Pages



Monday, 31 January 2022

పానీపూరీ - వేడి కాఫీ

  "ఇంకోసారి దాన్ని చూడచ్చు కదా అని..."

...ఆ పెద్దాయన అన్న ఈ మాటలే రాజేశ్ చెవుల్లో ధ్వనిస్తూ ఉన్నాయి. బైక్ నడుపుతున్నాడు. చుట్టూ నడుస్తున్న వాహనాల రొద, హారన్లు ఇవేమీ తనకి వినిపించట్లేదు. ఆ పెద్దాయనే గుర్తొస్తున్నారు.

*****

    ఈమధ్య రాజేశ్ కి ఆఫీసులో పని ఎక్కువయ్యింది. ఆ విసుగంతా తన మీదే చూపిస్తున్నాడని నిత్య ఆరోపిస్తూనే ఉంది. పేరుకి ఏరియా హెడ్డే అయినా, చెప్పుకోవటానికీ, ఖర్చు చేయటానికీ జీతం బాగానే అందుతున్నా, చేసే ఉద్యోగం మార్కెటింగ్ రంగంలో అవ్వటం వల్ల, కార్లో తిరగటానికి ఒకటికి రెండు గంటలు పడుతుందని బైక్ మీదే గంటల కొద్దీ గడపటం వల్ల నడుము, మణికట్లు నొప్పులు రావటం, దుమ్ము-ధూళి వల్ల దగ్గులు, తలనొప్పులు, జుట్టు ఊడటం... ఇక ఒకటేమిటి, ఎన్నైనా వస్తున్నాయి ఇబ్బందులు. ఈ యాతనకి తోడు ఉద్యోగంలో టార్గెట్లు. శారీరకంగా, మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ, పెళ్ళాం బిడ్డలతో గడపటమే లేదు సరికదా, మాట్లాడే నాలుగు మాటల్లోనూ విసుగు, చిరాకే ఉంటున్నాయి.

    నిత్య చెప్పటమే కాదు, తనకీ తెలుస్తోంది. కానీ ఎంత వద్దనుకున్నా ఈ కోపం, విసుగు ఇంకా ఇంకా ఎక్కువవుతున్నాయి. ఉదయం అదే జరిగింది. చిన్న విషయానికే ఇంట్లో చిలికి చిలికి గాలివాన అయ్యింది.

    తన పైస్థాయి మేనేజర్ ఒకతను ఊళ్ళోకి వస్తున్నానని కబురు పెట్టాడు. అతనికి పిల్లనిచ్చిన మామగారు ఏదో సర్జరీ కోసం ఈ ఊళ్ళో ఆసుపత్రిలో చేరారని, ఆయన్ని చూడటానికి వస్తున్నానని, రాజేశ్ ని కూడా అక్కడికే రమ్మని, ప్రాజెక్ట్ విషయాలు అక్కడే చర్చిద్దామని పిలిచాడు.

    అసలే టార్గెట్లు అవ్వటానికి టైం తక్కువ ఉందని టెన్షన్ లో ఉంటే, అతన్ని కలవటానికి ఒక రోజంతా వృధా అయిపోతే ఎలా? అసలే ఆ ఆసుపత్రి ఊరికి ఆ చివరన ఉంది. రాను పోను నాలుగు గంటలు పోతాయి, అక్కడ చర్చలంటే ఇంకో నాలుగైదు గంటలు పట్టేస్తాయి. కానీ ఇప్పుడు రానని అనలేని పరిస్థితి. ఇంకో నెలలో రివ్యూ మీటింగులు ఉంటాయి. ఈ బాస్ ఇచ్చే రివ్యూని బట్టే రాజేశ్ కి జీతం పెరుగుతుంది. ఇలాంటి సమయంలో అతనితో రాలేనని చెప్పటం రిస్కే. ఇక తప్పక వెళ్దామని నిర్ణయించుకున్నాడు.

