భావన ఒకసారి అసహనంగా గడియారం చూసుకొని, నిట్టూరుస్తూ వెయిటింగ్ ఏరియాలో మూలనున్న సీట్ లో కూర్చుంది. అసలే సంవత్సరాంతం అవ్వటంవల్ల ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటే, ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇంతసేపు వెయిట్ చేయటం కష్టంగా ఉంది. దానికి తోడు రిసెప్షనిస్ట్ విసురుగా మాట్లాడటం అస్సలు నచ్చలేదు. "నేనేం చేయను మేడమ్? మీకంటే ముందు వచ్చినవాళ్ళు ఉన్నారు కదా? మిమ్మల్ని ముందు పంపలేను కదా?" అని అందరికీ వినపడేలా మాట్లాడి, అక్కడే నుంచున్న తనని ఏమాత్రం లెక్కచేయకుండా, ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది ఆమె.
"ఎంత పెద్ద డాక్టర్ అయితే మాత్రం, ఎన్నింటికి అపాయింట్మెంట్ ఇచ్చారో అన్నింటికి చూడాలి కదా? వచ్చేవాళ్ళకి ఏం పని లేదనుకుంటున్నారా?" అని వాట్సాప్ లో భర్తకి మెసేజ్ పంపి తన అక్కసుని వెళ్ళగక్కి, ఆఫీస్ నుంచి అర్జెంట్ గా సమాధానం ఇవ్వాల్సిన ఈమెయిల్ ఏమైనా వచ్చాయేమో అని ఒకసారి ఫోన్లోనే చూసుకొని, మరోసారి మెసేజ్ నోటిఫికేషన్లు కూడా ఏమీ లేవని నిర్ధారించుకొని, ఫోన్ ని బ్యాగ్ లో పడేసి తలెత్తింది.
వెయిటింగ్ ఏరియాలో ఒక ఇరవైమంది ఉన్నారు. తనకంటే ముందు ఆరుగురు వెయిటింగ్ లో ఉన్నారని ఇందాకే రిసెప్షనిస్ట్ చెప్పింది. ఒకసారి ఆమెవైపు చూసింది భావన. కంప్యూటర్లో ఏదేదో టైప్ చేసుకుంటూ, మధ్యమధ్యలో డాక్టర్ బెల్ కొడితే తలుపు సగం తెరిచి డాక్టర్ చెప్పే మాటకి తలాడించి, మళ్లీ తలుపు వేసి వచ్చి కూర్చుంటోంది ఆవిడ. "అన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన డాక్టర్లకు కూడా లేని పొగరు ఈ రిసెప్షనిస్టులకి ఉంటుందెందుకో" అని మనసులో తిట్టుకుంటూ కొరకొరా ఆమెవైపు చూస్తుండగా, ఆమె తనవైపు చూసింది. టక్కున ఏమీ ఎరగనట్టు మరోవైపుకు చూపు తిప్పింది భావన. అక్కడ వెయిట్ చేస్తున్నవాళ్ళు అందరూ పెద్దవాళ్ళే. ఎవ్వరికీ యాభైకి తక్కువ ఉండదు వయసు. బాబాయ్ నిన్న ఫోన్ చేసి, పిన్ని రిపోర్టులు పంపుతానని, ఒకసారి ఈ డాక్టర్ కి చూపించి సర్జరీ విషయంలో సెకండ్ ఒపీనియన్ తీసుకోమని అడిగితే, ఆ రిపోర్టుల కాపీలు ప్రింటవుట్ చేసుకొని, ఆఫీస్ లో పర్మిషన్ అడిగి వచ్చింది ఇక్కడకి. ఈ డాక్టర్ పేరు పొందిన న్యూరాలజిస్ట్ అని బాబాయ్ చెప్పాడు.
