Pages



Sunday, 15 August 2021

సిరివెన్నెల పదలీల - స్వాతిముత్యాల మాల - రెండవ అంకం - తరలి రాదా తనే వసంతం

నాకు ఫేస్ బుక్ ఎకౌంట్ ఉన్న రోజుల్లో దానికి, తర్వాత వాట్సాప్ ఎకౌంట్ కి, అలా ఇంకా చాలా చోట్ల "నా కాప్షన్" అంటూ నేను స్వీకరించినది, వాడుకుంటున్నది, ఆకళింపు చేసుకున్నది, అన్వయించుకునేది గురువు గారు రాసిన ఒక అద్భుతమైన వాక్యం...

"పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం"

ఒక గొప్ప ఉద్దేశంతో చక్కటి చిత్రాన్ని తెరకెక్కించదలచిన దర్శకుడు కే.బాలచందర్ గారు, ఆ కథకు ఏమాత్రం తీసిపోని విధంగా, చిత్రం ద్వారా తాను చెప్పదలచుకున్న సందేశమే పది కాలాల పాటు నలుగురి నోళ్ళ లోను నానే విధంగా అందులోని పాటలను తీర్చిదిద్దించారు. శాస్త్రీయత కొరవడకుండానే, అప్పటి యువతను కూడా ఆకట్టుకొనే విధంగా అద్భుతమైన బాణీలను ఇళయరాజా గారు సమకూర్చగా, ఆ స్వర సౌందర్యానికి తన సాహిత్య సౌరభాన్ని అద్ది ముస్తాబు చేశారు గురువుగారు. ఆ ముస్తాబుకు తుది మెరుగులు దిద్దారు మన బాలుడు, యేసుదాసుడు, ఇతర గాయక బృందం.

అక్బర్ చక్రవర్తి వల్ల అతని కొడుకు సలీమ్ ప్రేమ బలయ్యింది అని కథ విన్నాము (నిజానికి ఇది కథ మాత్రమే అంటారు అనుకోండి... అంటే అక్బర్ తానే మతాంతర వివాహాలూ అవీ చేసుకున్నాడని, ఇంట్లో అందరికీ చేశాడని కూడా విన్నాం కదా? కనుక ఒక ప్రేమని కాదన్నాడని, ఆ ఆడపిల్లని ఏకంగా సజీవ సమాధే చేసేశాడని అన్నది ఖచ్చితంగా కథే అయ్యుంటుంది).

రాజరాజ నరేంద్రుడి మూఢ ప్రేమ వల్ల కొడుకు సారంగధరుడి జీవితం బలయ్యింది అని మరో కథ. అంతెందుకు? నిన్న మొన్నటి వరకు "నా చేయి ఇంకా నీ చేతుల్లోనే ఉంది నాన్నా" అని మొత్తుకున్న కొడుకుల కథలు ఎన్నిటినో మన సినిమాల్లో ఇంకా వింటూనే ఉన్నాం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కథలో కూడా కొడుకుని అర్థం చేసుకోలేని ఒక తండ్రి ఉన్నాడు.

ఆ తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. అంటే మామూలు విద్వాంసుడు కాదు. "ఐ ఈట్ మ్యూజిక్, ఐ డ్రింక్ మ్యూజిక్" అనే రకం. సంగీతాన్నే దైవంగా భావిస్తూ, తను ఆరాధించి ఆలాపించే రాగాన్నే తన ఇంటిపేరుగా పొంది "బిలహరి గణపతి శాస్త్రి" గా పేరుగాంచిన విద్వన్మణి. చదువుకున్న వారు, డబ్బున్న వారు, 'ఉన్నత' కుటుంబంలో పుట్టినవారు అయితేనే 'బి.గ' శాస్త్రి గారికి మనుషులుగా ఆనుతారు. మాటలాడలేనివాడు కనుక వాదోడుగా ఉండలేకపోయినా, చేదోడుగా ఉంటూ, పితృ వాక్పరిపాలకుడిగా ఉంటూ, సతీసమేతంగా తండ్రి గీసిన గిరిలోనే ఉండే పెద్ద కొడుకు "ఉదయం" కాక, బిగ శాస్త్రి గారికి ఇంకో కొడుకు ఉంటాడు. అతనే మన కథానాయకుడు చిరంజీవి, చిత్రంలో "సూర్యనారాయణ శాస్త్రి ఉరఫ్ సూర్యం". తండ్రి పట్ల అపరిమితమైన భయభక్తులు ఉన్నప్పటికీ, భక్తిశ్రద్ధలతో ఆయన నుంచి సంగీత శిక్షణ పొందినప్పటికీ, సంగీతానికి ఆవల ప్రపంచం అనేది ఒకటి ఉందని, అందులో మనుషులు ఉన్నారని, వారికి జీవితాలు ఉన్నాయని, వాటిలో కూడా సుఖదుఃఖాలు ఉన్నాయని గ్రహించినవాడు సూర్యం. పక్కవారిని పట్టించుకోవటం మనిషిగా మన కర్తవ్యం అని, పట్టించుకోలేకపోవటం దాదాపుగా దౌర్భాగ్యమేనని గట్టిగా విశ్వసించినవాడు.

పాట గురించి మాట్లాడవలసి ఉండగా చిత్ర కథంతా చెప్తున్నాను ఎందుకని అనుకోవటానికి లేదు. ఎందుకంటే, ఇందాక చెప్పినట్టు ఈ కథలో చెప్పబడిన సిద్ధాంతాలను, ఆదర్శాలను పాటల్లో  ఇమిడ్చి, ఈ చిత్ర స్థాయినే కాదు, తాను రాసిన ఇతర పాటల్లాగే, ఈ పాటలతో కూడా తెలుగు సినీ గీతాల స్థాయిని నిలబెట్టారు గురువుగారు.

తనకి జనం మధ్య మెలగటం ఇష్టం. కలిమి-లేమి, పెద్ద కులం-చిన్న కులం అన్న తారతమ్యాలు తనకి ఎప్పుడూ కనపడవు. వాళ్ళ మధ్య ఉంటాడు, వాళ్ళు తినేది తింటాడు, వాళ్ళ ఆనందమే తనదనుకుంటాడు. వాళ్ళని ప్రేమగా చూస్తాడు. తన ఆదర్శాలకు మరింత ఊపిరి పోసే పడతి తన తోడుగా నడుస్తాననటంతో ఆనందంగా తనకు నచ్చినట్లు వాళ్ళతో మెలుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు తనని ఒక పాట పాడమంటారు. శాస్త్రీయంగా ఆలాపన చేయటంతో, కట్టెలు కొట్టుకొని రోజుకూలీ సంపాదించే వాళ్ళకి ఏమీ అర్థం కాక, బుర్రలు గోక్కుంటారు. తనలో తానే చిన్న నవ్వు నవ్వుకుంటాడు సూర్యం. ఆ నవ్వు వెనుక ఎంత అర్థం ఉందో, అదే ఈ పాటలో ప్రతిబింబిస్తుంది.

