Pages



Thursday, 17 February 2011

అభి'మతం'

అనన్య 

మండే ఎండ వల్లో, టెన్షన్ వల్లో కానీ , శ్రీకర్ కి వళ్ళంతా చెమటలు పోస్తున్నాయి. గంట నుండి అక్కడే నిలబడ్డా, జేబురుమాలు పిండి ఆరేసే స్టేజీకి వచ్చిందే కానీ, తను చేరాల్సిన స్టేజీకి తీసుకెళ్ళే బస్సు మాత్రం రాలేదు. 

బహుశా కొన్నాళ్ళు అలవాటయ్యాక దోమల మందులన్నీ దోమల మీద పనిచేయటం మానేసినట్లు, యమలోకంలో అమలు చేసే శిక్షలన్నీ పాపుల మీద పని చేయటం మానేస్తే, వాళ్ళందరినీ తీసుకొచ్చి హైదరాబాదులో సిటీబస్సు స్టాన్డుల్లో నుంచోపెట్టచ్చు. దెబ్బకి దారిలోకొస్తారు.

శ్రీకర్ కి చేతుల్లో ఉన్న ఫైలు బరువనిపిస్తోంది. గొంతులోనే కాక, వంట్లో ఎక్కడా తడి జాడ తెలియట్లేదు. ఇప్పటికే ఈ గంటలో మూడుసార్లు చెరుకురసం కొనుక్కుని తాగాడు. ఎక్కడి గాలి అక్కడ ఉంది. "దేవుడా! ఎందుకురా నాకీ అవస్థ?" అనుకున్నాడు. అసలీ అవస్థ దేవుడు కచ్చి కొద్దీ తెచ్చిపెట్టింది కాదు. తనకు తానుగా కొనితెచ్చుకున్నాడు. హాయిగా, లక్షణంగా నాన్న చేసుకోమన్న వ్యాపారం ఊళ్లోనే చేసుకుని ఉంటే, ఈ  బస్సులూ,  ఇంటర్వ్యూలు,  ఎర్రటి  ఎండాకాలంలోనూ చొక్కా టకప్ చేసుకుని బెల్టు పెట్టుకుని, ఈ దుమ్ములో నుంచోవలసిన అవసరం...ఇవేమీ ఉండేవి కాదు. "నా కాళ్ళ మీద నేను నిలబడతాను" అంటూ బైల్దేరి వచ్చాడు ఇక్కడకి.

అసలే ఉద్యోగాలు లేక ఫీలవుతుంటే, పుండు మీద కారం జల్లినట్లు తనకి కాకుండా తమ్ముడికి సంబంధాలు వచ్చేస్తున్నాయి.  బీటెక్ చేసే కుర్రాళ్ళు ఇంకా మీసాలు కూడా పూర్తిగా రాకముందే ఉద్యోగస్తులు అయిపోతున్నారు. తను MCA చేసి సంవత్సరం అయినా, ఎన్నో గుమ్మాలు దాటీ, దాటీ  తన సర్టిఫికెట్ల ఫైలుకి తల పండిపోతోంది కానీ  తన అదృష్టం మాత్రం పండట్లేదు.

ఇప్పుడు ఇంకో ఇంటర్వ్యూ. రూములో ఫ్రెండ్ చెప్పాడు. అతనికి బంధువులెవరో వెళ్ళమని చెప్పారనీ, తనకి వెళ్ళే 'మూడ్' లేదనీ, కావాలంటే వెళ్ళమంటూ ఎడ్రస్ ఇచ్చాడు. ఎక్కడో ఊరికి చివర. రెండు బస్సులు మారి వెళ్ళాలిట. ఇప్పుడు 'కోటి' లో రెండో బస్సు కోసం నుంచున్నాడు. ఆ ఇంటర్వ్యూ ఉన్న ఏరియాకి ఎప్పుడూ తను వెళ్ళలేదు సరికదా, పేరు కూడా వినలేదు. ముస్తఫాపేట్ అట. నాలుగోసారి తన గొంతు, మనసు చెరుకురసం బండిని చూపిస్తుండగా, ఆ బస్సు రానే వచ్చింది.

కొన్నేళ్ళ తపస్సు ఫలించి దేవుడు ప్రత్యక్షమైనా ఇంత ఆనందం ఉంటుందో, లేదో! ఆ బస్సు 'హైదరాబాద్ బస్సుల ఆనవాయితీ' తప్పలేదు. మనుషులున్న చోట ఆగకుండా, 'చక్రం మన కాలుని ఎక్కడ తొక్కేస్తుందో' అనిపించేంత దగ్గర నుండి జర్రున పోయి, ఒక ఇరవై అడుగుల ముందర ఆగింది. శ్రీకర్ పరుగెత్తక్కర్లేకుండా, ఆ గుంపే తనని బస్సు డోరు దాకా తోసుకెళ్ళింది. ఎట్టకేలకు బస్సెక్కాడు. కూర్చునే చోటు దొరక్కపోయినా, మొత్తానికి ఎక్కానని సంతోషించాడు.