గోడలమీద నోటీస్ బోర్డులు, వాటిపై ఉన్న సమాచార కరపత్రాలు చూసింది. వాటిపై పార్కిన్సన్స్, అల్జీమర్స్, డెమెన్షియా అంటూ రకరకాల రుగ్మతలు, వ్యాధుల పేర్లు, వాటికి సంబంధించి అవగాహన పెంచే రాతలు, బొమ్మలు ఉన్నాయి. ఆ అక్షరాలను తనున్న కుర్చీలోంచే చదవాలని ప్రయత్నిస్తూ, ఎంత సైజున్న అక్షరాలను ఎంత సునాయాసంగా చదవగలుగుతోందో, ఎంత సైజు అక్షరాలకి కష్టపడుతోందో చూసుకొంటూ ఉచితంగా ఐసైట్ టెస్ట్ తనకు తానే చేసుకుంటూ సమయసంహారం కావిస్తోంది. ఈలోపు కుడిపక్కనున్న కుర్చీలోంచి పెద్దగా నవ్వు వినిపించింది.
ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. పెద్దావిడకి ఒక ఎనభై ఏళ్ళు ఉండచ్చు, ఇంకో ఆవిడకి అరవై దగ్గరపడుతూ ఉండచ్చు అనుకొంది. వృద్ధులు సైతం... ఉన్న చోటుని, సందర్భాన్ని, పక్కవారిని మరచి ఫోన్లకి అతుక్కుపోతున్న ఈరోజుల్లో, ఫోన్ వాడకాన్ని కుదిరినంత తగ్గించాలని ఈమధ్యే నిర్ణయించుకుంది భావన. అందుకే అవసరమైనంతవరకే ఫోన్ వైపుకి చూస్తూ, మిగతా సమయంలో పాతికేళ్ళ క్రితంలాగా చుట్టుపక్కలున్న ప్రపంచాన్నే చూడాలని తన ప్రయత్నం. ఫోన్ ఎక్కువగా వాడటంవల్ల కలిగే అనర్ధాల గురించి ఆమధ్య ఫోన్లో ఫార్వర్డ్ అయ్యి వచ్చిన ఒక మెసేజ్ చదివాక, తను ఈ నిర్ణయం తీసుకుంది.
ఒకసారి హాల్లోని మిగిలిన అందరినీ పరికించి చూసింది. రిసెప్షనిస్ట్ ఎప్పటిలాగే చాలా పని ఉన్నట్టు ఏదేదో టైప్ చేస్తోంది. మిగిలినవారంతా కునుకుపాట్లు పడుతూనో, ఫోన్లను తదేకంగా చూస్తూనో కనిపించారు. కుడిపక్కన కూర్చున్న ఈ ఇద్దరు మాత్రం కబుర్లు చెప్పుకుంటున్నారు. తనకి తెలియకుండానే కొద్దిగా అటు వాలి కూర్చొని ఒక చెవి, ఒక కన్ను అటు వేసింది భావన.
పెద్దావిడ గొంతు వణుకుతోంది. మాట అంత స్పష్టంగా లేదు. కానీ ముఖంలో ఏదో కాంతి ఉంది. ఆవిడ కుర్చీకి తొంభై డిగ్రీలలో రెండో ఆవిడ కుర్చీ ఉంది.
"మీరూ ఈ డాక్టరు దగ్గరేనా ఎప్పుడూ చూపించుకునేది?" అంది పెద్దావిడ.
"అవునండీ. ఎప్పుడూ ఇక్కడ ఈ వెయింటింగ్ తప్పదు" అని నిట్టూర్చి,
"మీరెలా వచ్చారు ఇక్కడకి?" అని అడిగింది ఎర్రచీర కట్టుకున్న చిన్నావిడ.
"మావాళ్ళు తీసుకొచ్చి దిగబెట్టి, అలా వెళ్ళారులే అమ్మా" అని ఒళ్ళో ఉన్న నీళ్ళసీసాలోంచి నీళ్ళు తీసుకుతాగింది పెద్దావిడ.
"ఇంతకీ మీరు చెప్పండి. అప్పుడు ఏమయ్యింది?" అని కుతూహలంగా అడిగింది చిన్నావిడ.
"ఏం చెప్పాను? గుర్తులేదమ్మా. ఎప్పటి మాట మీరనేది? నాకు జ్ఞాపకం చేయండి. గుర్తుండదు. పెద్దదాన్ని కదూ?" అంది పెద్దావిడ అభ్యర్థనగా.
"అదేనండీ. మీ బామ్మగారు మాగాయి బద్దలు ఎండబెట్టినప్పుడు" అని అందించింది చిన్నావిడ.