తరలి రాదా తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం

గగనాల దాకా అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా


వసంత కాలానికి చెట్లు, చేమలను అందంగా మార్చాలని ఉంటుంది. కానీ అది ఉన్న చోటనే ఉంటే వనాలు తన దగ్గరకు రావు కదా? అందుకని తానే దిగి వస్తుందిట.

ఆకాశాన్ని చేరాలనే ఉత్సాహంతో నదులలో, సముద్రాల్లో ఉండే అలలు ఎంత పైకి ఎగసిపడినా కొంత దూరమే ఎగరగలవు కనుక, వాటిని చేరటం కోసం వర్షం కిందకి వస్తుందిట ఆకాశం నుంచి. వర్షాన్ని "మేఘాల రాగం" అనటం కేవలం గణాల అమరిక కోసమా, లేక ఈ చిత్రంలో సంగీతానికున్న ప్రాముఖ్యతను మరోసారి ప్రస్తావించటమా?

సమాజంలోని ఉన్నత వర్గాలకు, అణగారిన వర్గాలకు మధ్య ఉన్న దూరాన్ని తూర్పారబట్టటం ఈ చిత్రం ఉద్దేశం. సంగీతాన్ని తప్ప పక్క మనిషిని గౌరవించని మూర్ఖ వ్యక్తిగా తండ్రి పాత్రని మలచి, ఆయనకు విరుద్ధమైన పాత్రలో చిన్న కొడుకుని సృష్టించి, వారి మధ్య జరిగే అదృశ్య యుద్ధం ద్వారా చక్కటి సందేశాన్ని సమాజానికి ఇచ్చారు దర్శకుడు. ఆ దూరాన్ని ప్రకృతిలోని అంశాల ద్వారా సున్నితంగా పోల్చారు గురువుగారు. వసంతం, ఆకాశం ఉన్నతమైనవి అయితే, ఆ స్థాయికి చేరలేని అలలతోను, వనాలతోను కార్మికులను, కర్షకులను పోల్చటం ఎంత అపురూపమైన భావన?

వెన్నెల దీపం కొందరిదా? అడవిని సైతం వెలుగు కదా?

ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా

చందమామ, చంద్రుడు, నెలవంక, చుక్కలఱేడు, నెలరాజు, రేరాజు అన్నీ విన్నాము. "వెన్నెల దీపం" ఎంత ముద్దైన ప్రయోగం? ఇంతకీ ఆ చందమామ ఏ ఒక్కరికో సొంతం కాదు కదా? జాతి, కుల, మత, వర్గ భేదాలే కాదు, పశుపక్ష్యాదులకు, మృగాలకు, మొక్కలకు, ఇంకా చరాచర వస్తువులకు కూడా సమానంగా వెన్నెలను పంచుతుంది కదా? అలాగే గాలి కూడా కొందరి కోసం వీచి, కొందరి జోలికి పోకపోవటం జరగదు కదా? అందరికీ సమానంగా అందుతుంది కదా?

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం

గురువుగారికి ఉదయం వేళను ఉపమానంగా వాడటమంటే చాలా ఇష్టమని నా అభిప్రాయం. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ప్రేరణనిచ్చే సాహిత్యం రాయవలసివచ్చినప్పుడు తప్పకుండా ప్రస్తావిస్తారు ఉదయాన్ని. ఈసారి ప్రభాత రాగం అని ముద్దుగా పిలిచారు. ఈ రాగం ప్రతిరోజూ ప్రతి మనిషినీ ఒకేలా నిద్ర లేపి తాజాదనం నింపుతుందిట. అదే మనకి మార్గనిర్దేశమట.

ఈ పోలికలు, ఈ ప్రస్తావనలు చూస్తుంటే నాకు సుప్రసిద్ధ అన్నమాచార్య కీర్తన "బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే" గుర్తు రాక మానదు. "నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటునిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమియొకటే, కడగి యేనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే"... పద కవితా పితామహుడు ఏనాడో చెప్పిన ఈ అమూల్యమైన నీతినే 1988 లో మళ్లీ ఈ చిత్రం ద్వారా నొక్కి వక్కాణించారు.

ఏదీ సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుజుని కథ దిశలెరుగని గమనము కదా?

కనుక గురువుగారు చెప్పవచ్చేది ఏమిటంటే, ఏదీ ఎవరికీ సొంతం కాదని, పక్కవారికి పంచటానికే ఏదైనా ఎవరికైనా ఉందని. ఇందులో ఎంతటి సృష్టి రహస్యం ఉందని? ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాక్యం... "పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం". సూర్యుడు వెలుగుని పంచకపోతే మనకి గానీ, ఏ జీవరాశులకైనా గానీ మనుగడ ఉందా? సముద్రం ఉప్పుని పంచకపోతే బ్రతుక్కి ఒక రుచి ఏడుస్తుందా? నదీనదాలు నీళ్ళు పంచకపోతే ఒక్క పూటైనా గడుస్తుందా? చెట్లు-చేమలు కాయల్లోను, పళ్ళలోను, ధాన్యంలోను ఆహారం పంచకపోతే భుక్తి ఎలా? పశువులు పాలు పంచకపోతే పాడి ఎలా? అమ్మ, నాన్న ప్రేమ పంచకపోతే ఎదుగుదల ఎలా? మనకి జబ్బు వస్తే తగ్గించే డాక్టర్లు తమ పరిజ్ఞానాన్ని పంచినట్లే. మనకి బాధ కలిగితే ఓదార్చే స్నేహితుడు మనకి సానుభూతిని పంచినట్లే. మన కాళ్ళకి అడ్డాలు పడుతూ ఇంట్లో తిరిగే మన పసి పిల్లలు మనకి ఆనందాన్ని పంచుతారు. వెరసి చెప్పవచ్చేది ఏమిటంటే, "పంచటం" అనేది లేకపోతే ఇంకేమీ లేదు, అంతా సూన్యమే. ఇది తెలుసుకోలేకపోతే, ఆ మనిషి మనుగడకి ఒక దారీ తెన్నూ లేనట్లే అంటారు గురువుగారు.