ఇప్పుడంటే తమ్ముడికి సంబంధాలు రావటం మొదలయ్యాయి కానీ, తనకి ముందే  వచ్చాయి ఆఫర్లు. రెండేళ్ళ క్రితం మావయ్య సరోజని వెంటపెట్టుకుని వాళ్ళింటికొచ్చాడు. "బావా! ఇంకో ఏడాదిలో శ్రీకరానికీ చదువు పూర్తైపోతుంది. నాకా, సరోజ ఒక్కతే కూతురు. చిన్నప్పటి నుండి అనుకున్నదే కదా? ఆ మూడు ముళ్ళూ పడిపోతే మన కళ్ళ ముందే చిలకాగోరింకల్లా కాపురం చేసుకుంటారు పిల్లలు. మన వ్యాపారాలు రెండూ కలిపితే, ఇక వెనక్కి తిరిగి చూడక్కర్లేదు" అంటూ నాన్నతో చెప్పాడు. శ్రీకర్ కి రక్తం ఉడికిపోయింది. ఇప్పటికే వ్యాపారం విషయంలో నాన్న సెలవులకి వచ్చినప్పుడల్లా తనతో గొడవ పడుతుంటే, ఇప్పుడీయన తన కూతురితో పక్షిలా పెరటి చెట్టుకే కట్టేస్తానంటున్నాడు. తను వద్దు అనే లోపే నాన్న అందుకున్నాడు. "ఐన సంబంధం వద్దులే బావా! రేపొద్దున్న ఏమైనా తేడా వస్తే బాధ పడాలి. డాక్టర్లు చేయద్దంటున్నారు. అయినా శ్రీకరం పట్నం వెళ్లి ఉద్యోగం చేయాలిట" అంటూ సద్దిచెప్పి మావయ్యని పంపేశాడు.

"నాన్నది ఎంతమంచి మనసు? నేనే అర్థం చేసుకోలేదు" అనుకుంటుండగా అసలు విషయం తన తల్లితో చెప్పాడు తండ్రి. "మతం మార్చుకున్న వాళ్ళతో మనకి సంబంధం ఏమిటి? మీ అన్నయ్య ఏనాడైతే బొట్టు చెరిపి సిలువ తగిలించుకున్నాడో, ఆనాడే అన్నీ తెగిపోయాయి. రేపొద్దున్న నా ఇంటికొచ్చే కోడలు నూనెతో దీపం పెట్టి , పసుపుకుంకాలతో కళకళలాడాలి కానీ, కొవ్వొత్తి వెలిగించి ఖాళీ నొసటితో తిరక్కూడదు" అన్నాడు. ఏమైతేనేం, శ్రీకర్ కి గుండెలో భారం దిగింది ఆరోజు. మతం మాట ఎలా ఉన్నా, పెళ్లి గోల తప్పింది ప్రస్తుతానికి. "ముస్తఫాపేట్" అన్న కేక వినిపించి బస్సు దిగాడు.

ఆటోలో ఆ ఎడ్రస్సుకి చేరటానికి ఇంకొక పావుగంట పట్టింది. మూడింటికి ఇంటర్వ్యూ. ఇంకా అరగంట టైముంది. అక్కడ పెట్టి ఉన్న మంచినీళ్ళు గటగటా తాగేశాడు. తన పక్కన కుర్చుని తన లాగే ఎదురు చూస్తున్న క్యాండిడేటు వైపు చూశాడు. అతనొక ముస్లిం. షర్టు టకప్ చేసుకున్నాడు. టోపీ, గడ్డం ఉన్నాయి. ఒకసారి తన బావ చెప్పిన విషయం గుర్తొచ్చింది శ్రీకర్ కి. "మా ఆఫీసుకి ఒక్కరోజు కూడా గడ్డం గీయకుండా వెళ్ళకూడదు. వెళ్ళామా, అంతే "He is quite unprofessional" అంటూ మాట్లాడతారు. మా బాస్ ఒకరోజు నన్ను పిలిచి మరీ చెప్పారు ఈ విషయం. కానీ ముస్లిమ్స్ ఇంతింత గడ్డాలతో వచ్చినా ఏమీ అనరు. ఏమైనా అంటే కేసులూ, గొడవలూ అవుతాయని భయం" అని తన అక్కసుని వెళ్ళబోసుకున్నాడు బావ.

నిజంగా భయపడతారా అలాగ? ఒకసారి అలాంటిదే జరిగింది. తను హాస్టల్లో ఉన్న రోజుల్లో, దగ్గరలో ఉన్న క్రీస్తు మహా సభల సందర్భంగా తిరునాళ్ళలో లాగా జయంట్ వీలు లాంటి రైడ్సూ, పానీ పూరీ, జీడిపాకం లాంటి బళ్ళూ పెట్టారు. తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా వెళ్ళాడు. వచ్చేసరికి ఆలస్యం అయ్యింది. ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది. భయపడ్డట్టుగానే అందులోంచి ప్రిన్సిపాల్ గారు దిగారు. సింహం లాంటి గొంతుతో "టైమెంతయ్యింది?" అని అడిగారు. ఎవరూ మాట్లాడలేదు. "ఎక్కడికెళ్ళి వస్తున్నారు?" అని అడిగారు. మళ్ళీ మౌనం. ఆయన మళ్ళీ గర్జించేసరికి ఒక కుర్రాడు గొంతు విప్పి చెప్పాడు "సువార్త సభలకి" అని. విచిత్రంగా ఆయన గొంతు వెంటనే మారిపోయింది. "మీ మతపరమైన భావాల్ని నేను కాదనను. కానీ టైముకి తిరిగి వచ్చేయాలి కదా?" అని నెమ్మదిగా అని, ఆయన కారెక్కి వెళ్ళిపోయారు.

ఆరోజు ఆయన ఎందుకు వదిలేశారా అని ఆలోచించలేదు. బ్రతికి బైట పడ్డామురా అని గంతులేశారు. మరి నిజానికి ఆ కుర్రాళ్ళలో ఒక్కరూ క్రిస్టియన్ కాదు, ఒక్కరూ అక్కడ ఉపన్యాసాలు వినే ఉద్దేశంతో వెళ్ళలేదు. ప్రిన్సిపాల్  గారూ క్రిస్టియన్ కాదు.