"అదా? దారినపోయే కుర్రవెధవ బద్ద తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు. ఒరేయ్ వెధవాయి, మడిగా పెట్టుకున్న మాగాయి బద్దని ముడతావురా? అంటూ మా బామ్మ కర్ర తీసుకొని అదిలించింది. ఆ పళంగాను, వాడు ఆ బద్దని నోట్లోంచి తీసి, మాగాయి బద్దలు ఎండబెట్టిన నులకమంచం మీదకి విసిరేశాడు. ఇంకేముంది? మడిగా పెట్టుకున్న బద్దలన్నీ మంటకలిసిపోయాయని మా బామ్మ ఒకటే లబోదిబోమంది" అంటూ పకపకా నవ్వింది. ఎర్ర చీరావిడ కూడా బాగా నవ్వింది. భావనకి కూడా నవ్వొచ్చినా, వాళ్ళూ తనవైపు చూశారని సర్దుకుంది.
"మిమ్మల్ని ఎప్పుడూ ఇక్కడ చూడలేదు? మొదటిసారి వచ్చారా?" అని భావనని అడిగింది ఎర్ర చీరావిడ. "అవునండీ. మా పిన్ని విషయంలో సెకండ్ ఒపీనియన్ కోసం వచ్చాను" అని క్లుప్తంగా చెప్పింది భావన. "ఓహో, నేను ప్రతి నెలా వస్తుంటాను" అంది ఆవిడ. "మరి మీరండీ?" అని పెద్దావిడని అడిగింది భావన. "నేనూ వస్తానమ్మా. కానీ చాలా విషయాలు గుర్తుండవు. మావాళ్ళు ఎప్పుడు తీసుకువస్తే అప్పుడే వస్తాను" అని నవ్వింది పెద్దావిడ.
"మీది ఏ ఊరన్నారు?" అని పెద్దావిడ ఎర్ర చీరావిడని అడిగింది.
"రాజమండ్రి నుంచి వచ్చానండీ. నరాలకి ఏదో ఇబ్బంది ఉంటే చూపించుకుంటున్నాను" అని జవాబిచ్చింది ఆవిడ.
"మాదీ రాజమండ్రేనమ్మా. చిన్నతనమంతా అక్కడే గడిచింది. కానీ ఆ బ్రిడ్జీ కట్టకముందే తెనాలికి మారిపోయాము. పెళ్ళై కాపురానికి మద్రాస్ వెళ్లిపోయాను. తర్వాత ఆట్టే రాజమండ్రికి వెళ్ళే అవకాశం రాలేదు" అంది పెద్దావిడ.
"మాది రాజమండ్రి దగ్గర అమలాపురమండీ" అంది ఎర్రచీరావిడ.
"అయితే ప్రభలతీర్థం జరిగేది మీ ఊళ్ళోనే కదూ? చిన్నప్పుడు మా తాత వేలుపట్టుకొని తీర్థానికి వెళ్ళేవాళ్ళం. జీళ్ళు, చెరుకుగడలు తినేవాళ్ళం" అంది పెద్దావిడ.
"అవునండీ. చాలా బాగా జరుగుతాయి" అని నవ్వింది ఎర్రచీరావిడ.
"మీరెక్కడ ఉంటారమ్మా?" అని భావనని అడిగింది పెద్దావిడ. "మొదటినుంచి హైదరాబాద్ అండీ. ఎక్కడకీ వెళ్ళలేదు ఇన్నేళ్ళలో. చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు అన్నీ ఇక్కడే" అని మళ్లీ రెండో ప్రశ్నకి తావివ్వకుండా క్లుప్తంగా చెప్పేసింది భావన.
ఎర్ర చీరావిడ అందుకుంది, "మా అమ్మాయికీ నీ వయసే. దానికి ఇద్దరు పిల్లలు. అమెరికాలో ఉంటారు" అని, పెద్దావిడ వైపుకి తిరిగి, "మీ పిల్లలు ఎక్కడ ఉంటారు?" అని అడిగింది.
