Pages



Saturday, 20 June 2020

సిరివెన్నెల పదలీల - స్వాతిముత్యాల మాల - ఒకటవ అంకం - శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ

అనన్య

సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు... ఈయన పాటలకు ఎంతోమందిలాగే నేనూ వీరాభిమానిని. చెవులు, ముక్కులు కోసేసుకుంటే మళ్లీ కష్టమవుతుందని తమాయించుకొని ఆగాను గానీ, మాటల్లో వర్ణించలేనంత మక్కువ నాకు ఈయన పాటలపై. పండితపామరులను సమానంగా రంజింపజేయగల శక్తి ఈయన కలానికి ఉంది. గుండె చప్పుడును "ఎద సడి" అని నాలుగు సరళాక్షరాలతో చేమంతి పూరేకును ఉఫ్ఫని ఊదినంత సున్నితంగానూ అనగలరు, "హృదయ మృదంగ ధ్వానం" అని కఠిన పాషాణాన్ని ఎత్తినంత బరువుగానూ పలుకగలరు. ముత్యాల్లాంటి బుజ్జిబుజ్జి పదాలను ఒకదాని పక్కన ఒకటి పేర్చుకుంటూ, తన పాట అనే దారం లోకి అందమైన ముత్యాల మాలలుగా  గుచ్చి, తెలుగు సాహితీమతల్లి మెడలో కొన్ని దశాబ్దాలుగా అలంకరిస్తూ ఉన్నారు. ఈయన పాట వింటుంటే మన పక్కనే కూర్చొని కబుర్లు చెప్తున్నారేమో అన్న అనుభూతి కలుగుతుంది కదా?

ఒక రకంగా నేను సిరివెన్నెల వారికి ఏకలవ్య శిష్యురాలిని. అంటే ఆయనలా పాటలు రాసే ప్రయత్నం చేయలేదు గానీ, ఆయన పాటల్లోని సాహిత్యంలో ఎంత మమేకం అవుతూ ఉంటానంటే, నాకు తెలియకుండానే నెమ్మదిగా ఆయన్ని పేరుతో కాక "గురువుగారు" అని వ్యవహరించటం అలవాటైపోయింది.

ఇన్నేళ్ళుగా నేను విని ఆస్వాదించటమే కాక, ఒకొక్క పాటలో ఒకొక్క పంక్తిని, అందులోని మాటల ఎంపికని నా పక్కనున్న వాళ్ళ చెవిలో గూడు కట్టుకొని తెగ పొగుడుతూ ఉండేదాన్ని. ఇప్పుడు ఆయన పాటలు వింటూ నేను పొందే అనుభూతికి ఒక శాశ్వత రూపం ఇవ్వటమే కాక, మీ అందరితో కలసి మళ్లీ మళ్లీ ఆ మాధుర్యాన్ని ఆస్వాదించాలని అనిపించింది. అందుకు కారణం నిన్న టీవీలో వచ్చిన పాట... స్వర్ణకమలం చిత్రంలోని "శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వ".

నిత్యం ఎంతోమంది గురువుగారి పాటలపై సమీక్ష చేస్తూనే ఉంటారు. వారిలో గొప్పగొప్ప సాహిత్యవేత్తలు కూడా ఉంటారు. నా ఈ వేదికపై నేను నా స్థాయిలో, నా శక్తి కొలది కబుర్లు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఆయనపై నాకున్న అభిమానాన్ని మాత్రమే చూడమని మనవి.

ఈ మొదటి అంకంలో "శివపూజకు..." పాట గురించి మాట్లాడుకుందాం. ఈ పాటకొక ప్రత్యేకత ఉంది. పలుసార్లు ఇంటర్వ్యూలలో స్వయంగా గురువుగారు చెప్పిన మాట... తాను ఇన్నేళ్ళలో బాగా ప్రసవ వేదన పడ్డ పాట ఇదేనట. పల్లవి రాసి దర్శకులు విశ్వనాథ్ గారిని మెప్పించాక, పల్లవికి ఏమాత్రం తీసిపోకుండా చరణాలు రాయటం కోసం చాలా సమయం కృషి చేయాల్సి వచ్చిందట.

చాలా మందికి తెలిసిన విషయమే. ఈ చిత్రంలో కథానాయిక మీనాక్షి తన తండ్రి బలవంతం వల్ల నాట్యం నేర్చుకుంటుందే తప్ప, నాట్యకళను ఏమాత్రం ఇష్టపడదు. కళలు కూడు పెట్టవు, ఎందుకూ కొరగావు అన్న భావనతో పాటు, డబ్బు, తద్వారా వచ్చే సుఖసంతోషాల పట్ల తనకు ఆశ, అభిలాష. అలాగని అత్యాశ కాదు. అందుకు కష్టపడాలి, సాధించాలి అనే తత్వం. అందుకు ఈ కళ తనకు బంధనంగా మారిందని ఏహ్య భావం పెంచుకుంటుంది.