ఇకపోతే రెండవ చరణాన్ని మన కథలోని తండ్రీకొడుకుల భావజాలంలోని వ్యత్యాసం వల్ల ఏర్పడే ఘర్షణను అద్దం పట్టేలా రాశారు కవి. మరి సమయాభావం అవ్వటం వల్లో, రసాభాస అయ్యేటట్టు ఉందనుకున్నారో, ఒక చరణంలో చెప్పిన విషయాలను వాక్యాల్లోనో, కనుసైగలతోనో చెప్పించేద్దాం అనుకున్నారో, ఏ కారణం వల్లనో గానీ అది చిత్రీకరించలేదు, రించినా మనకి చూపించలేదు. కనుక సినిమాలో ఈ చరణం మనకు తారసపడదు. అయితే ఆడియో కేసెట్లలో ఉంటుంది.

తండ్రి సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యతనే జీవితానికి వర్తింపజేస్తూ, తనయుడు పలికే సుభాషితాలు ఇవి...

బ్రతుకున లేని శృతి కలదా? ఎద సడి లోనే లయ లేదా?

ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా?

ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

కూసే కోయిల పోతే కాలం ఆగిందా?

పారే ఏరే పాడే మరో పదం రాదా?

మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా?

మొదటి అంకంలో మనం చెప్పుకున్నట్టు, గురువుగారు తనకు ఎంతో పేరును, ఇంటి పేరును తెచ్చిపెట్టిన సిరివెన్నెల గీతంలో గుండె చప్పుడును "హృదయ మృదంగ ధ్వానం" అని యమా బరువుగా అన్నప్పటికీ, ఈ పాటలో అతి సరళంగా "ఎద సడి" అనేశారు. ఈ రెండు ప్రయోగాలను చూస్తే "సీతారామయ్య గారి మనవరాలు" చిత్రంలో సుధాకర్ "హ్హెవ్వీ...", "లై...ట్" అనటం గుర్తొస్తుంది నాకు.

ఇంతకీ సంగీతానికి అతిముఖ్యమైన శృతిలయలను జీవితానికి అన్వయిస్తూ, "బ్రతుకున లేని శృతి కలదా? ఎద సడి లోనే లయ లేదా?" అన్నారు. ఏ పాటైనా ఏ శృతిలో మొదలుపెట్టామో, చివరి వరకు ఆ శృతిలో పాడతాము. అంటే ఒక నిర్ణీత శృతిస్థానంలో మొదలైన పాట మనం అనుకున్నట్టు అదే శృతిలో సాగాలి అనుకోవటం మామూలే. అలాగే జీవితం కూడా ఏ అపశృతీ ఎదురవ్వకుండా అనుకున్నట్టుగా సజావుగా సాగాలని కోరుకుంటాము. అలాగే మనుగడకు అన్నిటికంటే ముఖ్యంగా కావలసినది గుండె కొట్టుకోవటం. ఆ చప్పుడు ఆగితే ఇంకేమైనా ఉందా? కనుక జీవితానికి, శృతిలయలకి అవినాభావ సంబంధం ఉందనటంలో ఏ సందేహమూ లేదు. కాబట్టి, జీవితం సజావుగా సాగాలంటే అది శృతిలయలు తప్పకుండా సాగాలి, కళ విరాజిల్లాలంటే జీవితం దానికి వేదికవ్వాలి.

అయితే, జీవితం కంటే సంగీతమే ప్రధానమనుకునే తన తండ్రికి రెండు ముక్కల్లో జీవితం ప్రాధాన్యతను చెప్పేస్తాడు సూర్యం. వసంతకాల ఆగమనానికి సంకేతంగా కూసే కోకిల, దాని కూతకి కాలం చెల్లితే  కూయటం ఆపేస్తుంది. కానీ దానివల్ల కాలం ఆగదు, సాగుతూనే ఉంటుంది. అది కాకపోతే, పారే ఏరు లోంచి సంగీతాన్ని వినిపిస్తుంది ప్రకృతి. సంగీతం రూపం మారచ్చు, కానీ కాలం ఆగదు, జీవితం ఆగదు. మనసుల్ని ఆనంద డోలికల్లో ఊపగల మురళీగానం కూడా పుట్టేది దాన్ని పెదవులు పలికిస్తేనే కదా?

ఇంకా "చుట్టుపక్కల చూడరా" లాంటి అద్భుతమైన పాటలు ఇందులో ఉన్నాయి. మరోసారి వాటి గురించి మాట్లాడుకుందాం. మంచి నటీనటవర్గం, సాంకేతిక బృందం కలిసి మీటిన ఈ "రుద్రవీణ" గురించి కూడా ఒకరోజు మాట్లాడుకుందాం.






సిరివెన్నెల పదలీల - స్వాతిముత్యాల మాల - ఒకటవ అంకం:

https://pulihora-perugannam.blogspot.com/2020/06/blog-post.html

Friday, 30 April 2021

తలుపు

నూనె సలసలా కాగింది. గారెలు ఎర్రగా వేగుతున్నాయి. ఇంకొక్క వాయ వేస్తే, ఇవి కూడా అయిపోతాయి. ఆఖరున బూరెలు కూడా వేయించేస్తే, కాస్త ఫ్యాన్ కిందకి వెళ్లి కూర్చోవచ్చుఅనుకుంటూ తడి చేసుకున్న అరచేత్తో అరిటాకును తుడుస్తూ, మోచేత్తో నుదుటికంటిన చెమట తుడుచుకుంది సుబ్బలక్ష్మి. పప్పు సరైన పదునుగా రుబ్బుకుంటే గారెలు, బూరెలు కరకరలాడుతూ వస్తాయని తన నాన్నమ్మ దగ్గర నేర్చుకుంది. వాటి విషయంలో తను చేయి తిరిగిన వంటగత్తె. ఆఖరి వాయ గారెలు నూనెలో వేసేసి, అంతకుముందు వేసిన గారెలను చిల్లుల బుట్టలోంచి ఒక బేసిన్ లోకి కుమ్మరించింది. ఇక బూరెల సంగతి చూడాలని గ్రైండర్ లోంచి పిండి తీయబోతుండగా ధడ్ మని పెద్ద శబ్దం వినిపించింది. ఎవరో బెడ్ రూమ్ తలుపును గట్టిగా వేశారు. ఉన్నట్టుండి అంతా నిశ్శబ్దం. హాల్లో కూర్చున్న అతిథులందరూ తలుపు వైపుకి ఒక్క క్షణం చూసి, మళ్లీ ఎవరి కబుర్లలో, పనుల్లో వాళ్ళు పడ్డారు.