    ఉదయమే బయల్దేరుతానని నిత్యకి చెప్పాడు. ఉదయం పిల్లవాడిని స్కూలుకి సిద్ధం చేస్తూ ఇడ్లీలు వేసి పెట్టింది. పచ్చడిలో ఉప్పు వేయలేదని కేకలేశాడు.

"అయ్యో, ఇంకా వేయలేదు. అప్పుడే వడ్డించేసుకున్నావా?" అంది.

"అప్పుడేనా? ఏడింటికి బయల్దేరాలి అని ముందే చెప్పాను కదా?" అన్నాడు.

"చంటిగాడికి స్నానం చేయించటానికి వెళ్ళాను, ఇదిగో వస్తున్నా. ఒక్క నిముషం" అంది.

"చట్నీ అంతా చేసినదానివి, ఉప్పు వేయటానికి ముహూర్తం కుదరలేదా తమరికి?" అని విసుక్కున్నాడు.

"వాడు బాత్రూమ్ కి వెళ్ళాడు. అందుకే వెళ్ళాను. వచ్చి వేద్దామనుకున్నాను. ఈలోపే నువ్వు వచ్చేశావు" అంది.

"అంటే, నేను రావటమే తప్పంటావు. పోనీ మళ్లీ గదిలోకి వెళ్లి ఒక అరగంట సేపు అద్దం ముందు నుంచొని రానా?" అని మళ్లీ చిర్రుబుర్రులాడాడు.

"ఇదిగో, వచ్చేశా. ఆ ప్లేట్ పక్కకి పెట్టేసేయ్. ఇదిగో, ఉప్పు వేసిన చట్నీ. ఈ ప్లేట్ లో తిను" అని ఇంకో ప్లేట్ అందించి, అందులోకి ఇడ్లీలను మార్చింది.

"ఇప్పుడు ఆ పచ్చడి ఏం చేస్తావు? పడేస్తావా?" అన్నాడు.

"పడేయనులే" అంది.

"డబ్బులు ఎక్కువయిపోయాయి నీకు. సంపాదించేవాడికి తెలుస్తుంది బాధ" అన్నాడు.

"పడేయను మహాప్రభో, నీకు టైమ్ అవుతోంది కదా? బయల్దేరు" అంది.

"అంటే, నోరు మూసుకోమంటున్నావు. అంతే కదా?"

"కాదు. నిజంగానే టైమ్ అవుతోంది కదా? ఇబ్బంది పడతావని."

"మొగుడితో తప్ప అందరితోనూ సవ్యంగానే మాట్లాడతావు. నా కర్మ."

"ఇప్పుడు నేను ఏమన్నాను?"

"ఏమీ అనలేదు. నాకే ఊసుపోక అరుస్తున్నాను."

"సరే, వాడికి టైమ్ అవుతోంది. స్నానం చేయించాలి. నువ్వు తినేశాక, ఈ కాఫీ తాగి, తలుపు దగ్గరకి వేసి వెళ్లిపో."

"వేస్తానులే. మీ ఇంట్లో లాగా వదిలేసి వెళ్ళను."

"ఏంటి? ఏమన్నావు?"

"ఏం లేదు. అంత ధైర్యమా?"

"లేదు. ఏదో అన్నావు. చెప్పు."

"నిన్ను చాలా చక్కగా పెంచారని అంటున్నాను."

"ఇప్పుడు ఆ మాటలు మాట్లాడే టైమ్ ఉందా నీకు?"

"పొద్దున్నే లేచి వాడిని తెమిల్చి, నాకు టిఫిన్ దగ్గరుండి పెట్టచ్చు కదా?"

"రోజూ అలాగే పెడుతున్నాను కదా? ఈరోజు వాడి స్కూల్ టైమ్ లో నువ్వు బయల్దేరుతున్నావు, రోజూ కంటే త్వరగా."

