Pages



Sunday, 28 December 2025

దినదిన గండం - నూరేళ్ళ ఆయుష్షు

 "మనకి తిరుగులేదు" అని గట్టిగా అరిచాడు నాయకుడు.

"మనకి తిరుగులేదు" అని బదులు నినదించారు యువసైనికులు.

"మన శక్తికి అవధి లేదు".

"మన శక్తికి అవధి లేదు".

"ఐకమత్యమే మన బలం".

"ఐకమత్యమే మన బలం".

ఇలా కొన్ని నినాదాలు అవ్వగానే ఆ చిమ్మచీకటిలో శిక్షణ మొదలయ్యింది.

శత్రువుల్లో రకరకాలవారు ఎలా ఉంటారో, ఏ శత్రువు ఎటు పొంచి ఉంటారో, అపస్మారకంగా ఉంటే ఎలా బలైపోయే అవకాశం ఉందో చెప్తుంటే, శిక్షణ పొందుతున్నవారంతా కన్నార్పకుండా వింటున్నారు. పెద్దపెద్ద మారణాయుధాలతో ఎలా తమమీద దాడి జరుగుతుందో, ఆహారం దొరకకుండా చేసి, ఆకలిదప్పికలతో చంపేసేలా ఎలా ప్రయత్నాలు జరుగుతాయో, వివిధ జాతుల శత్రువులు మీదపడి అమాంతం ఎలా ప్రాణహాని తలపెట్టగలరో తెలుసుకుంటుంటే వాళ్ళ వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి.

విషప్రయోగాన్ని ఎలా పసిగట్టాలో, ఎన్ని రకాలుగా ప్రయోగం జరిగే అవకాశం ఉందో, దాన్ని ఎలా ఎదుర్కోవాలో సోదాహరణంగా నాయకుడు వివరించాడు. విషాహారాన్ని వాసనతోనే పసిగట్టాలని, దాని దరికైనా చేరకూడదని చెప్పారు. విషవాయువుల జోలికి పోనైనా పోరాదని, ఒకవేళ ఉన్నట్టుండి విషవాయుదాడి జరిగితే సుదీర్ఘకాలం ఊపిరి బిగపెట్టి ఎలా ఆ ప్రాంతంనుండి పరుగులు పెట్టి తప్పించుకోవాలో చెప్తూ, అందుకు అవసరమైన యోగప్రక్రియలు, శరీరదారుఢ్యాన్ని పెంచే వ్యాయామాలను నేర్పారు.

శత్రువుల కళ్ళబడే అవకాశం లేకుండా వెలుతురుని ఎలా తప్పించుకోవాలో, చీకట్లోనే ఆహారాన్ని ఎలా సంపాదించాలో, స్థావరంలోకి ఎలా రవాణా చేయాలో, నాయకుడు సీనియర్ శిక్షితుల సహాయంతో నాటకీయంగా వివరిస్తుంటే ఏకాగ్రతతో నేర్చుకున్నారు.

ఆహారంలో రకాలు, మంచిచెడులు, పౌషిక తత్త్వాలు అన్నిటిగురించి పూసగుచ్చినట్టు కథలుకథలుగా ఆకట్టుకొనే విధంగా చెప్తుంటే అందరికీ నోరూరింది. ఎప్పుడెప్పుడు ఈ సూత్రాలన్నీ వాడి ఆహారాన్ని సంపాదించుకోవాలా అని ఆరాటపడ్డారు. ఆహారనిల్వల ప్రాముఖ్యతను హృదయాన్ని కదిలించేలా వర్ణించిచెప్పారు శిక్షకులు.

వెలుతురులేని ఇరుకైన ప్రదేశాల్లో ఎలా నివసించాలో, సొరంగాల్లాంటి మార్గాల్లోంచి నడుస్తూ, ఎగురుతూ, పాకుతూ ఎన్నిరకాలుగా వెళ్ళాల్సి ఉంటుందో, అన్ని రకాలూ బోధించారు గురువులు.

ఒకరితో ఒకరికి కనుసైగలద్వారా ఎలా సమాచార రవాణా జరగాలో క్షుణ్ణంగా నేర్పారు. చీకట్లో సైతం విధవిధములైన ధ్వనులతో, సంజ్ఞలతో ఎలా కలసికట్టుగా పనిచేయాలో మరచిపోలేని విధంగా శిక్షణనిచ్చారు.

జీవితం అంటేనే జీవన్మరణాల పోటీ అని, శక్తియుక్తులు రెండూ ఉన్నవారే బ్రతికి బట్టకడతారని తెలుసుకొంటూ కర్తవ్యదీక్షతో నిండిన ఒక పెద్ద ఉచ్ఛ్వాసను తీసుకున్నారు శిక్షితులంతా.

అంతటితో భాగ్యనగరంలోని డ్రీమ్ హౌస్ అపార్ట్మెంట్స్ లోని సుబ్బారావుగారి ఫ్లాట్ లోని మూడో బెడ్రూమ్ లో ఈమధ్య పుట్టిన బొద్దింకల గుంపుకి లైఫ్ కోచ్ ఇచ్చే శిక్షణ పూర్తయ్యింది.

సుబ్బారావుగారు, భార్య బొద్దింకలను ఎదుర్కొనే మార్గాలగురించి తలలు బద్దలుగొట్టుకుంటున్నారు. సుబ్బారావుగారి పెద్దబ్బాయి మార్కెట్లోకి కొత్తగా వచ్చిన స్ప్రే గురించి వాళ్ళకి చెప్తున్నాడు. ఈ చర్చ పూర్తయి సుబ్బారావు కుటుంబం లైట్లాపి పడుకుంటారని, బొద్దింకలన్నీ ఆహారం కోసం బయటకి వస్తాయని, కడుపు నిండా విందు భోజనం దొరుకుతుందని గోడమీది బల్లిజంట అలా పెళ్లిరోజు జరుపుకోవచ్చని నోళ్ళూరించుకుంటూ ఎదురుచూస్తోంది. కొత్తగా అటకపై కాపురం పెట్టిన ఎలుకల కుటుంబం ఈ బల్లిజంట జిత్తులకు పైజిత్తులు వేస్తోంది.

బొద్దింకల నాయకుడు మాత్రం కనుసైగలతోనే కుర్ర బొద్దింకలకు బల్లిజంటను, ఎలుకలున్న అటకను చూపిస్తూ, టీవీలో వస్తున్న కొత్తరకం బొద్దింకల మందు ప్రకటనను చూపిస్తూ, "ఇహ మీ ప్రతాపం చూపించండి" అన్నాడు.

"మనకి తిరుగులేదు" అని గట్టిగా అరిచాడు బొద్దింకల నాయకుడు.

"మనకి తిరుగులేదు" అని బదులు నినదించారు యువ బొద్దింక సైనికులు.

"మన శక్తికి అవధి లేదు".

"మన శక్తికి అవధి లేదు".

"ఐకమత్యమే మన బలం".

"ఐకమత్యమే మన బలం" అంటూనే వంటింట్లో లైట్ వేసిన సుబ్బారావు భార్యను గమనించి, చీకటి మూలకి జరిగి కూర్చున్నాయి కుర్రబొద్దింకలు.


This story has been published in the souvenir released by Telangana America Telugu Sangham (Telangana American Telugu Association) at the Mega Convention held at Seattle, Washington in May 2024.


https://online.fliphtml5.com/dndlr/nuhg/#p=1