 

అలాగే సుబ్బలక్ష్మి కూడా హాలు వైపు తొంగి చూసినదల్లా వెనక్కి వచ్చి, గ్రైండర్ లోంచి పిండి తీస్తోంది. అంత ధబ్బున తలుపులు వేస్తే, పై అంతస్తులో ఉండే ఓనర్లు వీళ్ళని ఏమీ అనరా అనుకుంది. మళ్లీ తన ఆలోచనకి తనే నవ్వుకుంది. మూడు నెలల నుంచి అద్దె బకాయి పెడుతుంటే తన ఓనర్ ఏమనుకుంటున్నాడో అనిపించింది.

 

సుబ్బలక్ష్మి భర్తది చిరుద్యోగం. కరోనా పుణ్యమా అని అదీ పోయింది. తనకి చేతనైనది వంటే. వేన్నీళ్ళకి చన్నీళ్ళు అన్నట్టు, పిల్లలకి కనీసం పూటకి ఇంత పెట్టాలంటే తానూ ఏదో ఒకటి చేయాలని మధ్యాహ్నం భోజనాలు వండి పెట్టటానికి కుదిరింది. అంతకుముందు వరకు మూడు నాలుగు బేరాలు ఉండేవి. ఎన్నారై కొడుకులు, కూతుళ్ళు ఉన్న పెద్దవాళ్ళు తాము వంట చేసుకోలేక, సుబ్బలక్ష్మి వండి పెడితే తింటూ నెలకి ఇంతని ఇచ్చేవారు. కరోనా మొదలయ్యాక వాళ్ళూ భయంతోకొన్నాళ్ళు వద్దులే అమ్మాఅనేశారు.

 

చాలా రోజుల తర్వాత నిశ్చయ తాంబూలాల కార్యక్రమానికి వంట చేయమంటూ వీళ్ళు పిలవగానే ఒప్పుకుంది. పూర్వం తన తల్లి వెనకాల ఇలా శుభకార్యాలకు వెళ్లి వండటం అలవాటే కనుక, అంత కష్టంగా అనిపించట్లేదు. ఈరోజు వచ్చే డబ్బుతో కనీసం ఒక్క నెల అద్దె బాకీ అయినా తీరుతుంది అనుకుంటూ ఉండగా, మళ్లీ తలుపు కొట్టిన శబ్దం. పెళ్లికూతురి తండ్రిరా అమ్మాఅని పిలుస్తున్నాడు. అయితే, లోపలకి వెళ్లి తలుపులు వేసుకున్నది పెళ్లికూతురన్నమాట అనుకుంది సుబ్బలక్ష్మి. “ఉండు వస్తానుఅని విసుక్కుంది లోపల నుండి పెళ్లికూతురు.

 

బూరెలు వేస్తూ ఆలోచనలో మునిగింది లక్ష్మి. తనకీ ఇద్దరు కూతుళ్ళున్నారు. వాళ్ళకీ పెళ్లిళ్ళు చేయాలి. ఒకొక్క ఏడాదీ గడుస్తుంటే, వాళ్ళకి ఒకొక్క ఏడూ వయసులు పెరుగుతుంటే, దుడుకుగా ఉంటోంది తనకి. పై చదువులు చెప్పించటం మాట, కట్నాల మాట దేవుడెరుగు, అసలు వాళ్ళని సరిగ్గా చూసుకోగలిగే మగపిల్లల్ని వెతకటం ఎలాగో కూడా తెలియదు.

 

పెళ్లికూతురు లోపలకి వెళ్లి అరగంట అవుతోంది. ఎందుకు అంతసేపు ఉండిపోయిందో! వాళ్ళ నాన్న తలుపు కొడుతుంటే అంత విసుక్కుంటుంది ఎందుకు? అనుకుంది. బూరెల పని కూడా చివరికొచ్చింది. అమ్మయ్య అనుకొని, స్టవ్ కట్టి, కాసేపు పెరట్లోకి వెళ్లి నుంచొని, చీర కొంగుతో చెమట తుడుచుకుంది.

 

ఇంట్లో కూతుళ్ళు వండుకు తిన్నారో లేదో అనుకుంటూనే, వడ్డన చేయాల్సిన సమయం అయ్యేవరకు కిటికీ పక్కన చతికిలబడింది.

 

*******

 

పరమేశ్వర రావు స్కూల్ మాస్టారు. తన భార్య పారిజాతం కారు ప్రమాదంలో చనిపోయి పదేళ్ళు అవుతోంది. ఒక్కగానొక్క ఆడపిల్లను పెంచటం తనకొక ఛాలెంజ్. ఇంతవరకు పనిచేయటం, ఇంటికి జీతం తెచ్చివ్వటం తప్ప, తను ఏమీ పట్టించుకోలేదు. చివరకి తన కూతురు క్లాస్ లో చదువుతోందో కూడా తనకు తెలియదు. అలాంటిది ఇప్పుడు తాను వంట నేర్చుకుని, తనకూ కూతురికీ వండటం ఎలా? సాయంత్రం అయ్యేసరికి హోమ్ వర్క్ చేయించటం, ఎప్పుడైనా ఒకసారి కొత్త బట్టలు కొనటం, రేపో మాపో పెళ్లి చేయటంచిన్న విషయం నుంచి పెద్ద విషయం దాక అన్నీ ఛాలెంజ్ లే. తన భార్య ఎన్నెన్ని పనులు చేసేదో తను దూరమయ్యాక గానీ తనకి తెలిసిరాలేదు. అసలు తనకే అర్థం కావట్లేదు ఆమె లేని లోటుని ఎలా అధిగమించాలో, ఇక పిల్లని పెంచటం అంటే మాటలాఅని బెంబేలెత్తుతూ ఉండగా, భార్య పుట్టింటివారు వచ్చి, పిల్లని మేము పెంచుకుంటామన్నారు.

 

సరే, ఆడపిల్ల ఆడ పెంపకంలో పెరిగితే మంచిదే అని వాళ్ళతో పంపాడు. కూతురికి ఇష్టమేనా అని కనుక్కున్నారు. ఆడుకునే వయసులో ఉన్న ఆడపిల్ల. ఏం తెలుస్తుంది? సెలవులకి, పండగలకి వెళ్లినట్టే వెళ్లింది.

 

తీరా కళ్ళు మూసి తెరిచే లోగా అప్పుడే దానికి పెళ్లి. సంబంధం అదే చూసుకుంది. దూరపు బంధువుల అబ్బాయి. ఏదో పెళ్లిలో కలిశామన్నారు. ఇన్నేళ్ళలో తనకీ కూతురికీ మధ్య మాటలు కూడా తగ్గిపోయాయి. ఎదిగే పిల్ల తండ్రితో ఎన్ని పంచుకుంటుంది? నిజంగా తల్లి అవసరం ఉన్న సమయంలోనే అలా జరిగింది.