"నాకు ఒక కూతురు, ఒక కొడుకు. ఎక్కడో ఉంటారు. గుర్తులేదు. ఇది ఏ ఊరు?" అని కాసేపు ఆలోచిస్తూ అయోమయంగా ముఖం పెట్టింది పెద్దావిడ. "ఇది హైదరాబాద్ బామ్మగారూ" అంది భావన. "ఆ, ఇక్కడే ఉంటారు మా అమ్మాయి వాళ్ళు. మీకు తెలుసేమో" అంది పెద్దావిడ నసుగుతున్నట్టు.
భావనకి ఆశ్చర్యంగా అనిపించింది. చిన్నప్పటి కబుర్లు మాగాయిబద్దలు, చెరుకుగడలతో సహా గుర్తుపెట్టుకొన్న పెద్దావిడ ఇప్పుడు ఇంత అయోమయంగా అయిపోయింది ఏమిటా అనుకుంది.
ఈ మాటలతో అస్సలు సంబంధం లేనట్టు, ఎర్ర చీరావిడ టక్కున టాపిక్ మార్చేసింది. "మా మనవలు వచ్చే నెల అమెరికానుంచి వస్తున్నారు. మా అమ్మాయికి మన పిండివంటలు వండిపెట్టే తీరిక ఉండదు. అన్నీ దొరుకుతాయనుకోండి అమెరికాలో కూడా. అయినా ఇంట్లో వండిపెడితే ఆ తృప్తి వేరు కదా?" అంది.
పెద్దావిడ వెంటనే, "అవునమ్మా. మా పిల్లల చిన్నప్పుడు ఇంట్లో ఎప్పుడూ రెండు రకాలు ఉండేలా వండుతూనే ఉండేదాన్ని. మా పిల్లకి కజ్జికాయలు నచ్చేవి, పిల్లవాడికి జంతికలు నచ్చేవి. మావారికి నూనె వాసన పడేది కాదు. అందుకని నూనె పిండివంటలు చేయాలంటే, పక్కింట్లో వండి, వాళ్ళకి సగం ఇచ్చి, నేను సగం తెచ్చుకొనేదాన్ని" అంది పెద్దావిడ.
"సున్నుండలు ఇష్టంగా తింటారు మా మనవలు. మా మనవడికి పంచదార పలుకులు తగిలితే నచ్చుతుంది. వాడికోసం ప్రత్యేకంగా చేస్తాను" అంది ఎర్ర చీరావిడ.
"పలుకులు తగిలేలా కాస్త పంచదార వేసినా, బెల్లంపాకంతో సున్నుండలు చేయండమ్మా, వంటికి బోలెడు బలం. ఎదిగే పిల్లలు కదూ?" అంది పెద్దావిడ.
"మిక్సీలో పంచదార ఆడించి కలిపేయటం అలవాటై పాకం తీయటమే మానేశాము ఈమధ్య. మీరు చెప్పారుగా, అలాగే చేస్తానులెండి" అంది ఎర్ర చీరావిడ.
"మా అమ్మాయి కూడా సున్నుండలు ఇష్టంగా తినేది. రెండు బుగ్గల్లో రెండు సున్నుండలు కుక్కుకొని, చప్పరిస్తూ వెళ్ళేది బడికి" అని మురిపెంగా చెప్పింది పెద్దావిడ.
వీళ్ళ కబుర్లు వింటూ టైం ఇట్టే గడిచిపోతోంది భావనకి. పనిలో పనిగా కొన్ని వంటల చిట్కాలు, కొన్ని కథలు, కబుర్లు, మద్రాస్ విశేషాలు, మంగళహారతులు తెలిశాయి ఆ కాసేపటిలోనే. పిల్లల పెంపకంలో 50లలోను, 70లలోను, 90లలోను ఉన్న తేడాలు కూడా తెలిశాయి.
రిసెప్షనిస్ట్ ని చూస్తూ పళ్ళు నూరటంకంటే చాలా మంచి కాలక్షేపం అయ్యిందనుకుంది. ఈలోగా నలుగురైదుగురు పేషెంట్స్ లోపలకి వెళ్లి వచ్చినట్టున్నారు. ఒకొక్కరితోను ఎక్కువసేపే గడుపుతున్నారు లోపలున్న డాక్టర్. అందులోనూ అందరూ పెద్దవాళ్ళు కనుక వాళ్ళకి అర్థమయ్యేలా కూలంకషంగా అన్నీ చర్చిస్తున్నట్టున్నారు. అందుకే ఇంత వెయిటింగ్ ఉన్నా, ఈయన మంచి డాక్టర్ అని బయట పేరు బాగుంది.
