర్ర కథలూ, హరి కథలూ, కోలాటాలు. ఇప్పుడూ దూరదర్శన్ శక్తి వంచన లేకుండా అవే వేస్తోంది పాపం. కానీ రైతులూ, కళాకారులూ కూడా ఇప్పుడు అవి చూడట్లేదు. నాలుగైదు చానళ్ళతో మొదలైన కేబుల్ టీవీ తుఫాను అంతకంతకీ ఉధృతం అవుతూనే ఉంది కదా మరి?

ఈమధ్య టీవీ లో ప్రోగ్రాం యాంఖర్లు తెలుగులో మాట్లాడటం మానేసి 'థెలుగూ' లో మాట్లాడటం మొదలు పెట్టారు. మొన్న మా చుట్టాలింటికి వెళ్తే పొద్దున్న లేచేసరికి వినిపించింది. "మా బుడిబుడి అడ్యుగుల బుజ్శాయి ప్రనవ్ కీ విషెస్ తెలియచ్శేయగలరూ అంటూ రాస్తునారూ ఖమ్మం నుండి స్వప్నా, షరత్. ప్రనవ్..నీకు హార్దిక జ్శాన్మదిన షుబాకాంక్షలూ. ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్" అంటూ వేసిన పాట... "నా పేరే కాంచనమాల..నా వయసే గరం మసాలా..తందానా తాన అంటూ మోగనీ తబలా..".ఒక బుడిబుడి అడుగుల బుజ్జాయికి ఈ ఛానల్ వాళ్ళు వేస్తున్న 'బ్యూటిఫుల్ సాంగ్' ఇది! అదివరకు ఈ సమయానికి రేడియోలో భక్తిరంజని, శాస్త్రీయ సంగీతం...ఇలాంటివి వినేవారు. ఇప్పుడు ఇలాంటి పాటలే సుప్రభాత గీతాలు అవుతున్నాయి.

కొన్ని భక్తి ఛానళ్ళు అలాంటివి వేసినప్పటికీ చూస్తున్న వారు ఎంతమంది?ఇక న్యూస్ ఛానళ్ళు మనిషిలో తీసుకొచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఇదివరకు రోజుకి అరగంటో, గంటో వార్తలు వేసేవారు. ఆ కాసేపు ప్రపంచాన్ని టీవీ ద్వారా చూడటం కోసం అందరూ ఎంతో శ్రద్ధగా వార్తలు పెట్టుకునేవారు. ఇప్పుడు చిన్నా-పెద్దా అన్నీ కలిపి...న్యూస్ చానళ్ళ సంఖ్య దరిదాపుగా యాభై. ఏ చానల్ చూడాలో తేల్చుకోవటానికి మనిషి బుర్రలో సగం తెలివితేటలు వాడాల్సి వస్తోంది.

అన్నిటిలోనూ వేసేది ఒకటో రెండో వార్తలు. ఎన్నిసార్లు వేసినా, వేసిన బులెటిన్నే మళ్ళీ మళ్ళీ వేసి చూపిస్తారు. అందులోనూ నాణ్యమైన వార్తలు తక్కువే ఉంటుంటాయి.పైగా ఒక వార్తని చెప్పటంలో...న్యూస్ రీడర్ ఒకసారి చదివాక, సంఘటనాస్థలంలో ఉన్న విలేఖరి అదే విషయాన్ని ఇంకోసారి చెప్తాడు. మళ్ళీ ప్రశ్న జవాబుల ద్వారా విలేఖరీ, న్యూస్ రీడరూ మళ్ళీ అదే విషయాన్ని మాట్లాడతారు. మళ్ళీ అక్కడ ఉన్న వ్యక్తులని ఎవరినైనా అడిగి విలేఖరి అదే విషయాన్ని చెప్పిస్తాడు. మళ్ళీ దాని మీద స్టూడియోలో ఎవరినైనా కూర్చోపెట్టి ఒక చర్చ నిర్వహిస్తారు. వీటన్నిటి మధ్యా రెండు 'కమర్షియల్ బ్రేక్' లు వస్తాయి...ఇదంతా అతిశయం కాదు...మొన్ననే ఒక ప్రముఖ వార్తా చానల్లో ఒక వార్త చూశాను.