ఆమాటకొస్తే హిందువులని చూసి జనం భయపడటమూ  నేను చూశాను. వినాయక చవితి చందాల కోసం వచ్చిన గుంపులో పహిల్వాన్లను చూసి, పైకి తీసిన పది రూపాయల కాయితాన్ని మళ్ళీ లోపలకి పెట్టి, వంద కాయితాన్ని బిక్కుబిక్కుమంటూ హుండీలో వేశారు ఆమధ్య మా పక్కింటివాళ్ళు.

నిజంగా సమాజంలో అన్ని మతాల వారూ, అన్ని మతాల వారినీ గౌరవిస్తున్నారా? ఒకరిని చూసి ఒకరు భయపడుతున్నారా? అసలు ఎందుకు ఇన్ని మతాలు? ఎందుకు వాటి మధ్య భయాలు?

ఆలోచిస్తుండగా ఇంటర్వ్యూ టైము అయ్యింది. శ్రీకర్ ఉద్యోగం ఎలాగైనా సంపాదించాలి అనే పట్టుదలతో ఉన్నాడు. ఇంక తను చదివిన చదువుతో సంబంధం లేని ఉద్యోగాలకి కూడా రెడీ అవుతున్నాడు. ఇది ఒక ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీ. జనానికి కంపెనీ పాలసీలు చెప్పి ఒప్పించాల్సిన ఉద్యోగం. సరే, ఫోనులో మాట్లాడటమే కదా? అని ఇంటర్వ్యూకి వచ్చాడు. తీరా అంతా అయ్యాక తెలిసింది. కచ్చితంగా చేతిలో, బండి, లైసెన్సు ఉంటేనే ఉద్యోగం ఇస్తారని. తన దగ్గర అవి రెడీగా లేవు. నిరాశగా బైటకి వచ్చాడు.

ఇక మళ్ళీ ఇంటి దారి పట్టాలి. వెనక్కి వెళ్ళే బస్సు ఈ రూటులో ఎక్కడ ఆగుతుందో తనకి తెలియదు. ఈ ఆఫీసులో వాళ్ళని అడిగితే ఎవ్వరం బస్సుల్లో రాము, మాకు తెలియదన్నారు. బయటకెళ్ళాడు. అంతా నిర్మానుష్యంగా ఉంది. రోడ్డు అవతల రెండు షాపులు, ఒక పెట్రోల్ బంకు ఉన్నాయి. పెట్రోల్ బంకు మూసేసి ఉంది. అక్కడున్న మందుల షాపులోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్దాయన ఉన్నాడు. ఇక్కడ ఇంటర్వ్యూకి వచ్చానని, కోటి వెళ్లాలని చెప్పి, బస్సు ఎక్కడ ఎక్కాలని అడిగాడు. ఆయన "ఇప్పుడే ఒక బస్సు వెళ్ళిపోయింది. ఇంకొక గంట తరువాత బస్సు ఉంది. ఇక్కడ కూర్చో బాబూ" అన్నాడు. ఒకసారి వాచీ చూసుకుని, "థాంక్స్ అండీ" అన్నాడు శ్రీకర్.

ఒక ఐదు నిముషాలు పోయాక ఆ పెద్దాయన "ఒక పది నిముషాలు మాట్లాడచ్చా?" అన్నాడు శ్రీకర్ తో. సరేనంటే, లోపల ఒక గదిలోకి తీసుకెళ్ళాడు. ఒక టేబుల్, అటూ-ఇటూ రెండు కుర్చీలూ ఉన్నాయి అక్కడ. ఒక అర నిండా పుస్తకాలు ఉన్నాయి. "ఈయన బాగా చదువుకున్న మనిషిలా ఉన్నారు. అందుకే అంత సంస్కారంగా మాట్లాడారు" అనుకున్నాడు. ఒక కాయితం, పెన్నూ తీసి టేబుల్ మీద పెట్టి, ఎవరో కస్టమర్ వస్తే ఇప్పుడే వస్తానంటూ బైటకి వెళ్లాడాయన. "ఉద్యోగం కోసం చూస్తున్నాను అని చెప్పాను కనుక ఈయన నాకు ఉద్యోగం ఇవ్వాలని అనుకోవటం లేదు కదా?" అనుకున్నాడు శ్రీకర్ మనసులో. అప్పుడే బుర్ర వేగంగా ఆలోచించేస్తోంది. "ఈయన ఇక్కడ ఉద్యోగం ఇస్తారా? ఇంకెక్కడైనా ఇప్పిస్తారా? ఇక్కడైతే మాత్రం ఇన్ని బస్సులు మారి రావటం కష్టం. అయినా ఆ రూము ఖాళీ చేసేసి ఇక్కడ దగ్గరలో రూము తీసుకోవచ్చులే. కానీ మందుల షాపులో పని అంటే నాన్న తిడతారేమో. అయినా పర్లేదులే. నా కాళ్ళ మీద నేను నిలబడాలి. అంతే." ఆలోచనల్లో ఉండగానే పెద్దాయన లోపలికొచ్చాడు.

కుర్చీ లాక్కుని కూర్చుని, తననీ కూర్చోమని, పెన్ను పట్టుకున్నాడు. తెల్లటి బట్టతల. తిన్నగా శ్రీకర్ కళ్ళలోకి చూశాడు. లోతైన కళ్ళు ఆయనవి. చాలా జ్ఞ్యానం ఉన్నాయన కళ్లులా ఉన్నాయి.  ఎంత నిర్మలంగా ఉంది ఆయన ముఖం? ఇలాంటి మనుషులని చూస్తే చేతులెత్తి దణ్ణం పెట్టాలనిపిస్తుంది. పెన్ను తెరిచి కాయితం మీద పెట్టి, ఒక్కొక్క పదం పొడిపొడిగా, సూటిగా మాట్లాడటం మొదలుపెట్టారు. "నీ అభిప్రాయం ప్రకారం...నీ నడవడికని దృష్టిలో పెట్టుకుని...నీ వ్యక్తిగత అనుభవాలని బట్టి...నీకు ఏమనిపిస్తోంది? నువ్వు మరణానంతరం స్వర్గానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా?" అని అడిగారు. శ్రీకర్ గుండె ఆగిపోయింది. ఏమిటీయన? ఉద్యోగం ఇస్తారనుకుంటే తన చావుని గురించి మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఆ కళ్ళు చూస్తే భయమేసింది.