 

ప్రేమలో పడిందని, పెళ్లి చేసుకుంటానంటోందని పెంచినవారే కబురుపెట్టారు. పెళ్లి మాకు ఇష్టం లేదని, పెళ్లి జరిపిస్తే మీరే జరిపించుకోమని చేతులు దులుపుకున్నారు. కూతురు తనకి ఏమీ చెప్పలేదు, అడిగినా ఏమీ మాట్లాడలేదు. ఈరోజు ఇక్కడ కలిశాక కూడా ఏమీ మాట్లాడలేదు. ఫీజ్ కడతాను, చదువుకో అమ్మా అంటేనాకు చదువు వద్దు, కుర్రాడు చాలు, పెళ్లి చేయమంది. తాంబూలాల తతంగం అయ్యాక, ఎందుకో రుసరుసలాడుతూ లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది.

 

అరగంట అయ్యాక పిలిస్తే విసుక్కుంటోంది. తనేం చేయాలి? కాబోయే వియ్యంకుల కుటుంబం, ఇంకొంత మంది బంధుజనం. తను మళ్లీ మళ్లీ పిలిస్తే ఎవరైనా తన కూతురినే తప్పుగా అనుకుంటారు. వెనక్కి వచ్చి ఒక కుర్చీలో కూర్చున్నాడు.

 

తనని చూసి చేతకానివాడు అన్నవాళ్ళు ఉన్నారు. తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు అని కూడా అన్నారు. జాలి పడ్డవాళ్ళు ఉన్నారు. తనేమిటో తనకే ఒక ప్రశ్న. కానీ తన కూతురికి మాత్రం తన పట్ల ఏహ్య భావం రాకూడదు అనుకొనేవాడు. తనకి అదంటే వల్లమాలిన ప్రేమ. చిట్టి పాదాలతో గుండెల మీద తన్నించుకున్న నాటి నుండి ఉన్న ప్రేమ. మొదటిసారి స్కూల్లో దింపినప్పుడు కన్నీటి జీర వల్ల మసకగా కనిపిస్తున్నా చేయి ఊపిన ఆనాటి ప్రేమ. మొన్నటి వారంనాకు కుర్రాడే కావాలి, ఇంకేమీ వద్దుఅని కోపంగా అరుస్తూ చెప్తుంటే, నిష్టురాలాడుతున్న అత్తారిపై కోపం, తన బంగారు తల్లిని బుట్టలో వేసుకున్న కుర్రాడిపై కోపం వచ్చాయి కానీ, తన కూతురి మీద కోపం రాలేదు. ఇప్పటికీ దాన్ని చూస్తుంటే ఐస్ క్రీమ్ కావాలని అడుగుతున్న చిన్నపిల్లే కనిపిస్తోంది.

*******

 

రామలక్ష్మికి మనసంతా గుబులుగా ఉంది. తన భర్త కృష్ణమూర్తిది, తనది చిన్న చిన్న గుమాస్తా ఉద్యోగాలు. ఒక్కడే కొడుకు కదా, వాడిని బాగా చదివిస్తే కనీసం వాడైనా మంచి ఉద్యోగం చేసుకొని వాళ్ళనీ చూసుకుంటాడేమో అని ఆశపడ్డారు. “మనల్ని చూసుకోకపోయినా కనీసం వాడి కాళ్ళపై వాడు నిలబడి పెళ్ళాం బిడ్డల్ని చూసుకుంటూ, దర్జాగా బ్రతికినా చాలు, మనలా అత్తెసరు బ్రతుకులు కాకుండాఅనుకొని, అప్పులు చేస్తూ, చీటీలు పాడుతూ, కొడుక్కి కాలేజీ ఫీజ్ కడుతున్నారు.

 

కాలేజీలో చేరిన నెల లోపే స్మార్ట్ ఫోన్ కావాలన్నాడు. కష్టమైనా కొనిచ్చారు. ఇంకా చదువు పూర్తవ్వనే లేదు, మొన్నటి నెల ఇంటికొచ్చి, ఒక పిల్లని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానన్నాడు. నాలుగు తగిలించాలి అనిపించినా, ఈడొచ్చిన కొడుకుని కొట్టలేక చీవాట్లు పెట్టారు ఇద్దరూ.

 

ఉక్రోషంగా బయటకి వెళ్లిన కొడుకు అర్థరాత్రి వరకు ఇంటికి రాకపోయేసరికి చాలా కంగారు పడ్డారు. తీరా ఇంటికి వచ్చినా మూడు రోజుల వరకు ఏమీ మాట్లాడకుండా, ఏమీ తినకుండా గదిలో కూర్చొనేవాడు. నాలుగో రోజుకి తల్లిదండ్రులే తగ్గి, “చదువు అయిపోయి, ఉద్యోగం రానీ నాన్నా, పెళ్లి చేస్తాములేఅన్నారు. కాదు, కూడదు అన్నాడు. ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా లాభం లేకపోయింది. సామ దాన భేద దండోపాయాలన్నీ బూడిదలో పోసిన పన్నీరే.

 

చివరకికంగారు పడకండి, మళ్లీ వస్తానంటూ ఉత్తరం రాసి పెట్టి వెళ్లి, మళ్లీ వారం రోజుల తర్వాత పిల్లతో సహా ఇల్లు చేరాడు. “తను నా భార్య, ఇక్కడే ఉంటుందిఅన్నాడు. ఇద్దరూ నిర్ఘాంతపోయారు. పిల్లను పెంచిన వారితో మాట్లాడాలని ప్రయత్నించారు. వీళ్ళ మాటలు వినకపోగా, “డబ్బున్న పిల్లకి ఎర వేశారంటూ వీళ్ళని ఆడిపోసుకున్నారు. పిల్ల తండ్రితో మాట్లాడారు. అతనూ నిస్సహాయుడే అని అర్థమయ్యింది. బయటకి చెప్పుకోలేని బాధ, గుబులు. ఏం చేస్తే పిల్లాడు ఏమైపోతాడో అని. ఒప్పుకుంటే చదువు పూర్తవకుండానే సంసారంలో పడి, ఎలా జీవితంలో నిలదొక్కుకుంటాడు? ఒప్పుకోకపోతే మొదటికే మోసం రావచ్చు.

 

తీరికగా ఆలోచించే అవకాశం, లాభ నష్టాలు బేరీజు వేసే సమయం కూడా పుత్రరత్నం తమకు ఇవ్వలేదు. “సరే, మనకే ఇంకో కూతురు పుట్టి ఉంటే ఏం చేసేవాళ్ళం? ఇద్దరినీ మన పిల్లలే అనుకొని చూసుకుందాంఅనే నిర్ణయానికి వచ్చారు.