తూర్పు గోదావరి జిల్లా లోని ఒక చిన్న గుడిలో ఒక పంది అదే పనిగా గర్భ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసిందిట. 'ఇది ఎంతవరకు జనానికి అవసరమైన వార్త?' అనే విషయాన్ని పక్కన పెడితే, ఆ వార్త 'రిపోర్టింగ్' ఇలా సాగింది...

వార్తలు చదువుతున్న అమ్మాయి మొదలుపెట్టింది..."మనుషులే కాదు, జంతువులూ భక్తి కలిగి ఉంటాయని ఇప్పుడు తేటతెల్లం అయ్యింది. తూర్పు గోదావరి జిల్లా లో ఒక భక్త వరాహం ఒక రోజంతా రామాయలం చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. స్థానికులే కాక చుట్టుపక్కల గ్రామాల్లోని వారు కూడా ఈ వింతను చూడటానికి ఆ గుడికి తరలి వస్తున్నారు. ఈ విషయం పై మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ ప్రకాష్ అందిస్తారు" అని, ఉన్నట్టుండి గొంతు పెంచి బెదిరిస్తున్న స్వరంతో "ప్రకాష్! రామాలయంలో జరుగుతున్న వింత గురించి వివరాలు చెప్పండి" అంది. అతను (సిగ్నల్ చేరటం ఆలస్యం అయ్యి కాబోలు) మౌనం గా కెమెరా వైపు చూస్తూ ఉండిపోయి, ఒక నిముషం తర్వాత అందుకున్నాడు. "సుజాతా! ఇక్కడ స్థానిక రామాలయంలో ఈరోజు పొద్దున్న నుండి ఒక భక్త వరాహం అదే పనిగా గర్భగుడి చుట్టూ నిర్విరామంగా తిరుగుతోంది. అసలు ఇలా ఎందుకు చేస్తోంది అనే విషయం ఇక్కడ ఎవరికీ అంతు పట్టట్లేదు సుజాతా. గ్రామస్తులందరూ ఇక్కడ చేరి ఈ వింత చూస్తున్నారు. అంతే కాకుండా చుట్టు పక్కల గ్రామాల్లో వారు కూడా ఈ విషయం తెలుసుకుని రామాలయం వద్దకు చేరుకుంటున్నారు సుజాతా." అని ఆపాడు.

"ప్రకాష్! ఈ వింతను అసలు మొదట ఎవరు చూశారు?" అని అడిగింది రీడర్ మళ్ళీ అదే స్వరంతో. "సుజాతా! మొట్టమొదట పొద్దున్నే గుడిని శుభ్రం చేయటానికి వచ్చిన పని ఆవిడ ఈ విషయాన్ని చూశారు. గుడిలోకి వరాహం అసలు ఎలా వచ్చిందో తనకు తెలియదనీ, అయితే ఆ వరాహాన్ని తరిమి వేయబోతే అది ఇంకా వేగంగా పరుగెడుతోందని ఆవిడ చెప్తున్నారు సుజాతా. ఆవిడని అడిగి తెలుసుకుందాం సుజాతా."