"అవును. అదీ నా తప్పే. చాలా సంతోషం. ఈకాలంలో పెళ్ళాలకి ఇవన్నీ ఏం తెలుస్తాయి? మొగుడు ఎంత కష్టపడి వచ్చినా అనవసరం."

"ఇప్పుడు మళ్లీ మొత్తం ఆడవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి స్టేట్మెంట్లు ఇస్తున్నావా? ఇంక చాలు రాజేశ్, నీకూ వాడికీ కూడా టైమ్ అవుతోంది."

"నువ్వు మాట్లాడమంటే మాట్లాడతాను, వద్దంటే ఆపేస్తాను. అదే కదా నీకు కావలసింది?"

"అది కావాలి, ఇది కావాలి అని పోరు పెట్టే పెళ్ళాం దొరికితే బాగుండేది నీకు. అడగట్లేదు కదా, అందుకే ఇంకా లోకువయ్యాను. పెళ్ళైన కొత్తల్లోనే బాగుండేది.  వస్తూ వస్తూ మల్లెపూలో, పానీపూరీలో, చెరుకురసమో చిన్నదైనా తెచ్చేవాడివి. ఇప్పుడు ఇంటికి రావటమంటేనే బాధ అయిపోయింది నీకు. అయినా ఏనాడూ ఏమీ అడగకుండా, సహకరిస్తుంటే, నాకు మిగిలేది ఇది. ఏదో ఒకటి చెయ్యి. పొద్దున్నే ఈ డిస్కషన్లు నావల్ల కాదు. నీ టెన్షన్లన్నీ చూపించటానికి నేనే దొరికాను. నువ్వు కూడా అందరితోనూ బాగానే మాట్లాడతావు. నా విషయానికి వచ్చేసరికే కారాలూ, మిరియాలూ నూరుతావు. పెళ్ళాం అంటే మొగుళ్ళందరికీ లోకువే."

"నువ్వు కూడా మగవాళ్ళందరినీ ఒక తాటికి కట్టి మాట్లాడుతున్నావు కదా? పానీపూరీ కావాలంటే నువ్వు కొనుక్కు తినచ్చు. నన్నిలా దెప్పక్కరలేదు. ఎంతసేపూ నీ గురించే నువ్వు ఆలోచిస్తావు. నాకేం చేస్తున్నావు? ఈ కాఫీ కూడా వేడిగా లేదు. చలిలో 20 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళాలి. వేడి కాఫీ తాగే యోగం కూడా లేదు నాకు."

"ఇంకొక అరగంట నా మీద అరువు. అప్పుడు కాఫీ వేడిగా ఉంటుంది మరి. నాకు కావలసింది పానీపూరీ కాదు. అది తెచ్చిచ్చే నీ ప్రేమ, ఆదరణ. అది అర్థం చేసుకోవు."

"ఛీ! చెప్పినా నన్ను అర్థం చేసుకోదు. పైగా నేనే తనని అర్థం చేసుకోవాలట. బయటకి వెళ్ళే మొగుణ్ణి చిరునవ్వుతో పంపించటం ఎప్పటికి వస్తుందో! అయినా నిన్ను అని ఏం లాభం? ఎవరి నుంచో వచ్చిన పోలికలు."

"రాజేశ్, అంటే నన్ను అను. అమ్మానాన్నలని అనద్దని చాలాసార్లు చెప్పాను. నాకూ చిరునవ్వు నవ్వాలనే ఉంది. ఇలా ఉండటం నాకేం ఇష్టం కాదు. నామీద పొద్దున్నే ఇలా అరుస్తుంటే ఎలా నవ్వమంటావు?" అంది నిత్య కన్నీళ్ళు పెట్టుకుంటూ.