"ఈయన కొంపతీసి చేతబడి చేసే మనిషి కాదు కదా? అనవసరంగా ఈ షాపులోకి వచ్చాను. ఆ పక్క షాపులోకి వెళ్ళినా బాగుండేది" అనుకున్నాడు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాడు. "పారిపోవటానికి కూడా లేకుండా లోపలకి వచ్చి చిక్కాను" అని డీలా పడ్డాడు. ఆయన జవాబు కోసం ఎదురుచూస్తున్నాడు కళ్ళలోకి చూస్తూ. "ఏ...ఏమోనండీ...నాకు మీరు అడిగింది అర్థం కాలేదు" అన్నాడు శ్రీకర్. "సరే ఇది విను" అంటూ తన పక్కన ఉన్న అరలోనుండి ఒక చిన్న పుస్తకం తీసాడు. ఒక్కొక్క పేజీ తిప్పి చూపిస్తూ వివరిస్తున్నాడు. అందులో ప్రతి పేజీకీ ఒకవైపు బొమ్మ, మరొక వైపు రెండుమూడు వాక్యాలూ ఉన్నాయి. ఆయన మాట్లాడిన ఇరవై నిముషాల సారాంశం...

"క్రీస్తు మనం చేసిన తప్పులకి తాను శిక్ష అనుభవించాడు. మనం ఇంకా రోజూ తప్పులు చేస్తున్నాం. మనం చేసే ఒక్కొక్క తప్పుకీ ఒక్కొక్కసారి ఆయన పట్ల ద్రోహం చేసినట్లే. మనం సాటి మనిషిని చంపినా, అబద్ధం చెప్పినా ఒకటే. తప్పు చిన్నది అయినా, పెద్దది అయినా తప్పు తప్పే. అలాగని మనం అబద్ధం చెప్పకుండా ఉండలేము.  మనం మన కుటుంబంతో బాధ్యతగా, నమ్మకంగా ఉండాలి. ఎప్పటికీ అమ్మానాన్నలకి, భార్యకి ద్రోహం చేయకూడదు. మనల్ని సరైన దారిలో నడిపించమని దేవుణ్ణి ప్రార్థించాలి". ఇదంతా చెప్పాక "నువ్వు దేవుణ్ణి ప్రార్థిస్తావా?" అని అడిగాడు. ఇంకా ఇదంతా ఎందుకు చెప్తున్నాడో తెలియని అయోమయంలో ఉన్నాడు శ్రీకర్. ఏమీ మాట్లాడలేదు.

"నువ్వు దేవుడు ఉన్నాడని నమ్ముతావా?" అని అడిగాడు పెద్దాయన. "నమ్ముతాను. అందరు దేవుళ్ళూ ఒకటే అని నేను నమ్ముతాను" అన్నాడు శ్రీకర్. "నాకు మిగతా దేవుళ్ళ సంగతి తెలియదు. యేసు ప్రభువు మాత్రం మన అందరి కోసం బాధలు పడ్డాడు" అన్నాడు పెద్దాయన. అతనితో వాదించే ఓపిక శ్రీకర్ కి లేదు. "అవున"న్నాడు. "నాతో కలిసి ఇప్పుడు ప్రార్థన చేస్తావా?" అని అడిగాడు ఆయన. తను కుర్చీ నుండి లేచి కింద మోకాళ్ళ మీద కూర్చుని, శ్రీకర్ ని కూడా అలాగే కూర్చోపెట్టి, పది నిముషాల పాటు తను అన్న ప్రార్థన అంతా అనిపించాడు.

అంతా అయ్యాక ఆయనే ముందు వచ్చి తలుపు తీసి, శ్రీకర్ కి బస్టాండ్ ఎక్కడుందో చూపించి నీళ్ళ బాటిల్ ఇచ్చి మరీ పంపాడు. బస్సు ఎక్కి, ఇంటికి చేరి, అన్నం తిని, రాత్రి పడుకున్నాక కూడా తను ఈ సంఘటనని మర్చిపోలేకపోయాడు. అవే ఆలోచనలు. "ఆ పెద్దాయన చెడ్డమనిషి కాదు. నాకు నాలుగు మంచి మాటలు చెప్పాలని అలా చెప్పారు. కానీ నన్నే పిలిచి మరీ ఎందుకు చెప్పారు? ఆయన అందరికీ అలాగే చెప్తారా, లేక ఈరోజే ఎవరికైనా అలా చెప్పాలి అనుకున్నారా?  లేకపోతే నిజంగా ఆయనకి అద్భుతమైన శక్తులు ఉండి, నన్ను చూడగానే "ఇతను చెడ్డవాడు , ఇతన్ని మార్చాలి" అనే నిర్ణయానికి వచ్చారా?"

"నేను అంత చెడ్డవాడినా? అప్పుడప్పుడూ చిన్నచిన్న అబద్ధాలు చెప్పిన మాట నిజమే. కానీ అబద్ధమే చెప్పని వాళ్ళు ఉంటారా ఎక్కడైనా? చ! ఈ పెద్దాయన నాకు నిద్ర పట్టనివ్వట్లేదు. అసలు ఇదంతా కాదు. అతనికి పిచ్చి అనుకుంటా. ఏవో కష్టాల్లో ఉండి పిచ్చివాడై ఇలా అందరికీ చెప్తున్నట్లున్నాడు. ఇలాంటి మాటలన్నీ వినేసి మతాలు మార్చేసుకుంటారు  కాబోలు మావయ్య లాంటి వాళ్ళు" అనుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. కలత నిద్రలో వచ్చిన కలలో కూడా ఆ పెద్దాయనా, ఆ ప్రార్థనా కనిపించాయి.