కథానాయకుడు చందు ఆమె మనస్తత్వాన్ని అవగతం చేసుకున్నప్పటికీ, ఆమె చిన్నతనంతో పొరపాటుగా ఆలోచిస్తోందని, ఎప్పటికైనా ఆ కళలోని అందాన్ని, ఆనందాన్ని గ్రహిస్తుందని, గౌరవిస్తుందని ఆశిస్తూ, ఆమెను అభిమానిస్తూ ఉంటాడు.

విభిన్నమైనవే కాక, పరస్పరం విరుద్ధమైన ఈ రెండు మనస్తత్వాలను ఈ పాటలోని సాహిత్యం ప్రతిబింబించాలి. మనం సరిగ్గా గమనిస్తే, పాట వినేవారికి అతని భావం గానీ, ఆమె భావం గానీ తప్పు అనిపించదు. ఎవరి మాట విన్నప్పుడు వారి మాటే సరైన మాట అనిపించే అంత చాకచక్యంగా గురువుగారు రాశారు.

కథానాయకుడు పాడే పల్లవి...

శివపూజకు చివురించిన సిరి సిరి మువ్వా
మృదుమంజుల పద మంజరి పూచిన పువ్వా
యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వా
నటనాంజలితో బ్రతుకును తరించనీవా

నాట్యానికి అధిదేవత అయిన శివ భగవానుడిని పూజించటానికి పుట్టిన సిరిమువ్వట మన కథానాయిక. మృదువైన, సున్నితమైన పాదానికి పూసిన పూవట ఈ మువ్వ. యతిరాజు అన్న ప్రయోగం ఎంత బాగుందో, జతి స్వరమని ప్రాసను ప్రయోగించటం అంతే తీయగా ఉంది కదా? పూవుతో పోల్చాడు కనుక ఆ స్వరాలకు పరిమళం ఇమ్మంటున్నాడు. స్వామికి ఇచ్చే అంజలి వల్ల తన బ్రతుకు తరిస్తుందట. ఇందులో కథానాయకుడికి కళ పట్ల ఉన్న భక్తి ఎలాంటిదో ఎంత చక్కగా వర్ణించారు మన గురువుగారు?

ఇక కథానాయిక పాడే పల్లవి...

పరుగాపక పయనించవె తలపుల నావా
కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ
ఎదిరించిన సుడిగాలిని జయించినావా
మది కోరిన మధుసీమలు వరించి రావా

తన కోరికలు, ఇష్టాలు, కలలను నీటి ప్రవాహంలో ప్రయాణిస్తున్న నావతో పోల్చింది. పరుగు ఆపకుండా ప్రయాణించాలని, కెరటాలకు తల వంచకూడదని, సుడిగాలిని జయించాలని, అప్పుడే మనసు కోరుకున్న తీయటి గమ్యానికి చేరుకోగలవని ఆ నావకి చెప్తోంది. ఎంత సహజంగా ఉన్నాయి ఈ భావాలు? జీవితంలో పైకి ఎదగాలి అనుకుంటున్న ఒక ఆడపిల్ల మనసుకి అద్దం పట్టట్లేదూ?

ఇంతవరకు బానే ఉంది. ఇక చరణాల దగ్గర ఈ భావాలను కొనసాగించటానికి తాను చాలా కష్టపడ్డారని గురువు గారే స్వయంగా అన్నారుగా? చూద్దాం.

పడమర పడగలపై మెరిసే తారలకై
రాత్రిని వరించకే సంధ్యా సుందరీ
తూరుపు వేదికపై వేకువ నర్తకివై
ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ
నిదురించిన హృదయ రవళి ఓంకారం కానీ 

కథానాయికను ఉదయ సంధ్యగా సంబోధిస్తూ, చుక్కలు మిణుకుమిణుకుమంటున్నాయి కదా అని ఆకర్షణకు లోనై చీకటిని నమ్ముకొని ఉండిపోవద్దు అంటున్నాడు. ఆ చుక్కల మెరుపును పడమర అనే పాము పడగపై మెరిసే మణిగా పోల్చారు గురువుగారు. భూమికి సంతోషాన్ని కలిగించే వెలుగు అంతటా నిండేలా తూరుపు దిక్కున వేకువై నాట్యమాడాలట. ఆ నాట్యమే చైతన్యానికి శ్రీకారం చుట్టాలట. ఓంకార నాదమై నిదురించిన హృదయాలను నిద్రలేపాలట.

ప్రకృతిలో నిత్యం జరిగే పగలు-రాత్రి మార్పులనే చక్కటి ఉపమానాలుగా వాడుతూ ఎంత సరళమైన పదాలతో, ఎంత అందమైన  ఊహను మన కళ్ళకు కట్టారు? ఇక కథానాయిక పాడే చరణం...

తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా
ఆమనికై ఎదురుచూస్తూ ఆగిపోకు ఎక్కడా
అవధి లేని అందముంది అవనికి నలుదిక్కులా
ఆనందపు గాలి వాలు నడపనీ నిన్నిలా
ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా
వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా

నిజమే కదా? ఆమని వస్తుందని మొక్క ఎదురు చూడగలదే తప్ప తానుగా వెళ్ళలేదు. భూమిలో వేళ్ళు పాతుకుపోయి కదలనివ్వవు. గాలికి తల ఊపగలదు తప్ప, స్థాన చలనం కష్టం పాపం. అలా ఉండిపోకూడదట. ఆనందం అనే గాలి నడిపిస్తుండగా సృష్టిలో అందాలన్నీ వెతుకుతూ ముందుకి సాగిపోవాలట. దేవతల్లో కిన్నెర జాతివారు సంగీతజ్ఞులు. అటువంటి కిన్నెర తానే అయ్యి వెన్నెల రోజుకొక కొత్త పాట పాడుతూ ప్రయాణంలో తోడుగా ఉంటుందట. కనుక భయం లేకుండా ముందుకు నడవాలట. వింటుంటే మనకీ అలా ముందుకి సాగిపోవాలి అనిపించట్లేదూ?

మళ్లీ కథానాయకుడు అందుకుంటాడు. సిరిమువ్వతో చెప్తున్నట్టే చెప్తూ కథానాయికతో తాను చెప్పదలచుకున్న మాటలు ఇలా చెప్తాడు.

చలిత చరణ జనితం నీ సహజ విలాసం
జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం
నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం
గగన సరసి హృదయంలో
వికసిత శతదళ శోభల సువర్ణ కమలం

కాంతితో నిండిన కిరణం మరింత శోభాయమానంగా వికసిస్తే ఎలా ఉంటుందో ఆమె నాట్యమాడుతున్నప్పుడు తన చరణాల్లోంచి సహజంగా పుట్టే అందం  అలా ఉంటుందన్నాడు. సాధారణంగా సూర్యోదయాన్నే ఎంతో గొప్పగా వర్ణిస్తారు కవులు. కానీ ఇప్పుడు ఆ సూర్యుడు ఈమె నాట్యాన్ని చూస్తే, ఆమె అభినయం అనే ఉషోదయానికి అతని కళ్ళలో ప్రకాశం వస్తుందట... అది ఎలాంటి ప్రకాశం అంటే, గగనం అనే స్త్రీ హృదయంలో వంద రేకులతో అందంగా వికసించిన బంగారు కమలం ఎలా ప్రకాశిస్తుందో అలాంటి ప్రకాశం సూర్యుని కళ్ళలో కనిపిస్తుందట.

ఎంత అద్భుతమైన ఊహ ఇది? కథానాయిక పట్ల, ఆమె నాట్యం పట్ల కథానాయకుడికి వల్లమాలిన అభిమానం ఉండచ్చు, కానీ కవి వర్ణనలో ఉన్న మాధుర్యం వల్ల ఆ దర్శకుడి ఉద్దేశం ఎంత అందంగా మన ముందు ఉంచబడింది? ఇలాంటి సుమధుర భావాన్ని మాకు శాశ్వతంగా అందించాల్సి వచ్చినప్పుడు మీరు రేయింబవళ్ళు కష్టపడినందుకు మీకు శతకోటి వందనాలు, గురువు గారూ.

చివరిగా కథానాయకుడు దర్శకుడు చెప్పదలచుకున్న భావాన్ని రెండు మాటల్లో చెప్పేస్తాడు.

స్వధర్మే నిధనం శ్రేయః
పరధర్మో భయావహః

సొంత ధర్మం ఎప్పుడూ ఉత్తమం, పర ధర్మం భయంకరమైనది.

గురువుగారితో పాటు ఈ పాట వెనుక ఉన్న మరికొందరిని స్మరించుకోక తప్పదు. ఇంత చక్కటి ఆణిముత్యాన్ని మనకు అందించటానికి గురువుగారికి మంచి సన్నివేశాన్ని ఏర్పాటు చేసిన దర్శకులు విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. సాహిత్యంతో పాటే ఈ పాటకు సంగీతం కూడా ప్రాణం. ఇళయరాజా గారు భావానికి తగ్గట్టే నాయికానాయకులు పాడే పదాలకు సంగీతంలో కూడా వైవిధ్యం చూపించారు. ఈసారి విన్నప్పుడు గమనించగలరు. బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల గారు ఎప్పటిలాగే తెలుగుతనం ఉట్టిపడేలా, భావప్రకటన ఏమాత్రం చెడకుండా ఉండేలా పాడారు. భానుప్రియ గారు ముఖ్యంగా పొందినది కూచిపూడి శిక్షణ అయినప్పటికీ ఇందులో కూచిపూడి, భరతనాట్యం, మణిపూరీ, ఒడిస్సీ, మోహినీ ఆట్టం... ఈ ఐదు రకాల సంప్రదాయాలను అలవోకగా ప్రదర్శించారు. అదంతా కథానాయకుని ఊహ అని మనకు అనిపింపజేశారు దర్శకులు.

స్వర్ణకమలం చిత్రంపై మరోసారి విడిగా మాట్లాడుకుందాం. గురువుగారు గుచ్చిన మరో స్వాతిముత్యమాలతో మళ్లీ మీ ముందుకి వస్తాను. సెలవు.