మరొక్కసారి ఈమెయిల్ చెక్ చేసుకుంటే నయం అనుకొని, ఫోన్ బయటకి తీస్తుండగా, రిసెప్షనిస్ట్ వీళ్ళ దగ్గరకి వచ్చి, "ఆంటీ, మీ తిరునాళ్ళు, ఊరగాయల కబుర్లు అయిపోతే మీ అమ్మగారిని తీసుకొని వెళ్ళండి, లోపలి పేషెంట్ బయటకొచ్చాక" అని నవ్వి, ఆమె వెయింటింగ్ హాల్ చివరనున్న బాత్రూమ్ వైపుకి వెళ్లింది.
భావన ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వీళ్ళు ఇక్కడే కలిసినట్లు మాట్లాడుకున్నారే అనుకుంటుండగా, తనకంటే పెద్దావిడ మరింత అవాక్కవ్వటం గమనించింది. పెద్దావిడ కళ్ళు పెద్దవి చేసి, "నువ్వు నా కూతురివా?" అంది. ఎర్ర చీరావిడ "అవునమ్మా, దా, నెమ్మదిగా లే" అంటూ ఆవిడని రెక్క పుచ్చుకొని లేపి, వీల్ చెయిర్ లో కూర్చోపెట్టింది. "నా కూతురివేనేమిటే నువ్వు?" అంటూ ఏదో ఆలోచించి, అయోమయంలోంచి ఆనందంలోకి ముఖకవళికలు మార్చింది పెద్దావిడ. "అవునమ్మా, నేనే, సుజాతనే" అంది కూతురు నవ్వుతూ. "అవునేవ్, ఎవరో అనుకున్నాను. డాక్టర్ పిలిచారా?" అంటుండగా, "ఉంటామండీ" అని భావనకి కళ్ళతోనే వీడ్కోలు పలికి, చిరునవ్వుతో వీల్ చెయిర్ తోసుకుంటూ లోపలకి తీసుకువెళ్లింది సుజాత.
ఈలోగా బాత్రూమ్ నుంచి రిసెప్షనిస్ట్ వచ్చి, తన సీట్లో తను కూర్చుంది. భావన ఇక ఆగలేకపోయింది. విసుక్కున్నా పర్వాలేదని, ఆవిడ దగ్గరకు వెళ్లి, "వాళ్ళు తల్లీకూతుళ్ళా? ఇక్కడే ఇప్పుడే కలుసుకున్నట్టు మాట్లాడుకున్నారే?" అంది. ఈసారి రిసెప్షనిస్ట్ ఏ స్వరంతో మాట్లాడుతోందో తను పట్టించుకోలేదు. ఆఫీస్ కి వెళ్ళాలి అనే కంగారు తనలో లేదు. అర్జెంట్ ఈమెయిల్ వచ్చాయేమో చూసుకోనేలేదు. ఆవిడ చెప్తున్నది ఆసక్తిగా వింటోంది.
"ఆ పెద్దావిడకి 85 ఏళ్ళుంటాయి. గత పదేళ్ళుగా ఆవిడ ఇక్కడకి వస్తున్నారు. మొదట్లో కొడుకు తీసుకువచ్చేవారు. కానీ ఆమధ్య కొడుకు చనిపోయారట. ఈవిడ కూతురు. అప్పట్లో వేరే దేశంలో ఉన్నా, తమ్ముడు చనిపోయాక, తల్లి మానసికంగా కూడా చితికిపోవటంతో అన్నీ మానుకొని అమ్మని చూసుకోవటం కోసం ఇక్కడకి మకాం మార్చుకున్నారు. ఈ పదేళ్ళలో పెద్దావిడ జ్ఞాపకశక్తి అంతకంతకీ తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఎవరైనా చెప్తే తప్ప తన పిల్లల్ని కూడా ఆవిడ గుర్తుపట్టలేరు" అంది.