మర్నాడు పొద్దున్నే గుడికి వెళ్ళాడు. కాసేపు గుడిలో గడిపేసరికి మనసు కుదుటపడింది. అక్కడ ఒకాయన ఉపన్యాసం చెప్తున్నారు. ఒక్క అరగంట విన్నాక ఆశ్చర్యం అనిపించింది శ్రీకర్ కి. నిజానికి ఈ ఉపన్యాసానికీ, నిన్న ఆ పెద్దాయన చెప్పిన మాటలకీ పెద్ద తేడా ఏమీ లేదు. "తప్పులు చేయకూడదు. అందరినీ ప్రేమించాలి. మనవాళ్ళని, బైటవాళ్ళనీ..ఎవ్వరినీ బాధ పెట్టకూడదు. హింస పనికిరాదు. దైవాన్ని నమ్మాలి." ఇవన్నీ ఆయన కూడా చెప్పారు.

అవును మరి. రాముడి చరిత్ర అయినా, యేసు చరిత్ర అయినా, బుద్ధుడి చరిత్ర అయినా...ఎవరి కథ విన్నా తెలిసే నిజం ఒకటే...దేవుడి పట్ల భక్తిని పెంచుతూ మనిషికి మంచి మార్గం చూపించేదే మతం. ఏ మతగ్రంథం అయినా చెప్పేది ఒకటే. "ఆ దేవుడు గొప్ప, ఈ దేవుడు గొప్ప" అని మనిషి పిచ్చివాడై ఆలోచిస్తాడు తప్ప, దేవుళ్ళు ఎప్పుడూ పోటీ పెట్టుకోలేదుగా?

ఇక మత మార్పిడి...మనిషి జీవితంలో, ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్ళవలసినప్పుడు, తనకి మనోబలాన్ని ఇచ్చే ఒక 'గొప్ప' శక్తిని నమ్మటం మామూలే. ఆ శక్తిని "దేవుడు"గా కొందరు నమ్మితే, "దేవుడే లేడు, మనిషే దేవుడు" అని మరికొందరు అనుకుంటారు. "దేవుడి"ని నమ్మేవారు వారికి ఎక్కువ బలాన్ని ఇవ్వగల  దేవునికి చెందిన 'మతా'నికి మనసులో ప్రాధాన్యం ఇస్తారు. ఒక్కొక్కసారి వారికి వారి మీద నమ్మకం లోపించినప్పుడు, తను నమ్ముకున్న 'బలం' బలహీనం అయ్యింది అనుకుని, ఇంకొక రూపంలో ఆ 'బలా'న్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తారు.

కానీ ఏ దేవుడైనా తనంతట తానుగా ఏ మనిషికీ ధైర్యం చెప్పడు. మనిషి తనకి తను ముందుగా ధైర్యం చెప్పుకోవాలి. తమ పట్ల తమకు నమ్మకం ఉన్న మనుషులకి దేవుడు కూడా బలం ఇస్తాడు, ఏ రూపంలో ఉన్నా.

ఇదంతా ఆలోచిస్తూ గుళ్ళో కూర్చున్న శ్రీకర్ కి నిజంగా ఏదో బలం వచ్చినట్లయింది. తన భవిష్యత్తు విషయంలో ఒక గట్టి నిర్ణయానికి వచ్చి, దేవుడికి దణ్ణం పెట్టుకుని, నూతనోత్సాహంతో గుడిమెట్లు దిగాడు.


Picture from www.kauaikeepsakes.com




This story got published in the July-August 2011 edition of 'Telugu Jyothi' magazine.


Saturday, 5 February 2011

భోగి పళ్ళు

అనన్య 

సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. ఎన్నో పనులు చేయాలి. కానీ మాధురికి ఏమీ పాలుపోవట్లేదు. ఎక్కడ మొదలుపెట్టాలో, ఎలా చక్కబెట్టాలో తెలియట్లేదు. ఇదివరకు అయితే తోచింది తోచినట్లు చేసేసేది. చకచకా తిరిగేస్తూ, చాలాకీగా పని చేసేది. ఇప్పుడు ఇంకెక్కడ కుదురుతుంది అలా? తప్పుగా పార్క్ చేసిన బండి చక్రానికి పోలీసులు సీల్ తగిలించినట్లు తన కాళ్ళ చక్రాలకి సీలు వేసేశాడు దేవుడు. సావేరి పుట్టినప్పటి నుండి, అసలు అది కడుపులో పడ్డప్పటి నుండే అంతా మారిపోయింది. తన గురించి తను ఆలోచించే టైమే దొరకట్లేదు. ఇంక పండగ, పిండి వంటలు..ఈ ఆలోచనలు ఎలా చేస్తుంది?

మాధురి ఈ దేశం వచ్చి రెండేళ్ళు అవుతోంది. అమెరికా.....రానంతవరకు "అబ్బో!" అనిపించేది. వచ్చిన కొత్తలో "అమ్మో!" అనిపించింది. కాస్త అలవాటయ్యాక "ఆహా!" అనిపిస్తోంది. తనలాంటి ఏ అమ్మాయికైనా ఇలాగే అనిపిస్తుందేమో!  మాధురికి చదువు అవ్వగానే పెళ్లి కుదిరింది. అమ్మకి  అడపా-దడపా చేసిన సాయమే తప్ప విడిగా వంటా-వార్పూ, పనీ-పాటూ పెద్దగా అలవాటు లేదు. ఆ అవకాశం వచ్చే లోపు పెళ్లి బాజా మోగింది. పెళ్లై అత్తవారింట్లో తను ఉన్నది గట్టిగా నెల కూడా లేదు. పెళ్ళికి ముందు నుండే అన్ని ఏర్పాట్లూ చేసుకోవటంతో వెంటనే వీసా దొరికేయటం, నెల లోపే విమానం ఎక్కి ఇక్కడ వాలిపోవటం జరిగిపోయాయి.