"మాట్లాడితే ఈ ఏడుపొకటి" అంటూ కాఫీ తాగకుండానే విసురుగా బయటకు వెళ్లి, బైక్ స్టార్ట్ చేసి రోడ్డున పడ్డాడు రాజేశ్. చెవిలో ఎఫ్.ఎమ్ లో పాటలు పెట్టుకొని వింటూ, 20 కిలోమీటర్లూ నగర వాహన సముద్రాన్ని ఈది వెళ్ళేసరికి కాస్త మూడ్ మారింది రాజేశ్ కి.

 *****

    హాస్పిటల్లో రాజేశ్ బాస్ సత్యని కలిశాడు. ఐసీయూలో అతని మామగారిని ఒకసారి పలకరించి, ఐసీయూ వెయిటింగ్ ఏరియాలో మూలకున్న రెండు కుర్చీలు చూసుకొని కూర్చున్నారు ఇద్దరూ. సత్య తన బావమరిదితో "నేను కాసేపు ఇక్కడ ఉంటాను కదా? ఒకసారి నువ్వు ఇంటికి వెళ్లిరా" అని పంపించాడు. కాసేపు ఏవేవో ఆఫీస్ విషయాలు చర్చించుకున్నాక, కేంటీన్లో బిస్కెట్లు, టీ లాగించి, మామూలుగా రాజకీయాలు, షేర్ మార్కెట్ల కబుర్లు చెప్పుకుంటున్నారు ఇద్దరూ.

    రెండు కుర్చీల అవతల కూర్చున్న ఒక వృద్ధుడిని ఇంతవరకు వాళ్ళు గమనించలేదు. ఆయనే రాజేశ్ ని పిలిచి "బాబూ, ఇక్కడ ఫోన్ చార్జింగ్ కి పెట్టాను. నా బ్యాగ్ ఇక్కడ ఉంది. ఐసీయూ నుంచి నర్స్ నన్ను రమ్మని పిలిచింది. ఒకసారి వెళ్తాను. కొంచెం నా ఫోనూ, బ్యాగ్గూ చూస్తారా బాబూ?" అన్నారు. రాజేశ్ వాచీ చూసుకుంటూ, "నేనిక్కడ ఇంకో అరగంట వరకే ఉంటానండీ. ఈయన కూడా ఇంక బయల్దేరుతారు" అన్నాడు. "అబ్బే, ఐదు నిముషాల్లో వచ్చేస్తాను బాబూ" అన్నారాయన. "సరే, వెళ్లి రండి" అన్నాడు రాజేశ్. ఆ పెద్దాయన నడిచి వెళ్తుంటే గమనించాడు రాజేశ్. చేతి వేళ్ళు సన్నగా వణుకుతున్నాయి. చిన్నపిల్లల కంటే చిన్నగా, బుడిబుడి అడుగులు వేస్తూ నడిచి లిఫ్ట్ వైపుకి వెళ్తున్నారు. ఎనభై ఏళ్ళ పైనే ఉంటుంది వయసు. కాటన్ తెల్ల పంచ మీద లేత నీలం రంగు చొక్కా వేసుకున్నారు. చిన్న సంచీ చేతిలో పట్టుకొని నెమ్మదిగా ఆ చిన్న చిన్న అడుగులతో లిఫ్ట్ చేరుకున్నారు.