"మరి చిన్నప్పటి కబుర్లన్నీ పూసగుచ్చినట్టు చెప్తున్నారు కదా?" అంది భావన.
"అదే అల్జీమర్స్ వ్యాధి లక్షణం. బాగా చిన్నప్పటి విషయాలు అన్నీ గుర్తుంటాయి. కానీ, ప్రస్తుత విషయాలు గుర్తుండవు. ఆవిడ ఆరోగ్యం అంతకంతకీ క్షీణిస్తోంది. మాట కూడా ఈమధ్య బాగా అస్పష్టంగా వస్తోంది పాపం. అయినా కూతురు కబుర్లు చెప్తుంటే, కూతురని కూడా గుర్తుపట్టకపోయినా, కష్టపడి మాట్లాడుతున్నారు. ఉన్నన్నాళ్ళూ ఆవిడని సంతోషంగా ఉంచాలనే సుజాతగారి ప్రయత్నం. అందుకే కూతురునని చెప్పకుండానే ఆవిడతో రకరకాల కబుర్లు చెప్తూ ఉంటారు. నేనూ ఒకసారి అడిగాను, రోజూ అవే కబుర్లు విన్నా, మళ్లీ కొత్తగా ఎలా వింటున్నారు అని. అమ్మ నవ్వుతోంది కదా, అదే చాలంటూ నవ్వుతారు. ఆవిడకి ఉన్న సహనం, శాంతం పిల్లలందరికీ ఉంటే అసలు పెద్దవాళ్ళకి బాధే ఉండదు అనిపిస్తుంది.
నమ్ముతారో లేదో, ఈ ఎనిమిదేళ్ళలో నేనే మాగాయిబద్దలు, తిరునాళ్ళు, మంగళహారతుల గురించి వందలసార్లు విన్నాను. వాళ్ళు వచ్చేది నెలకొకసారే. మరి ఆవిడ ఇంకెన్నిసార్లు పగలు-రాత్రి విని ఉంటారు? అయినా మళ్లీ, మళ్లీ వింటారు, మళ్లీ మళ్లీ కొత్తగా విన్నట్టే నవ్వుతారు. ఎప్పుడైనా ఆవిడకి తన కొడుకు మరణమో, ఇంకేమైనా పాత విషయాలో గుర్తొచ్చి బాధ కలుగుతోంది అనిపిస్తే, ఇంకేదో విషయంలోకి వెళ్లిపోతారు. ఆ మహాతల్లి అదృష్టం, కూతురు టాపిక్ ని మార్చిందని కూడా పసిగట్టలేని పసి మనసు ఆవిడది. ఆవిడ మంచాన ఉండచ్చు, ఇంట్లో వాళ్ళని గుర్తుపట్టకపోవచ్చు, తన పని తను చేసుకోలేకపోవచ్చు, అన్నం తినాలన్నా చేతులు వణకచ్చు, లేచి నాలుగు అడుగులు వేయలేకపోవచ్చు. కానీ ఇలాంటి కూతుర్ని కన్నందుకు, ఉన్నంతకాలం ఆ పెద్దావిడ ముఖాన చిరునవ్వు మాత్రం చెదరదు" అంది రిసెప్షనిస్ట్.
ఈలోగా బెల్ మోగితే లేచి తలుపు దగ్గరకి వెళ్లి డాక్టర్ చెప్పే మాటలకి తలాడించి, మళ్లీ వచ్చి కూర్చొని ఏదో టైప్ చేసుకోవటం మొదలుపెట్టింది. భావన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. లోపల డాక్టర్ తల్లీకూతుళ్ళతో మాట్లాడుతున్నారు. కానీ భావనకి ఆలస్యం అయిపోతోందన్న కంగారు లేదు. గుండెల్లో ఏదో బరువు. అది బాధ కాదు, భయం కాదు, ఆనందం కూడా కాదు. ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఆ తల్లీకూతుళ్ళ మధ్య జరిగిన సంభాషణ, ఆ పెద్దావిడ కబుర్లు వింటూ, ఇంకా ఇంకా అడుగుతూ తలాడిస్తున్న కూతురు, ఆ పెద్దావిడ ముద్ద మాటలమధ్య బోలెడు జీవితసారం, ఆవిడ బోసినవ్వు.. ఇవన్నీ తన కళ్ళలోనే ఆడుతున్నాయి.