పెళ్లి కుదిరాక అందరూ తనని ఆటపట్టించేవారు. 'అమెరికా మొగుడు', 'అమెరికా కాపురం', 'అమెరికా జీవితం' అంటూ...తనతో ఏం మాట్లాడినా మాటకు ముందు ఒక 'అమెరికా', మాటకు వెనక ఒక 'అమెరికా' జోడిస్తూ ఏడిపించేవారు. కళ్ళు మూసి తెరిచే లోపు తను ఆ అమెరికా రానే వచ్చింది. ఇంతకు ముందు తన భర్త మనోజ్ అతని ఫ్రెండ్స్ తో కలిసి ఒక అపార్టుమెంట్ లో ఉండేవాడు. పెళ్లై వచ్చాక మాధురి వచ్చే లోపు ఒక కొత్త అపార్టుమెంట్ తీసుకుని ఉంచాడు. తను మాంచి శీతాకాలంలో ఫిబ్రవరిలో దిగింది దేశంలో. మంచుని చూసి మురిసిపోతూ ఇల్లు చేరింది. వెర్రి ఆకలితో ఉండటంతో పిజ్జా తెప్పించుకుని తినేసి పడుకున్నారు.

మర్నాడు లేచి వంటింట్లోకి వెళ్లి చూసింది. ఫ్రిజ్జ్ ఉంది. అందులో తనకు తెలిసిన పెట్రోల్ క్యాన్ అంత క్యాన్లో పాలు, చిన్న ప్లాస్టిక్ డబ్బాలో పెరుగు, ఒక ప్రియ పచ్చడి మాత్రమే ఉన్నాయి. సరే పాలు కాచి తాగుదామని గిన్నె కోసం వెతికింది. మొత్తం వంటింట్లో ఒక గ్లాసు, ఒక కంచం, ఒక గిన్నె, ఒక గరిటె, రెండు చెంచాలు, ఒక మంచినీళ్ళ బాటిల్, ఒక లంచ్ బాగ్, ఒక చిన్న బియ్యం బ్యాగ్, ఒక బంగాళదుంపల బ్యాగ్, పంచదార ప్యాకెట్ ఉన్నాయి. ఒక్క నిముషం నివ్వెరపోయి నుంచుంది. తను పుట్టి బుద్ధెరిగాక ఇంత ఖాళీగా ఏ వంటింటినీ చూడలేదు. ఆకలికి కడుపులోంచి రకరకాల శబ్దాలు వినిపిస్తే బైటకొచ్చింది ఆశ్చర్యం నుండి.

ఇంతలో భర్త స్నానంచేసి వచ్చాడు. "పాలు ఎలా కాచాలి?" అని అడిగింది.
అప్పటికే రెండేళ్లుగా ఇక్కడ ఉంటున్న మనోజ్ తన భార్యకి అన్నీ నేర్పుకోవాలి అని తహతహలాడుతూ ఉన్నట్లున్నాడు. అప్పటికే ఫోనులో "అమెరికా అంత గొప్పది, ఇంత గొప్పది" అంటూ ఈ దేశ కీర్తిప్రతిష్టలని పెంచి పోషించే బాధ్యతని తన భుజాన వేసుకున్నట్లు కబుర్లు చెప్పేవాడు. తను ఎదురు చూస్తున్న టైము వచ్చేసిందన్న ఆనందంతో "ఇక్కడ మన ఊళ్ళో లాగా గ్యాస్ స్టవ్ ఉండదు మధూ...ఈ స్టవ్ ఎలక్ట్రిసిటీ తో నడుస్తుంది. మనం ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ వేడెక్కుతుంది. మంట రాదు. వేడి మీదే అన్నీ ఉడికిపోతాయి" అని ఉత్సాహంగా చెప్పేస్తున్నాడు.
తను నిజానికి కాలేజీ లో ల్యాబ్ లో ప్రయోగాలు చేసేటప్పుడు ఇలాంటి స్టవ్ వాడింది. అయినా అతన్ని కించపరచటం ఎందుకని "ఓహో..భలే బాగుందే! ఓకే..ఏం గిన్నెలో కాచచ్చు?" అంది నెమ్మదిగా.
"ఓహో సారీ. నిన్న అన్నం తిన్నాక తోమలేదు. వాష్ బేసిన్లో ఉంటుంది" అన్నాడు. "పాలకీ, అన్నానికీ ఒకటే గిన్నె ఉంది అన్నమాట" అనుకుంది. "ఇంకా మీ ఫ్రెండ్స్ రూం నుండి అన్ని సామానూ తెచ్చుకోలేదా?" అని అడిగింది మొహమాటపడుతూ.
"తెచ్చేశాను. ఇవన్నీ అవేగా?" అన్నాడు ఆ సంపదని చూపిస్తూ. "ఇవి 'అన్నీ' నా?!!" అనుకుంది.
"సరే...నాక్కూడా ఒక గ్లాసు, ఒక కంచం, ఒక స్పూనూ కొనుక్కుందామా ఈరోజు?" అంది. అప్పటికి అర్థమయ్యింది అతనికి తను ఇప్పుడు 'సంసారి' అయ్యాడని.