 

కొడుకు పెళ్లి చేసుకొని ఇంటికి వచ్చాడని చెప్పుకోలేక, జనం కోసం తాంబూలాలని, పెళ్ళని తతంగాలు నడిపిస్తున్నారు. ఈరోజు అదే హడావిడి. పిల్ల వైపు తండ్రి, ఇంకో కుటుంబం తప్ప ఎవ్వరూ రాలేదు. అంతా బాగుంటే, ప్రయోజకుడైన కొడుకుని గర్వంగా చూసుకుంటూ వరుడి తల్లిదండ్రుల హోదాలో హుందాగా కూర్చోవలసినవారు. తమ ఇంట్లోనే ఇలా ఇబ్బందికర వాతావరణంలో సిగ్గుపడుతూ కూర్చొనేవారు కాదు.

 

తాంబూలాలు మార్చుకున్నాక, భోజనాలకి ఇంకో గంట టైముందని అందరూ ఫ్యాన్ల కింద కూర్చొని కూడా, వేసంకాలం ఎండ తాకిడి, వంటింట్లోంచి వస్తున్న వేడి కలిసి ప్రతాపం చూపిస్తూ ఉండటంతో, విసినికర్రలతోను, చీర కొంగులతోను విసురుకుంటున్నారు మధ్యమధ్యలో నిట్టూరుస్తూ. చిన్న సౌండ్ తో టీవీ ఆడుతోంది. బంధువుల్లో ఒక్కరోజు కూడా సీరియల్ మిస్ అవ్వకూడదనుకున్న ఇద్దరు పెద్దవాళ్ళు దానికి దగ్గరగా కూర్చొని చూసేస్తున్నారు. కొడుకు, కోడలు ఇంకో మూల టేబుల్ దగ్గర కూర్చొని ఉన్నారు. పిల్ల మెడలో దాచాలన్నా దాగని పసుపు తాడు. ఏవో గుసగుసలాడుకుంటున్నారు. ఉన్నట్టుండి పిల్ల రయ్యని లేచి, సరసరా నడుచుకుంటూ వెళ్లి ధబ్ మని తలుపు వేసుకొని గదిలోకి వెళ్లింది.

 

రామలక్ష్మి, కృష్ణమూర్తి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వియ్యంకుడి వైపు చూశారు. ఆయనా వీళ్ళని చూశాడు. ముగ్గురూ ఇబ్బందిగానే ఉన్నారు. కొడుకు వంక చూశారు. వాడు ఏమీ ఎరగనట్టు చేతిలోని ఫోన్ వైపే చూస్తున్నాడు. ఏం చేయాలో తెలియలేదు. మళ్లీ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. తల దించుకొని పేపర్ చదువుతున్నట్టు నటిస్తున్నాడు కృష్ణమూర్తి. ఇక లాభం లేదని తనే లేచి కొడుకు దగ్గరకు వెళ్లి, “ఏమయ్యిందిరా?” అంది రామలక్ష్మి. “ఏమీ లేదే!” అని భుజాలు ఎగరేశాడు కొడుకు.

 

ఇంకా రెట్టించటం ఎందుకులే అని వంట ఎంతవరకు అయ్యిందో చూద్దామని వెళ్లింది. బూరెలు వేస్తే వంట అయిపోయినట్లే. ముందు పెద్దవాళ్ళకి, మగవాళ్ళకి భోజనం పెట్టేస్తే సరి అనుకుంది. ఇరుకైన అద్దింట్లో అరిటాకుల్లో బంతి భోజనం పెడితే, ఒకొక్క వాయకి ఎనిమిది విస్తర్లు కూడా లేవకపోవచ్చు. పిల్ల బయటకి వస్తే గదిలోనూ ఒక ముగ్గురికి పెట్టే జాగా ఉంది. వచ్చేస్తుందిలే అని చూస్తోంది. ఇంతలో వియ్యంకుడు వెళ్లి తలుపు తట్టాడు. “ఉండు వస్తానుఅని విసుక్కుంది లోపల నుండి పిల్ల.

 

రామలక్ష్మి భారంగా నిట్టూర్చింది. మనవాడే ఇంకా చిన్నవాడంటే, పిల్ల ఇంకాను. ఇద్దరు పిల్లలని ఇకపై ఎలా పెంచాలి? ఇద్దరూ సఖ్యంగా ఉంటే పర్వాలేదు. ఇంకా తెలిసీ తెలియని వయసులో ఉన్నారు. చీటికీ మాటికీ వాదులాడుకుంటే? మన సంసార భారమే మనం మోయలేకుండా ఉంటే, ఇప్పుడీ చింత ఒకటా? కొత్తగా పెంపకానికి ఎదిగిన చంటిపిల్లని తెచ్చుకున్నట్టుంది రామలక్ష్మికి. గుమ్మం పైన వేలాడుతున్న కళ్యాణ వెంకటేశ్వరుడి ఫోటో చూస్తూ గట్టిగా దణ్ణం పెట్టుకుంది.

 

*******

 

ప్రకాశ్ అసహనంగా వాచీ చూసుకున్నాడు. కరోనా సమయంలో ఇల్లే దాటకూడదని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎన్నో నెలలుగా. మాస్కులు పెట్టుకోకుండా తిరిగేస్తున్నవాళ్ళు, వద్దురా బాబూ అంటున్నా పార్టీలకి, ఫంక్షన్లకి వెళ్లిపోతున్నవాళ్ళు తనకి తెలిసినవాళ్ళలో ఉంటున్నారు. అయినా తన కుటుంబం మాత్రం చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు ఇంట్లో చంటిపిల్లలు ఉండటంతో. అతనిది పట్నంలో ఉద్యోగం. చదువవ్వగానే అప్పుడే వద్దంటున్నా పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. వెంటవెంటనే పిల్లలు. కాలేజీ కుర్రాడిగా ఉన్నవాడు, భర్తగా, తండ్రిగా ఎలా పరివర్తన చెందుతూ వచ్చాడో తనకే తెలియకుండా జరిగిపోయింది. కష్టపడి పెంచిన తల్లిదండ్రులంటే ప్రకాశ్ కి ఎంతో గౌరవం. వాళ్ళ శ్రమకి న్యాయం చేయాలని, ఉద్యోగం కూడా కష్టపడి కాదు, ఇష్టపడి చేస్తుంటాడు.