"అమ్మా చెప్పండి. మీ పేరేంటి?"
"సుబ్బాయమ్మండీ".
"చెప్పండమ్మా...మీరు పొద్దున్న గుడి శుభ్రం చేయటానికి వచ్చినప్పుడు ఏమి చూశారు?"
"నేను మావూలుగా గుడి తుడుత్తానికి ఉదయానే వచ్చానండీ. గేట్ తీసుంది ఏటా అనుహుని, సీపిరట్టుకుని ఇలా వచ్చి సూసానాండీ? ఆ పంది ఒహటే పనిగా తిరుగుతా ఉందండీ. గుళ్ళోకి పందెట్టా వచ్చిందాని సీపిరి తిరగేసి తరిమానండీ. అది ఇంకా గమ్మున లగేత్తుతా గుడి సుట్టూ పదచ్చినాలు సేసేయటం మొదలెట్టిందండీ."
మళ్ళీ ప్రకాష్ అందుకున్నాడు. "సుజాతా! విన్నారుగా? అవీ సుబ్బాయమ్మ గారు చెప్పిన వివరాలు. ఇక ఇక్కడ స్థానికులు ఏమంటున్నారో తెలుసుకుందాం సుజాతా".
"మీ పేరేంటి?"
"నాయేసరావండీ".
"చెప్పండి నాగేశ్వర్రావు గారూ. మీ ఊరి గుళ్ళో ఇలాంటి ఒక సంఘటన జరగటం గురించి మీరు ఏం అనుకుంటున్నారు?"
"అనుకుంటానికేవుందండీ? రామ్మూర్తీ, వరాహమూర్తీ ఒకల్లే కదండీ...ఈ పంది మావూలు పంది కాదు, చానా గొప్ప పంది అనుకుంటనావండీ".
"అసలు గుడి లోకి పంది రావటానికి కారణం ఏమిటి? ఇక్కడ భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి అని మీ ఉద్దేశం?"
"బద్రతా అంటూ ఏవుంటదండీ? పెసిడెంటు గారిని గేటుకి తాళం కొనమని మేము చెప్పుకున్నావండీ. ఆయన కూడా మారాజూ, ధర్మప్రబువులూ. కొంటానన్నారండీ. ఈలోపు ఇలా పంది రావటం మా అందరి అదృష్టకవండీ" అని ముగించాడు.

"సుజాతా! ఈ భక్త వరాహాన్ని చూడటం తమ అదృష్టం అంటున్నారు గ్రామస్తులు. ఊరి ప్రెసిడెంట్ గారు వాళ్ళని బాగా చూసుకుంటున్నట్లు కూడా మనకి ఈ సందర్భంగా తెలుస్తోంది సుజాతా".
"ప్రకాష్! వేరే ఊరి నుండి జనం తరలి వస్తున్నారని అన్నారు. అసలు వాళ్లకి ఎలా ఈ విషయం తెలిసింది?"
"సుజాతా! చుట్టు పక్కల గ్రామాల్లో పొలం పనులు చేసుకోవటానికి వెళ్ళిన గ్రామస్తులు ఈ విషయం చెప్పటంతో ఈ వార్త వ్యాపించి అక్కడి వాళ్ళు కూడా రావటం జరుగుతోంది సుజాతా, వాళ్ళంతా బస్సులు దిగటం మనం ఇక్కడ చూడచ్చు సుజాతా" అంటూ తన వెనక బస్సును చూపించాడు ప్రకాష్.
"ప్రకాష్! మీరు అక్కడే ఉండి మాకు ఎప్పటికప్పుడు వార్తను తెలియజేయండి" అని సుజాత మళ్ళీ గొంతు తగ్గించి, "అసలు ఈ భక్త వరాహం ఎందుకు ఇలా తిరుగుతోంది అనే విషయం మీద చర్చను చూసే ముందు ఒక కమర్షియల్ బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండీ...." అంది.

బ్రేక్ అయిపోయాక "ఇవన్నీ మూఢ నమ్మకాలం"టూ జన విజ్ఞాన వేదిక నుండి ఒకాయనా, "ఇది కలియుగంలో నశిస్తున్న భక్తి విలువలకి పాఠం నేర్పటానికి వచ్చిన భగవంతుడి నిదర్శనం" అని ఒక భక్తుడూ ఒక పావుగంటసేపు చర్చించుకున్నారు. ప్రేక్షకులను కూడా అందులోకి ఇంవోల్వ్ చేస్తూ, ఇది భక్తికి సంబంధించిన విషయం అయితే "b" అనీ, మూఢ నమ్మకం అనుకుంటే "m" అనీ టైప్ చేసి sms చేయమంటూ ప్రేక్షకులని అడుగుతూనే ఉన్నారు ఆ వార్త అయ్యేంతవరకు. మొత్తం ఒక అరగంట పట్టింది ఈ వార్త పూర్తి అవ్వటానికి! పోనీ అంటే, మళ్ళీ మళ్ళీ అదే వార్త, ఆ వరాహం తిరుగుతున్న వేగానికి అనుగుణంగా మంచి మ్యూజిక్ తో సహా. ఇలా ఆ న్యూస్ బులిటెన్ సాగింది.