నెమ్మదిగా ఇక్కడ ఏమి దొరుకుతాయి, ఏ రూపంలో, ఎంత సైజులో దొరుకుతాయి తెలుసుకొని, అలవాటు చేసుకుని, కొనుగోళ్లలో ఆరితేరింది. ఇండియా లో అమ్మకో, అమ్మమ్మకో, అత్తగారికో ఫోను చేసి వంటల గురించి కనుక్కుని పుస్తకంలో రాసుకుంటూ నెమ్మదిగా నేర్చుకుంది. తన ఇంటి దగ్గర ఇండియాన్స్ అందరితో స్నేహం బాగా కుదిరింది. పండగలకీ, పబ్బాలకీ అందరూ కలిసి భోజనాలు చేయటం నచ్చింది తనకి. చూస్తుండగా పది నెలలు ఐపోయాయి. తనకి సంక్రాంతి అంటే చాలా ఇష్టం. కానీ పండగ నాటికి తనకి మూడో నెల. తినాలనుకున్నది సహించక, బలవంతంగా ఎక్కించింది ఇమడక చిక్కి సగమయ్యింది. వంట్లో ఓపిక లేదు, ఇక పండగ ఏమి చేసుకుంటుంది? "వచ్చే ఏడాది ఎలా అయినా ఇండియాలో చేసుకున్నట్లు చేసుకోవాలి" అని నిర్ణయించుకుంది.

 ఈ సంక్రాంతికి సావేరికి ఆరు నెలలు నిండుతున్నాయి. తనకి ఇష్టమైన పండగ తన కూతురికి మొదటి పండగ. "చాలా చాలా బాగా చేయాలి" అని గట్టిగా నిశ్చయించుకుంది. పెళ్ళికి ముందు వరకు ఎంత కష్టమైనా  సంక్రాంతికి తాతగారింటికి వెళ్ళేది. "సంక్రాంతి పండగ అంటే పల్లెటూళ్ళోనే చేసుకోవాలి" అనిపించేది మరి. వీధి అంతా పెద్దపెద్ద రంగులముగ్గులు వేయటం, గొబ్బిళ్ళు పెట్టుకోవటం, లంగా-ఓణీ వేసుకుని, జడగంటలు పెట్టుకోవటం,  బాబాయిల, అత్తల పిల్లలతో ఆడుకోవటం, పిండివంటలు తినటం, పొగమంచులో భోగిమంటలు వేసుకొని చలి కాచుకోవటం, నానమ్మతో భోగిపళ్ల పేరంటాలకి వెళ్లి జేబురుమాల్లో వాళ్ళిచ్చిన శనగలు తెచ్చుకుని, మర్నాడు అవి పోపులో వేయించుకుని తినటం...అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ...తాతగారి ఊరు చుట్టూ తిరుగుతున్న మనసుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది. బుజ్జిది బజ్జుంది. ఇదే సరైన టైము. ఇప్పుడే ప్లానింగ్ అంతా చేసేయాలి.

ఒక కాయితం, పెన్నూ తీసుకుంది. "ఏమేం కావాలో మొదట రాసుకుందాం" అంటూ కాగితం పైన శ్రీకారంతో మొదలు పెట్టింది. ముగ్గులు..."ముగ్గు ఎక్కడ? రంగులేవి?"..ప్చ్..కాన్సిల్.
భోగి మంట..."ఇక్కడ మంట వేస్తానంటే జైల్లో పెడతారు"...ఛ..కాన్సిల్...
గొబ్బిళ్ళు..."ఆవు పేడ, బంతిపూలు..నా మొహం"..అదీ కాన్సిల్...
పరికిణీ, జడగంటలు...అమ్మయ్య!.."సావేరికి పరికిణీ రెడీ చేయాలి" అని రాసుకుంది.
పిండివంటలు..."మన చేతిలో పని" అనుకుని తన మనసులో ఉన్న వాటికి కావలసిన వస్తువుల లిస్టు రాసుకుంది.
భోగి పళ్ళు..."అమ్మో..ఇప్పుడు రేగు పళ్ళు ఎక్కడ నుండి తేను?" అనుకుంది.
వెంటనే ఒక గొంతు వినిపించింది. "నేనే..నీ అంతరాత్మని. మాధురిని. అసలు పెద్దవాళ్ళు ఏమన్నారు? కావాలనుకున్నది దొరకనప్పుడు దొరికినది వాడుకోమన్నారు" అంది ఆ గొంతు.

పండగ రానే వచ్చింది. భోగి నాడు పొద్దున్నే తన పేటియోలో చిన్న కాయితానికి నిప్పు అంటించి ముగ్గురూ చలి కాచుకున్నారు. "మోకాలు లోతున మంచు పడితే ఈ కాయితం మంట మనకి చలి కాచింది. చాలా సంతోషం అమ్మా" అంటూ భర్త ఆటపట్టించాడు కూడా. ఇక సాయంత్రం భోగి పళ్ళ పేరంటం ఉంది. ముందురోజే అందరినీ పిలిచేసింది ఫోన్ లో.  శనగలు నానపోసి,  వడేసింది.  రేగు పళ్ళ బదులు బ్లూబెర్రీ, క్రాన్ బెర్రీ, ఎర్ర ద్రాక్ష కొని తెచ్చింది. తన ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు అందరూ తన ఈడు వాళ్ళే.  వాళ్ళతో పాటు పెద్దవాళ్ళని ఎవరినైనా పిలుద్దాం అని ఆమధ్య స్టోర్ లో పరిచయమైన ఆవిడని పిలిచింది.

