Pages



Thursday, 17 September 2020

సహ పంక్తి

           నేనొక చెంబుని. నిగనిగలాడే స్టెయిన్ లెస్ స్టీల్ చెంబుని. కొందరు ఆంగ్లానికి అలవాటు పడి నన్ను జగ్ అనో, మగ్ అనో, పిచ్చర్ అనో అనచ్చు గాక, నేను మాత్రం అచ్చమైన పదహారణాల తెలుగు చెంబుని.

            నేనంటే కాలక్రమేణ స్టీల్ వాడిని అయ్యాను గానీ మా పూర్వీకులు వెండిలో తెల్లగా, రాగిలో ఎర్రగా మెరిసిపోయే వాళ్ళు. ఇంకా ముందు రోజుల్లో బంగారం లో పచ్చగా మెరిసే వాళ్ళని మా తాత చెబుతుంటే మౌనంగా వినే వాడిని గానీ అతిశయం అని మనసులో గొణుక్కునేవాడిని. తరువాతి రోజుల్లో మీ మనుషుల జనాభా పెరిగి మా అవసరం పెరగటం వల్ల, సగటు మధ్య తరగతి కుటుంబాలకు మేము అందుబాటు లోకి రావటం వల్ల, స్టెన్ లెస్ స్టీల్ లో స్థిరపడి పోయాం.

    అసలు మా వంశంలో ముత్తాతల తరం నాటివాళ్ళను కమండలాలు అనేవారు. వాళ్ళని సన్యాసులు, ఋషి పుంగవులూ ఎక్కడకి వెళ్లినా వెంట తీసుకుపోతూ ఉండేవారు. పుణ్యనదుల్లో మునుగుతూ, వేదమంత్రోచ్చారణకూ, దైవనామస్మరణకూ అలవాటు పడ్డ నోళ్ళకు దాహార్తి తీరుస్తూ, పుణ్య జీవనం గడిపేవారు మా ముత్తాతలు.

    మా తాతల తరం నాటికి వచ్చేసరికి సామాన్య కుటుంబాలన్నింటిలోనూ మావాళ్ళు భాగమైపోయారు. వంటా-వార్పూ, స్నానం-పానం అన్నింటిలోనూ మానవులకు సహకరిస్తూ ఉన్నంతలో ఆనందంగానే గడిపారు.

    మా తండ్రుల తరంలో మా వంశ వైభవం కొంత కనుమరుగవ్వటం మొదలుపెట్టింది. పరదేశం నుంచి ప్లాస్టిక్ అనే కొత్త వంశం దిగుమతై వచ్చి, నెమ్మదినెమ్మదిగా మా స్థానాన్ని అక్రమంగా లాక్కోవటం మొదలుపెట్టారు. చేతి నిండా పని లేక, ఇక మా తండ్రులు వంటిళ్ళలో అటకల్లోనో, షామియానా కంపెనీల స్టోరేజ్ బాక్సుల్లోనో మగ్గుతూ, బూజు పట్టటం మొదలయ్యింది.

    నా చిన్నతనంలో మా నాన్న వెంట నేనూ పెళ్లిళ్ళకూ, పేరంటాలకూ వెళ్ళేవాడిని. అప్పట్లో శుభాకార్యాల్లో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసేవారు. మామూలుగా ఇళ్ళలో పరదేశీ వారిని వాడుకుంటున్నా, శుభమా అని గుమ్మాలకు తోరణాలు కట్టినప్పుడు మాత్రం అద్దె కట్టైనా మమ్మల్ని తీసుకుపోయేవారు. మా యజమాని పనిమనిషికి జీతమిచ్చైనా మమ్మల్ని బయటకు తీయించి, బూజులు దులిపించి, సబీనా, పీతాంబరి, విమ్, ప్రిమ్, చింతపండు, కొబ్బరిపీచు ఏది కుదిరితే అది వాడి తళతళలాడేలా తోమించేసి బోర్లించేవారు. మీ మనుషులకు మామూలప్పుడు కన్నా పుట్టినరోజుకు కొత్తబట్టలు వేసుకుంటే మనసులో ఉన్న ఆనందం ముఖంలో తేజమై మెరిసినట్లు, మేమూ ఇలాంటి సందర్భాల్లో నిగనిగలాడిపోయేవాళ్ళం. దానికి కారణం తోమటం మాత్రమే కాదు. శుభకార్యాలకు వెళ్తున్నామనే ఆనందం.