 

మొన్న భోజనాలు చేస్తుంటే పరమేశ్వర్రావు బాబాయ్ ఫోన్ చేశాడు. చెల్లికి తాంబూలాలని, రావాలని అడిగాడు. కరోనా సమయంలో ఎందుకు బాబాయ్, తర్వాత చేద్దాం అన్నాడు. కానీ తప్పదులే అని బాబాయ్ అంటుంటే, ఏదో నిర్వేదం వినిపించింది. తనకి చిన్నప్పటి నుంచి బాబాయంటే చాలా ఇష్టం. చాలా మంచివాడు. చాలా సరదాగా ఉండేవాడు. పదేళ్ళ క్రితం పిన్ని వెళ్లిపోయాక ఉన్నట్టుండి మౌనంగా మారిపోయాడు. చెల్లిని తనతోనే ఉంచుకున్నా, కొన్నాళ్ళకి మామూలు మనిషి అయ్యేవాడేమో. అనవసరంగా ఒంటరివాడై, ఒంటరి వాడిగానే మిగిలిపోయాడు. తమ కుటుంబంతో కూడా మాటలు క్రమేణా తగ్గిపోయాయి.

 

తన కూతురిని పెద్ద డాక్టర్ గా చూడాలని బాబాయ్ కి, పిన్నికి మొదటి నుంచి కోరిక. అది కాదంటే కాదని ఇంటర్ లో మాథ్స్ చదివి, డిగ్రీలో చేరింది. ఇప్పుడు అది కూడా చదవనని, పెళ్లి చేసుకుంటానని చెప్తోందట. కనీసం తాంబూలాలు అయిపోయాక ఒకసారి చెల్లితో మాట్లాడి నచ్చచెపుదామనుకొని వచ్చాడు.

 

ఇక్కడకి వచ్చాక బాబాయ్ చెప్తే మిగతా కథంతా తెలిసింది. అయినా సరే, ఒక్కసారి చెల్లితో మాట్లాడాలని చూస్తున్నాడు. కానీ అది అవకాశం ఇస్తేగా? ఉదయం ముస్తాబు, తర్వాత తాంబూలాలు, తర్వాత కుర్రాడితో గుసగుసలు. తను వాళ్ళ దగ్గరకి వెళ్లి మాట్లాడదామని అనుకుంటుండగా, ఎందుకో ఉన్నట్టుండి రుసరుసలాడుతూ వెళ్లి ధబీమని తలుపు వేసుకుంది.

అరగంటైనా రాలేదు. బాబాయ్ వెళ్లి పిలిస్తే, లోపల నుండి గట్టిగా విసుక్కుంది. అది బయటకి రాగానే ఒక్క లెంపకాయ ఇవ్వాలనిపించింది.

 

అసలు దాన్ని కాదు. దాన్ని బుట్టలో వేసుకున్న కుర్రాణ్ణి పట్టుకొని నాలుగు పీకాలి. వాళ్ళ ఇల్లయిపోయింది. తనకే అవకాశం ఉండి ఉంటే కాలర్ పట్టుకొని, చెడామడా వాయించేసేవాడు. “ఏం చూసుకొని మా చెల్లిని ప్రేమించావు?”, “ఎలా పోషించాలని నీ ప్లాన్?”, “మా బాబాయికి అన్యాయం చేస్తావా?” అంటూ ప్రశ్నకో నాలుగు తన్నులు తన్నాలని ఉంది.

 

*******

 

రంగమ్మకి, సీతమ్మకి చాలా ఆనందంగా ఉంది. రంగమ్మ తన అక్క సీతమ్మతో ఫోన్లో మాటలే తప్ప ఎన్నో నెలలుగా కలవటమే లేదు. ఇప్పుడు కృష్ణం గాడి కొడుకు తాంబూలాల పేరు చెప్పి ఇద్దరూ కలిశారు. సీతమ్మ ఊళ్ళో ఎప్పుడూ కరెంటు కోతే. తనకి నచ్చిన సీరియల్ చూద్దామంటే వారంలో సగం రోజులు కుదరట్లేదు. రంగమ్మకి ఫోన్ చేసి కథ అడుగుతుంది రోజూ. దానితో పాటే మిగతా పిచ్చాపాటీ. వంకన వయసులో కూడా అక్కచెల్లెళ్లిద్దరూ రోజూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఈరోజు ఇక్కడ కరెంటుంది. ఇద్దరూ కలిసి సీరియల్ చూస్తున్నారు. హీరోయిన్ కి పాలలో మాత్ర కలిపేసింది విలన్. పాలు హీరోయిన్ తాగుతుందో లేదో అని గత శుక్రవారం నుండి ఉత్కంఠతో ఉన్నారిద్దరూ. ఈరోజు సోమవారం. కరెంటు కూడా ఉంది. సీరియల్ వేళకు తాంబూలాలు అవ్వవేమో అని చాలా టెన్షన్ పడ్డారు.

 

అయిపోయేసరికి చాలా హుషారుగా టీవీ పెట్టేసుకుని, చకచకా వాళ్ళని కావలసిన ఛానల్ నొక్కేశారు. అప్పటికే ఒక బిట్ అయిపోయింది. కానీ అదృష్టవశాత్తు ఇంకా హీరోయిన్ పాలు తాగుతూనే ఉంది. యాడ్స్ వచ్చాయి. వంటింట్లోంచి గారెల వాసనలు వచ్చి కడుపులో ఆకలి పెంచుతున్నాయి. యాడ్స్ వచ్చి ఉత్కంఠ రేపుతున్నాయి.

 

ఈలోపు మళ్లీ సీరియల్ రానే వచ్చింది. ఎవరో ఇంతలో తలుపుని ఢభేల్ మని వేశారు. గుమ్మం పైనుంచి లాగిన కేబుల్ వైరు జారి పడింది. టీవీలో సీరియల్ ఆగి తెల్లటి-నల్లటి చుక్కలు వచ్చేశాయి. అసహనంగా వెనక్కి చూశారు అక్కచెల్లెళ్ళు. లోపలకి వెళ్లిన వాళ్ళు తలుపు గడియ పెట్టుకొని ఎంతకీ రావట్లేదు. వైరు తలుపు సందులో ఉండిపోయింది. హీరోయిన్ పాలు తాగేసిందో ఏమో!

 

*******

 

వీరేంద్ర ఇంజినీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. రూప ఏడాదే డిగ్రీలో చేరింది. రెండేళ్ళ క్రితం ఒక పెళ్లిలో కలిశారు. వరసకి బావామరదళ్ళు అవుతారని తెలిసింది. పెళ్లికి వచ్చిన మిగతా యువతీ యువకులతో కొన్ని ఆటలు, కొన్ని పాటలు, కొన్ని జోక్స్, కొన్ని నవ్వులు, కొన్ని వెక్కిరింతలు, కొన్ని సిగ్గులు. పెళ్లి అయ్యేలోగామనిద్దరం ఒకరి కోసమే ఒకరం పుట్టామని నిర్ధారణకి వచ్చేశారు.