వార్తా చానళ్ళ భాగోతం ఇలా ఉంటే...ఇక ఉత్తుత్తినే డబ్బులిచ్చి పంపిస్తామనే గేంషో లూ, మూడు నాలుగేళ్ళు సాగే మెగా సోప్ ఒపెరాలూ...వీటి సంగతి చెప్పనే అక్కరలేదు.అసలు సీరియళ్ళలో ఆడవాళ్ళు పగలూ-రాత్రీ తేడా లేకుండా, పేద-ధనిక తారతమ్యం లేకుండా మంచిమంచి పట్టుచీరాలూ, వర్క్ శారీలూ ఎలా వేసేసుకుంటారో అర్థం కాదు. మళ్ళీ వాటికి ఖరీదైన జ్యూయలరీ సెట్లు మాచింగ్ గా ఉంటాయి. ఆడవాళ్లే హీరోలు, ఆడవాళ్లే విలన్లు. ప్రతివారూ చంపేయటం, నరికేయటం గురించి మాట్లాడేవారే! అసలు మనుషుల్ని చంపేయటం అంత తేలికటండీ? డబ్బు, ఆస్తిపాస్తుల విషయం మాటకొస్తే కోట్లకు తక్కువ ప్రస్తావించే పనే లేదాయే!

ఒక పాత్ర హాల్లో అటునుండి ఇటు నడిచేసరికి ఒక ఎపిసోడ్ అయిపోతుంది. మధ్యలో నాలుగైదు స్వగతాలూ, రెండు-మూడు ఫ్లాష్ బాక్లూ, రెండు బ్రేకులూ. అరగంట అయ్యేసరికి ఎవరో ఆ హాలు తలుపు దగ్గరకి వచ్చినట్లు అలికిడి అవుతుంది, ఎపిసోడ్ అయిపోయి, సీరియల్ మర్నాటి వరకు సస్పెన్స్ లో ఆగిపోతుంది! ఇక ఆ వచ్చింది ఎవరా అని ప్రేక్షకులు మర్నాటి వరకు టెన్షన్ అణచుకుంటూ ఎదురు చూస్తారు. అదే శుక్రవారం ఎపిసోడ్ అయితే ఇక శనాదివారాల్ని శాపనార్థాలు పెడతారు మధ్యలో వచ్చినందుకు. మనం ఒకవేళ ఏ కారణం వల్లనైనా టీవీ అనేదే లేని చోటకి వెళ్లి ఒక సంవత్సరం తరువాత తిరిగొచ్చినా ఆ కథలో పెద్దగా మిస్ అయ్యింది ఏమీ ఉండదు. తేలికగా మళ్ళీ ఫాలో అయిపోవచ్చు.

ఒక్కొక్క సీరియల్లో అయితే, ఇంట్లో ఉండే వాళ్ళందరూ పనీపాటూ అన్నీ మానుకుని ఒకచోటే పోగవుతారు ఎప్పుడూ...పిల్లా జల్లా ఉంటే వాళ్ళకీ చదువూ-సంధ్యా ఉండవు. వాళ్ళూ ఎంతటి టాపిక్ అయినా పెద్దవాళ్ళలా మాట్లాడేస్తుంటారు. సీన్లో ఒకరు ఒక మాట మాట్లాడితే దానికి మిగిలిన ప్రతి ఒక్కరి మొహంలో ఎక్స్ ప్రెషన్ నీ మిస్ కాకుండా చూపిస్తాడు కెమెరామాన్. మళ్ళీ నిత్యజీవితంలో మాట్లాడుకునే మామూలు మాటలకి కూడా బాక్ గ్రౌండ్ లో పెద్ద పెద్ద ఉరుముల్లాంటి సౌండ్ ఎఫెక్టు. మధ్యమధ్యలో కాంట్రాక్టు అయిపోవటం వల్ల ఉన్నట్టుండి ఒక నటుడినో, నటినో మార్చేస్తారు. కథకు కుదిరేలా ఉంటే వాళ్లకి ఏ ఆక్సిడెంటో అయినట్లూ, ప్లాస్టిక్ సర్జరీ అయినట్లూ చూపిస్తారు (ప్లాస్టిక్ సర్జరీ మొహానికి చేస్తే, మనిషి పొడవూ, జుట్టూ, గొంతూ...అన్నీ ఎలా మారిపోతాయో నాకు అర్థం కాదు!). అలా కుదరని పక్షాన ఇకపై ఈ పాత్రని వీళ్ళు పోషిస్తారు అని చెప్పేసి వదిలేస్తారు. ఆ పాత్రకి ఆ మనిషిని మనసులో ముద్రించుకోవటం కష్టమై ఎంతోమంది బాధ పడుతుంటారు!