    నా మటుకు నాకు... సహపంక్తి భోజనాలంటే భలే ఇష్టం. ఒక వ్యక్తి అచ్చంగా నా డ్యూటీ తీసేసుకుంటాడు. ఒక పెద్ద  డేగిశాలో నన్ను ముంచి నీళ్ళు తీసి, అందరి గ్లాసుల్లోనూ నీళ్ళు పోసుకుంటూ వెళ్ళటమే వాడి పని, పంక్తి లేచేవరకు. నా పుట్టుకలో గొప్పదనం ఏమిటో తెలుసా? భోజనానికి కూర్చున్న అతిథులు అన్నం, పులిహోర-బూరెల్లాంటి పిండివంటలు, పప్పులు, కూరలు, పచ్చళ్ళు... ఇలా దేనినైనా "వద్దు, ఇక చాలు" అని చేయి అడ్డు పెడతారు గానీ, మంచినీళ్ళని ఎవ్వరూ వద్దనరు. ఎన్నిసార్లు గ్లాసు ఖాళీ అయితే అన్నిసార్లూ నింపనిస్తారు. అందువల్ల నాకు చాలా గర్వంగా ఉంటుంది. నా రాకని ఎవ్వరూ నిరాకరించరు అని.

    ఈ ఒక్క కారణమే కాదు. అలా అన్నిసార్లు పంక్తిలో పచార్లు చేసే నేను, ఎంచక్కా ఎన్ని కబుర్లు వింటానో! నాతో పాటు ఆ శుభకార్యానికి వచ్చే గిన్నెలు, గరిటెలు, గ్లాసులకు అందుకే నేనంటే అసూయ. పెద్ద పెద్ద వంట గిన్నెలేమో వంటశాలలోనే ఉండిపోతుంటాయి. బక్కెట్లు, బేసిన్లు, గరిటెలు కాస్త అటూ-ఇటూ తిరిగినా, అది కొన్నిసార్లే. పొయ్యి అయితే ఎప్పుడూ డిప్రెషన్ గానే మాట్లాడుతుంది, ఎప్పుడూ వేడివేడిగా ఉండటం దానికి చిరాకు పాపం. ఎక్కడ కాలుతుందో అని ఎవ్వరూ దాని దగ్గరకే వెళ్ళరు! దానికీ సరదాగా అందరి కబుర్లూ వినాలని ఉంటుంది కదా పాపం? గ్లాసులేమో మహా అయితే అటు పక్కన, ఇటు పక్కన కలిపినా ఇద్దరు ముగ్గురి కబుర్లే వినగలవు. అందుకే కార్యక్రమం అయిపోయి మళ్లీ షాపుకి వెళ్లిపోయాక నేను విన్న కబుర్లన్నీ మా వాళ్ళందరికీ చెప్తుంటాను. మరో శుభకార్యానికి వెళ్ళే వరకు మా కాలక్షేపం కూడా ఇదే!

    పంక్తి భోజనాల్లో సంభాషణలను ఎంతో విచిత్రంగా ఉంటాయి. మొదట్లో నన్ను పట్టుకొనే ఆసామి గబగబా గ్లాసుల్లో నీళ్ళు పోసుకుంటూ వెళ్లిపోతుంటే ఏ సంభాషణా పూర్తిగా వినలేక, అన్నీ సగం సగమే విని, చాలా కన్ఫ్యూజ్ అయిపోయేవాడిని. కానీ కాలం గడిచేకొద్దీ, నాలుగు మాటలే విన్నా మొత్తం విషయం అర్థం చేసేసుకోవటం అనే కళ నాకు బాగా వంటబట్టింది.

    చాలా కాలం తర్వాత ఈ పెళ్లిలో కలుసుకున్న స్నేహితులో బంధువులో పక్కపక్కన కూర్చుంటే, "మీ పెద్దాడెలా ఉన్నాడురా?", "రామం గాడు అప్పుడప్పుడూ ఫోన్ చేస్తూ ఉంటాడా?" అంటూ ఇక్కడ లేనివాళ్ళ యోగక్షేమాలు వాకబు చేసుకుంటూ ఉంటారు. కొందరు గతంలో జరిగిన శుభకార్యాలకూ దీనికీ పోలిక చెప్తూ, వంటల రుచులనూ, అలంకరణనూ విశ్లేషించుకుంటారు.