పాపం మనోజ్ కూడా మధ్యాహ్నం నుండి సెలవు పెట్టి, హడావిడి పడిపోతూ చేతనైన సాయం చేస్తున్నాడు. సాయంత్రం పిల్లకి పసుపు, పారాణి, బొట్టు, గంధం పెట్టాక సందేహం మొదలయ్యింది. హారతి ముందు ఇవ్వాలా, పళ్ళు ముందు పోయాలా అని. అక్కడున్నవాళ్ళలో ఎవరికీ తెలియదన్నారు. ఇలాంటప్పుడు  మాటసాయంగా ఉంటారనే పెద్దావిడని పిలిచింది తను. ఆవిడని అడిగింది. లాభం లేకపోయింది. ఆపాటికి ఇండియాలో తెల్లవారి ఉంటుందని అమ్మమ్మని అడిగి హారతి చివరలో ఇస్తారని తెలుసుకుంది. పేరంటం అంతా అయ్యి అందరూ వెళ్ళిపోయాక భోజనం చేస్తుండగా ఉన్నట్టుండి మనోజ్ అన్నాడు "అసలావిడ నాకు నచ్చలేదు" అని. ఒక్క నిముషం ఎవరి గురించో అర్థం కాలేదు మాధురికి. తరువాత ఎందుకని అడిగింది.

"ఆవిడకి దగ్గర దగ్గర అరవై ఏళ్ళు ఉంటాయి. మీరు లక్షణంగా చీరలు కట్టుకుంటే ఆవిడ ప్యాంటు వేసుకొచ్చారు. ముత్తైదువ అయ్యుండి మొహాన బొట్టు లేదు, కాళ్ళకి మెట్టెలు లేవు. మెడలోది అయినా ఉంచారో, లేదో" అన్నాడు.
"ఆవిడ ఇక్కడ పెద్ద డాక్టర్. నలభై ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. ఇంక ఇక్కడలా అలవాటు ఐపోయింది పాపం" అంది మాధురి.
"డాక్టర్ అయితే ఏమిటి? నలభై ఏళ్ళు అయితే ఏమిటి? ఇండియా లోనే పుట్టారుగా? అక్కడే పెళ్లి అయ్యిందిగా? వాటి గురించి తేలియకపోలేదుగా? అసలు నువ్వు ప్రపంచంలో ఉన్న అందరినీ సమర్ధిస్తావు నన్ను తప్ప. ఆవిడకి హారతి గురించి కూడా తెలియదు. అడిగితే తెలుగు రానట్లు ఇంగ్లీష్ లో "ఐ డోంట్ నో డియర్...ఐయాం కంప్లీట్లీ అనేవేర్ ఆఫ్ దిస్" అంటున్నారు పెద్ద గొప్ప ఐనట్లు" అంటూ రుసరుసలాడాడు.

మాధురికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఏమైనా చెప్తే కోపం తనమీదకి వస్తుంది. అయినా శాంతంగా చెప్పింది.
"వాళ్ళు వచ్చిన కొత్తల్లో, వాళ్ళ పిల్లల చిన్నప్పుడు ఇప్పుడు ఉన్నన్ని ఇండియన్ స్టోర్లు లేవు.  ఇంత బాగా మన వంట సామాను దొరికేవి కాదు. ఇలా వీధికి పదిమంది ఇండియాన్స్ లేరు. ఇండియాకి ఇంత చీప్ గా టెలిఫోన్ సౌకర్యం లేదు.  తినేది, వినేది, పలికేది, పనిచేసేది..ఏదీ 'ఇండియన్' కానప్పుడు ఇంక ఇండియాన్స్ లాగా ఎలా ఉండగలరు? తప్పక ఇక్కడి విధానాలన్నీ అలవాటు చేసుకుని ఉంటారు. ఎవరూ కావాలని వదిలేయారు కల్చరుని. అసలు అంత ఎందుకు? మీరు నాకు వచ్చిన కొత్తలో ఇక్కడి విషయాలన్నీ ఎందుకు నేర్పారు? ఇక్కడిలా బ్రతకాలని పాఠాలు ఎందుకు చెప్పారు? మన వంటలన్నీ దొరుకుతున్నా మీరు పిజ్జా ఎందుకు తింటున్నారు? ఎక్కడ ఉన్నప్పుడు అక్కడి విషయాలు నేర్చుకోవటం తప్పు కాదు కదా? అయితే పాపం ఆవిడ లాంటి వాళ్లకి తెలుగుతనాన్ని నిలుపుకునే అవకాశం కూడా లేకపోయింది.  కుదరక కొంత కల్చర్ మరుగున పడుతున్నా , తెలియక బ్రతుకు పరుగులో పడిపోయారు.  అసలు ఈరోజున మనం కూడా సంక్రాంతిని సంక్రాంతిలా జరుపుకోలేదు. కొన్నాళ్ళ తరువాత మనమ్మాయి ఇది చూసి "ఇదే సంక్రాంతి" అనుకుంటుంది. ఇదే గుర్తుంచుకుంటుంది. తరువాత అది పెద్దయ్యాక కుదరకపోతే ఇదీ చేయదు. అది దాని తప్పు కాదు. మనం ఇక్కడ పెంచటం మన తప్పే అవుతుంది. అలా జరగకుండా కాపాడటం  అనేది మనం  అనుకున్నా చేయలేని పని. మీకు నిజంగా కల్చర్ గురించిన బాధ ఉంటే కుదిరినంత త్వరగా ఇండియాకి తిరిగి వెళ్ళే ఏర్పాట్లు చేయండి. ఇక్కడ ఉండి మనం కూడా పూర్తిగా కల్చర్ ని కాపాడలేము" అని చెప్పి పడుకుంది.

కాసేపటి తరువాత సావేరి వీపు మీద చెయ్యి వేసి జోకొడుతూ, ఆలోచిస్తూ నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు మనోజ్.







This story got published in the March-April 2011 edition of 'Telugu Jyothi' magazine.