ఒకేసారి పది-పన్నెండు సీరియళ్ళని ఫాలో ఐపోతూ, వాటిలో కథలనూ, పాత్రలనూ కన్ఫ్యూజ్ ఐపోయే వాళ్ళను నేను ప్రత్యక్షంగా చూశాను. అంత కష్టపడి అన్ని ఫాలో అవ్వటం ఎందుకా అనిపిస్తుంది. ఇక విలన్ పాత్రలను కసితీరా తిట్టటం, మంచి పాత్రల వారు ఎవరైనా చనిపోతే ఎమోషనల్ అయిపోవటం చాలా మామూలు ఐపోయింది మధ్య తరగతి కుటుంబాల్లో!

ఇక డ్యాన్స్ షోలు! "టాలెంట్" అనే ముసుగులో సినిమాల్లో కన్నా దారుణమైన డ్రెస్సులు వేసుకుని, సినిమా పాటలకి వొళ్ళు విరిగిపోయేటట్లు కష్టపడి డ్యాన్స్ చేయటం, ఓడిపోయినందుకు కన్నీరు మున్నీరుగా ఏడవటం, ఒకరి డ్యాన్స్ బాగోలేదని ఒకరు అక్కడే దెబ్బలాడుకోవటం, కోపాలు వచ్చి బైటకి వెళ్ళిపోవటం....ఇవన్నీ నిజాలో, డ్రామానో నాకు అర్థం కాదు. అసలు కాసేపు రిలాక్సేషన్ కోసం టీవీ ముందు కూర్చునే ప్రేక్షకుడికి ఇంత తలనొప్పి అవసరమేనా?

పెద్దవాళ్ళు ఇలాంటి ప్రోగ్రాములు చూస్తూ,  వాళ్ళ TRP పెంచి, వాళ్ళని పోషిస్తుంటే, వాళ్ళు ఇంకా ఇంకా ఇలాంటి వాటినే వేయక ఎందుకు ఊరుకుంటారు? ఇంట్లో పిల్లలు చూడకుండా ఎందుకుంటారు? వాళ్ళ మీద ఈ ఎమోషనల్ టార్చర్ యొక్క ప్రభావం ఎందుకు ఉండకుండా ఉంటుంది? దీనికి ఏమిటి సొల్యూషన్? ముందు మారాల్సినది ప్రేక్షకుడా, ప్రోగ్రాం డైరెక్టర్లా, చానల్ ఓనర్లా, స్పాన్సరర్లా?.....ఓ పైవాడా! దీనికి సమాధానం నీకు తెలిస్తే, ఆకాశ వాణి ద్వారా "తెలుసు" అనీ, తెలియకపోతే "తెలియదు" అనీ, తెలుసో, లేదో నీకూ తెలియకపోతే "ఏమో బాబోయ్" అనీ చెప్పు.

1 comment:

  1. Chaala ante chaala baagundandi ...Aa bujjayi pranav ki puttinaroju sandarbham ga vesina paata ...Aa tv serials and news channels varnana anni kooda 100 percent nijaalu. . chaala colloquial gaa raasaaru

    ReplyDelete