    మరికొందరు ఇతర అమ్మలక్కల చీరల, నగల అందచందాల గురించి చర్చించుకుంటారు. కుర్రాళ్ళు ఒక దగ్గర చేరితే, ఇక్కడకొచ్చిన అమ్మాయిల్లో ఎవరు ఎవరికి బాగా నప్పుతారో మాట్లాడేసుకుంటారు, ఆ ఆడపిల్లల తండ్రులంతా వీళ్ళ కాళ్ళు కడిగి కన్యధార పోయటానికి అక్కడే పక్కనెక్కడో పళ్ళేలు, చెంబులు పట్టుకు నుంచున్నట్టు!

    వయసు మీదపడ్డవారు వాళ్ళ గుండెకు స్టెంట్లు ఎన్ని పడ్డాయో, మోకాళ్ళకు ఆపరేషన్ ఏ డాక్టర్ దగ్గర చేయించుకున్నారో, బీపీ శుగర్ అందరి నెత్తుల మీదా ఎలా తాండవం చేస్తున్నాయో మాట్లాడుకుంటూ పెదవి విరుస్తూ ఉంటారు. పెద్దమనుషులు చకచకా పెళ్లి సంబంధాలు కలిపేసే ప్రయత్నం చేస్తుంటారు. చిన్నపిల్లలు అతిముఖ్యమైన ఆటల కార్యక్రమం మధ్యలో ఆపేసి, భోజనం చేయటానికి రమ్మని జబ్బ పుచ్చుకొచ్చి కుర్చీలో కూలేసిన తమ తల్లిదండ్రులపై ఉక్రోషపు చూపుల బాణాలు వేస్తూ, త్వరగా తినేస్తే పోయి ఆడుకోవచ్చని గబగబా అరకొరగా లాగిస్తూ ఉంటారు.

    అప్పుడే కొత్తగా బంధువులైన యుక్త వయసు ఆడపిల్లలు వాళ్ళ హాబీలేమిటో, వాళ్ళ కాలేజీలో ఫంక్షన్లు ఎలా నిర్వహిస్తుంటారో, ఇలాంటి విశేషాలన్నీ చెప్పుకుంటారు. ఇద్దరు మగవాళ్ళు పక్కపక్కన చేరితే రాజకీయ వార్తలను స్పృశించకుండా ఉండరు. అది పొరపాటున అయిపోతే స్టాక్ మార్కెట్, క్రికెట్ మ్యాచులు షరా మామూలే.

  సర్వీసులో ఉన్నవాళ్లైతే వాళ్ళ ప్రాజెక్టుల గురించి, బాసుల గురించి, కంపెనీల గురించి తిట్టుకుంటూ ఉంటారు. రిటైరైన ప్రభుత్వోద్యోగులైతే లైఫ్ సర్టిఫికేట్, పెన్షను గురించి వాకబు చేసుకుంటారు. పెద్ద ముత్తైదువలైతే నోములు, వ్రత విధానాల గురించి నేర్పుతూ, నేర్చుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన జంటలైతే... ఏమో, నాకెప్పుడూ సరిగ్గా వినిపించి చావదు. ఎంతసేపూ చెవులు కొరుక్కుంటూ ఉంటారు, కిసుక్కున నవ్వుకుంటూ ఉంటారు తప్ప అక్షరమైనా వినిపించనివ్వరు, వాళ్ళ దుంప దెగ!

ఇలా ఎన్ని కబుర్లో, ఎన్ని ఊసులో! ఒకోసారి శుభకార్యాలే కాక విషాద కార్యక్రమాలకు కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది. విచిత్రం ఏమిటో, అలాంటి సందర్భాల్లో కూడా, పదిలో తొమ్మిది సార్లు... భోజనాలకు ముందు వరకు అందరూ కాస్త చింతిస్తూనే ఉన్నా, భోజనాలు మొదలయ్యాక మాత్రం ఇందాక చెప్పినట్టే ఉంటాయి కబుర్లన్నీ!

ఇదంతా ఒకప్పటి సందడి! హ్మ్... ఇప్పటి మాటేమిటంటారా? ఏం చెప్తాం? పంక్తి భోజనాలకు చోటుండకో, చోటున్నా టైముండకో, టైమున్నా ఆసక్తి ఉండకో గానీ, అన్ని కార్యక్రమాల్లోనూ బఫే భోజనాలే అవుతున్నాయి. దీనికీ మమ్మల్ని తీసుకువెళ్తారు. కానీ నుంచొని, ఒంగుని, పడుకొని, నడుస్తూ, పాకుతూ భోజనం చేసే అతిథులు నీళ్ళ గ్లాసులు ఎక్కడ ఒంపేసుకుంటారో అని, ఒక మూలకి ఒక టేబుల్ పరచి పారేసి దానిపై నీళ్ళ గ్లాసులు ఉంచుతున్నారు.