జ్ఞాపకశక్తి పోవటం ఆ పెద్దావిడకి శాపమా, వరమా? ఇందాక నోటీస్ బోర్డ్ లో కరపత్రాలపై ఉన్నవి చదివింది. నిత్యజీవితంలో చిన్నచిన్నవి కూడా మరచిపోతూ ఉంటారట పాపం పెద్దవాళ్ళు. వస్తువులు ఎక్కడ పెట్టారో మరచిపోవటం, ఏం చెప్పాలనుకున్నారో మరచిపోవటం, ఉన్న చోటు ఏదో, జరుగుతున్న తారీఖు ఏదో మరచిపోవటం, ఏదో చేయాలనుకొని లేచి అదేమిటో మరచిపోవటం... వెరసి నిత్యజీవితం ఒక గందరగోళంగా మారుతుందట.
కానీ, అవన్నీ పెద్దావిడని ఏం బాధపెట్టలేవు. హాయిగా చిన్ననాటి రోజుల్లో కాలం గడుపుతోంది. ఒకప్పటి కష్టాలు, కన్నీళ్ళు, అవి గుర్తుచేసే సంఘటనలు, మనుషులు ఆవిడ చుట్టూ లేవు. ఒకవేళ గుర్తొచ్చినా, అవి మరపించే కూతురు నిరంతరం పక్కనే ఉంటోంది. ఇంతకంటే భోగం వృద్ధాప్యంలో ఎవరికి లభిస్తుంది? ఆవిడ అందరికంటే సంపన్నురాలు. అవధులు లేని ఆనందం ఆవిడ సొంతం. కన్నందుకు ఆవిడపట్ల కూతురు తీర్చుకుంటున్న ఋణం ఈ ఆనందం. ఇంతకంటే వైభోగం ఏముంటుంది?
ఒక్క గంట క్రితం ఉత్తి పుణ్యానికి తనకి ఆ రిసెప్షనిస్ట్ పట్ల కోపం వచ్చింది. తన వంతు వచ్చేవరకు ఎదురుచూడమంది చెప్పింది, అంతేగా? దానికి ఎంత అసహనం కలిగింది తనలో? నిజానికి ఈ తల్లీకూతుళ్ళ పట్ల ఆవిడకున్న గౌరవభావాన్ని పంచుకుంటున్నప్పుడు ఆమెలోని సౌశీల్యం కనిపించింది. తనలోని అసహనం వల్ల, తనలోని శాంతం వల్ల ఒకే మనిషి రెండు రకాలుగా కనిపించింది కదా అనిపించింది. మరి మరోపక్క సహనానికి ఎర్ర చీర కట్టినట్టున్న ఆ స్త్రీమూర్తిని మనసులోంచి తీసేయలేకపోతోంది.
రిసెప్షనిస్ట్ "అనసూయమ్మ గారి అటెండెంట్!" అని తనని పిలవటంతో లోకంలోకి వచ్చి, కళ్ళు తుడుచుకొని లేవటానికి సిద్ధమై, బ్యాగ్ భుజాన వేసుకుంటూ, నెమ్మదిగా డాక్టర్ గది తలుపు తెరుచుకొని బయటకి వస్తున్న వీల్ చెయిర్ వైపుకి చూసింది. రెండవ బాల్యంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తూ కేరింతలు కొడుతున్న ఆ తల్లి నిర్మలమైన నవ్వుముఖాన్ని చూడటానికో, తల్లిని పసిపాపగా లాలిస్తూ అందులోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్న ఆ కూతురి నిష్కల్మషమైన ప్రేమపూరిత వదనాన్ని చూడటానికో, వాళ్ళని అభినందిస్తూ హాయిగా వీడ్కోలు పలుకుదామనో తెలియదుగానీ, మనసంతా నిండిన అమితమైన ఆత్మీయతతో ఎదురుచూస్తూ, డాక్టర్ గదివైపుకి అడుగులు వేసింది భావన.
This story has been published in Eenadu Sunday magazine on February 26, 2023. Here is the link:
https://www.eenadu.net/telugu-article/sunday-magazine/eenadu-sunday-story/7/323000248