    "పాపం కదా రాజేశ్? పెద్దవాళ్ళకి ఎంత కష్టం? పిల్లలంతా ఏ ఎన్నారైలో అయ్యుంటారు. ఐసీయూలో ఉన్నది ఆయన భార్య అయ్యుంటుంది." అన్నాడు సత్య. "అయ్యుండచ్చు" అన్నాడు రాజేశ్ ఏదో ఆలోచిస్తున్నట్టుగా తల ఊపుతూ. "పిల్లలు ఏ అమెరికాకో, ఆస్ట్రేలియాకో చదువుకో, ఉద్యోగానికో వెళ్తాం అన్నప్పుడు ఆనందంతో అందరికీ మావాడు ఆ దేశంలో ఉన్నాడు, మా అమ్మాయి ఈ దేశంలో కాపురానికి వెళ్లింది" అని చెప్పుకుంటారు. తీరా పిల్లల ఆదరణ తల్లిదండ్రులకు అవసరం అయ్యేనాటికి వాళ్ళు రారు, రాలేరు. ఇక్కడ వీళ్ళు ఒక్కరే ఉండిపోతారు. ఇప్పుడు మా బావమరిదిని చూడు. ఇక్కడ ఉన్నాడు కనుక తండ్రిని చూసుకుంటున్నాడు. మేమూ పిలవగానే పలికేలా ఉన్నాము. కాబట్టి మా మామగారికి సర్జరీ అనగానే వచ్చి వాలిపోయాము. హాయిగా ఉన్నారు వాళ్ళు" అని తన అభిప్రాయం తాను కుండ బద్దలుకొట్టినట్టు చెప్పుకుపోయాడు సత్య. అవునన్నట్టు తల ఊపుతూ వింటున్నాడు రాజేశ్.

    రాజేశ్ తల్లిదండ్రులు తమ సొంత ఊళ్ళోనే ఉంటున్నారు, తన అన్నావదినలతో. కనుక కొంత నిశ్చింతగానే ఉంటుంది రాజేశ్ కి. అప్పుడప్పుడూ తన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. అత్తమామలకి నిత్య ఒక్కతే కూతురు. ఈ ఊళ్ళోనే పక్క ఏరియాలో ఉంటూ, తరచూ రాకపోకలు చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా.

    ఈలోగా ఆ పెద్దాయన మళ్లీ లిఫ్ట్ దిగి అలాగే బుడిబుడి అడుగులు వేసుకుంటూ దగ్గరకు వచ్చారు. ఈసారి మరింత నిశితంగా గమనించాడు రాజేశ్. ఆయన చెయ్యే కాదు, మెడ కూడా సన్నగా వణుకుతున్నట్టుగా ఊగుతోంది. "పాపం ఇంత వృద్ధాప్యంలో, ఆయనకే ఇలా ఉంటే, భార్యను చూసుకోవలసిరావటం ఎంత దారుణం?" అనుకున్నాడు.

    పెద్దాయన పక్కకి వచ్చి కూర్చుంటూ, "చాలా థాంక్స్ బాబూ. ఏదో సంతకం కావాలని పిలిచింది నర్సు" అన్నారు.

    "పర్వాలేదండీ. ఎవరున్నారండీ ఐసీయూలో?" అని అడిగాడు రాజేశ్.

    "మా ఇంటావిడ బాబూ. నాలుగేళ్ళుగా నలతగానే ఉంది. రెండు రోజుల కిందట, రాత్రి ఉన్నట్టుండి వాంతులు చేసుకుంటే, ఇక్కడకి తీసుకువచ్చాము బాబూ" అన్నారు.

    "ఇప్పుడు బాగానే ఉందా ఉండీ?" అన్నాడు రాజేశ్.

    "వాంతులు ఆగేలా ఏదో మందు ఆ రాత్రే ఇచ్చారు. ఏవేవో టెస్టులు చేశారు. ఊపిరి తిత్తుల్లో ఏదో  ఇన్ఫెక్షన్ మొదలై ఇప్పుడు మెదడుకి చేరిందన్నారు. సర్జరీ పడుతుందా లేదా అని డాక్టర్లు మాట్లాడుకొని, ఇదిగో, ఇందాకే సర్జరీ చేసి చూద్దామని నిర్ణయించారు బాబూ. అందుకే సంతకం పెట్టమంటే వెళ్లి వచ్చాను" అన్నారాయన ఆయాసంగా ఒకొక్క మాటా పలుకుతూ.

    "మీ పిల్లలు ఎవరూ దగ్గరలో లేరా అండీ?" అని అడిగాడు సత్య.