భోజనం చేస్తూ కబుర్లు చెప్పుకోవటం జరుగుతూనే ఉంది, కానీ అవి నాకు వినిపించట్లేదు. ఇక్కడిలా మూలకి నుంచుంటున్నాను కదా? నాకే కాదు, గిన్నెలు, గరిటెలది కూడా నా పరిస్థితే. పోనీ నా తోటివాళ్ళతో అయినా మాట్లాడదాం, ఆ మనుషులు ఏం మాట్లాడుకుంటున్నారో ఊహించుకొని నవ్వుకుందామంటే, నేను నింపుతున్న గ్లాసులు మావాళ్ళు కాదు. ఆ పరదేశీ ప్లాస్టిక్ సరుకు. వాళ్ళకీ నాకూ మాటల్లేవు.

    పోనీ కళ్ళతోనే చూసి తరిద్దామంటే, ఆ భాగ్యమూ ఆట్టే లేదాయె! ఈమధ్య పరిశుభ్రత అవగాహన బాగా పెరిగిపోయింది మీ మనుషుల్లో. చేత్తో చెంబుని డ్రమ్ములో ముంచి గ్లాసుల్లో పోయటమంటే జబ్బులను ప్రత్యక్షంగా వడ్డించటమేనట! అందుకని అతిథులందరికీ ఎవరికి వారికే ప్లాస్టిక్ సీసాలను ఏర్పాటు చేస్తున్నారు. చేతులను, డ్రమ్మును, గ్లాసులను శుభ్రంగా తోముకుంటే జబ్బులెందుకు వస్తాయి?

    అసలు జబ్బు మాలో లేదు, మీ బుర్రల్లో ఉంది. ప్లాస్టిక్ సీసాల్లోంచి నీళ్ళు తాగితే జబ్బు రాదూ? ప్లాస్టిక్ కప్పుల్లో టీ, కాఫీలు. ప్లాస్టిక్ జిప్లాక్ బ్యాగుల్లో కిళ్లీలు. ప్లాస్టిక్ బౌల్స్ లో ఆవడలు, ఐస్క్రీమ్, గులాబ్ జాములు, హల్వా, పాయసం వడ్డించుకు తింటారు. ఇళ్ళల్లో కార్యక్రమాలు జరిగినప్పుడు వచ్చి చూస్తుంటాను కదా? అక్కడ కూడా ప్లాస్టిక్ సీసాలు, డబ్బాలు, కంచాలు, గిన్నెలు. వాటిలో తినేవి, తాగేవి ఉంచుకొని రోజుల తరబడి అట్టే పెట్టి, వాటిలోనే వేడి చేసి, అలాగే నోట్లోకి, కడుపులోకి పంపిస్తే రోగాలు రావూ? ఏమిటో, మీ మూర్ఖత్వం! అయినా ఆఫ్టరాల్ స్టీలు చెంబుని. నేను చెప్తే వింటారా, నా పిచ్చి గానీ?

   అయితే, కొంతమందిలో మార్పు వస్తున్న మాట నిజమేలే. టీవీల్లో, యూట్యూబుల్లో ఉపన్యాసాలు విని, వాట్సాపుల్లో వార్నింగ్ మెసేజులు చదివి, కొందరు నెమ్మదిగా ప్లాస్టిక్ వాడకం మానేస్తున్నారు. రాగి గిన్నెలు, గాజు సీసాలు, మట్టి పాత్రలు, బొగ్గుపొయ్యిలు, రోళ్ళు, రోకళ్ళు అంటూ కాలచక్రాన్ని వెనక్కి తిప్పుతున్నారు. అదే ఆశ మాకింకా. పాత రోజులు వస్తాయని, మాలాంటి లోహపాత్రలకు మరల గత వైభవం వస్తుందని, సహపంక్తి భోజనాలు సరికొత్త 'ఫ్యాషన్' అయ్యి తిరిగి వస్తాయని, మీ ఇంట జరిగే శుభకార్యాల్లో మేము పాలుపంచుకొని, మీవాళ్ళ విస్తర్లు నింపి, మీవాళ్ళందరి కబుర్లతో మా కడుపులు నింపుకుంటామని నా అభిలాష.


This story has been published in Ugadi release of Telugu Jyothi web magazine in 2021.


https://www.tfasnj.org/telugujyothi/year21/TFAS_TJ_Ugadi_2021_V02.pdf


This story has been published in Pratilipi


https://www.tfasnj.org/telugujyothi/year21/TFAS_TJ_Ugadi_2021_V02.pdf