 

ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. ఫోన్లో గడిపే సమయం నిముషాలు దాటి గంటలయ్యింది. సరదా కబుర్లు చెప్పుకొనే దశ దాటేసి, కష్టం-సుఖం చెప్పుకొనే దశకి త్వరగానే వచ్చేశారు.

 

తన ఏడేళ్ళ వయసులోనే రూప తల్లి కార్ యాక్సిడెంట్ లో చనిపోయింది. “మంచిది కనుక దేవుడు తీసుకువెళ్ళాడుఅన్నారు. అమ్మమ్మ వాళ్ళుమా ఇంటికి రా అమ్మాఅన్నారు. అంతే కదా అని వెళ్లిపోయింది. మళ్లీ ఎందుకో నాన్న వెనక్కి రమ్మని పిలవలేదు. వచ్చి తనని తీసుకువెళ్ళలేదు. అమ్మమ్మ, తాతగారు, మావయ్యలు, అత్తలు, వదినలు, బావలు అందరూ బాగా చూసుకొనేవారు. కానీ ఏదో వెలితి. కొన్ని విషయాలు అమ్మతోనే పంచుకోవాలి అనిపించేది. అమ్మ ఉండేది కాదు. నాన్న గుర్తొచ్చేవాడు. కానీ వచ్చేవాడు కాదు. వచ్చినా అందరితోనూ కబుర్లు చెప్పి వెళ్లిపోయేవాడు. ఇదివరకటిలా తనని ఎత్తుకొని, కితకితలు పెట్టి ఆడించేవాడు కాదు. కథలు చెప్పేవాడు కాదు. బాగా మారిపోయాడు. కాసేపు ఉండి వెళ్లిపోయేవాడు. చాలా కోపం వచ్చేది. తనకి కోపం వస్తే అమ్మ బెల్లం ముక్క పెట్టి తగ్గించేది. ఇక్కడ ఎవరూ పెట్టేవారు కాదు.

 

నెమ్మదిగా ఏళ్ళు గడిచాయి. నాన్న రాకపోకలు తగ్గాయి. నాన్నకి ఫోన్ చేయాలని తనకీ అనిపించటం మానేసింది. స్కూల్లో ఎవరితోనూ స్నేహం చేయాలని అనిపించేది కాదు. ఎవరితో మాట్లాడినా ఇంట్లోమా అమ్మ అలా అంది, మా నాన్న ఇది కొనిచ్చారుఅంటూ చెప్పేవారు. చాలా చాలా కోపం వచ్చేసేది.

 

ఇంటికి వచ్చాక, అత్త వాళ్ళు హోమ్ వర్క్ చేయకపోతే, మార్కులు తక్కువ వస్తే తిట్టేవారు. అమ్మ ఉంటే తిట్టకుండా చెప్పేదేమో అనిపించేది. నెమ్మదిగా వాళ్ళు నాకు బట్టలు కొంటే, అమ్మయితే నాకిష్టమైన రంగు కొనేదేమో అనిపించేది. ఏదైనా వండి పెడితే, అమ్మయితే నాకిష్టమైనదే వండేది అనిపించేది. వాళ్ళు పనులు చెప్తే, అమ్మయితే చెప్పేది కాదేమో అనిపించేది. నెమ్మదిగా ఎవ్వరూ నచ్చటం మానేశారు.

 

అప్పుడే బావ కనిపించాడు. తనతో తీయగా మాట్లాడాడు. తనని ప్రేమగా చూశాడు. తనని దేవతలా చూశాడు. తనుఏమైనా తిన్నావా?” అని అడుగుతాడని తినబుద్ధి అయ్యేది. తనకిష్టమైనవే తనకి ఇష్టాలుగా మారాయి. రెండేళ్ళలో తను లేక నేను లేను అనే స్థితికి వచ్చేసింది. ఈలోగా వదినలకి అర్థమయిపోయింది తన సంగతి. పెద్దవాళ్ళకి చెప్పేశారు. వాళ్ళు అత్త వైపు ఎవరో అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకోవటం మొదలుపెట్టారు.

    

    ఉన్న పళాన మర్నాడు బావ కాలేజీకి వెళ్లిపోయింది. “నన్ను పెళ్లి చేసేసుకో. లేకపోతే ఇక నీకు కనపడనుఅనేసింది.

 

వీరేంద్రకి ఏమీ పాలుపోలేదు. పెళ్లి చేసుకోవచ్చు. కానీ తర్వాత ఎలా? భార్యగా తన దగ్గరకి వచ్చాక పోషించాలి కదా? కానీ పిచ్చిది ఇక కనపడను అంటోంది. ఏమైనా చేసుకుంటుందో ఏమో. అసలే చిన్న విషయాన్ని కూడా పెద్దగా చూసి బాధపడుతుంది. ఇక లాభం లేదు. అమ్మ, నాన్న ఏమైనా అంటే నచ్చచెప్పచ్చులేఅనుకున్నాడు. ఒక చిన్న గుడిలో పసుపు తాడు కట్టేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. రెండు రోజులు పెద్దవాళ్ళు ఏమీ మాట్లాడలేదు. తర్వాతమళ్లీ పెళ్లి చేస్తాం. చేసుకోండి. బుద్ధిగా చదువుకోండిఅన్నారు. వాళ్ళంటే అందుకే తనకి వల్లమాలిన ప్రేమ, పైకి చెప్పకపోయినా.

 

ఈరోజు తాంబూలాలు కూడా వాళ్ళే ఏర్పాటు చేశారు, మళ్లీ ఖర్చు, శ్రమ ఎందుకన్నా వినకుండా. ఎలాగైనా బాగా చదివి, ఉద్యోగం సంపాదించి, రూపని, అమ్మని, నాన్నని బాగా చూసుకోవాలి. మాటే తను రూపతో అంటున్నాడు.

 

ఈలోగా చీరకట్టు అలవాటు లేక కుర్చీ కోడు కింద రూప చీర కుచ్చిళ్ళు సడలాయి. తను సిగ్గుగా కుచ్చిళ్ళు చేత్తో పట్టుకొని లోపలకి పరుగుపెట్టింది. కంగారు తలుపు గట్టిగా వేస్తే ధడాల్ మని పడింది.




మధురవాణి త్రైమాసిక పత్రిక
జూలై 2021 సంచికలో ఈ  కథ  ప్రచురితం  అయ్యింది.


https://www.madhuravani.com/talupu