    "ఉన్నారు బాబూ. ముగ్గురు పిల్లలూ ఈ ఊళ్ళోనే ఉన్నారు. రాత్రి ఒకరూ పగలు ఒకరూ ఇక్కడే ఉంటున్నారు. నన్ను ఇంటికి వెళ్లిపోమన్నారు. నేనే ఇక్కడ ఉంటానని పట్టుబట్టాను. కొడుకు, కోడలు స్నానాలు, భోజనాలు చేద్దామని ఇందాకే వెళ్ళారు. కూతురు, అల్లుడు ఇప్పుడు నాకు భోజనం తీసుకువస్తారు. రాత్రి మళ్లీ చిన్న కొడుకు వస్తాడు" అన్నారు. సత్య, రాజేశ్ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. "మనం అనవసరంగా బోలెడు కథలు అల్లేసుకున్నాం కదా?" అన్నట్టు కళ్ళతోనే కనీ కనిపించకుండా నవ్వుకున్నారు.

    "నేను ఫుడ్ కార్పరేషన్ లో చేసి రిటైర్ అయ్యాను బాబూ. మాకు 20 ఏళ్ళ లోపే పెళ్ళయ్యింది. అది నా మేనకోడలే. పాపం అరవై ఏళ్ళ పైనే ఒకరికొకరం తోడుగా గడిపాము. అదలా మాటా పలుకూ లేకుండా మంచం మీద పడి ఉంటే..." అని దుఃఖం పొంగుకు రాగా, వాక్యం పూర్తి చేయలేక ఆగిపోయి, కళ్ళు తుడుచుకున్నారు ఆయన.

    సత్య, రాజేశ్ ఏమీ మాట్లాడలేదు. అలాగే ఆయన్ని చూస్తూ కూర్చున్నారు. ఆయనే మళ్లీ మాట్లాడారు. "పిచ్చిపిల్ల. చిన్నప్పటి నుంచి గలగలా మాట్లాడేది. కమ్మగా పాటలు పాడేది. ఈమధ్య ఒక మూడేళ్ళుగా ముసలిదయ్యింది. ఏదో మూడు పూటలూ వెళ్ళదీస్తూ వస్తున్నాం ఇద్దరం ఉన్నాం కనుక. పేరుకి మొగుడూ పెళ్ళాలమే కానీ, చిన్నప్పటి నుండి అది నాకు ఫ్రెండే. కలిసి ఆడుకున్నాం. నాకు 84 అయితే దానికి 81 ఏళ్ళు. 81 సంవత్సరాల స్నేహం మాది. ఇప్పుడు ఉన్నట్టుండి అలా పడి ఉండటం చూస్తే, ఏమీ తోచట్లేదు" అన్నారు శూన్యంలోకి చూస్తూ పెదవి విరుస్తూ.

    రాజేశ్ కి ఎందుకో పెద్దాయన చాలా నచ్చారు. "81 ఏళ్ళ స్నేహం. అందులో 65 ఏళ్ళ సంసార జీవితం! చాలా బాగుందండీ. ఆదర్శ దంపతులన్నమాట. మేమైతే ప్రతిరోజూ దెబ్బలాడుకుంటామండీ. మీలాంటివాళ్ళ నుంచి ఎన్నో నేర్చుకోవాలి" అన్నాడు. "ఆదర్శం అనేది చూసేవాళ్ళు అనే మాటే బాబూ. మాటా మాటా అనుకోకుండా ఏ మొగుడూ పెళ్ళాలూ ఉండరు. మళ్లీ ఎంత త్వరగా కలిసిపోయాం అన్నదానిలోనే ఉంటుంది ఆదర్శం అంతా. నాకు చాదస్తం ఎక్కువ, మా ఆవిడకి విసుగు ఎక్కువ. ఇక ఊహించండి మా కాపురం ఎలాంటిదో!" అని గర్వంగా నవ్వారాయన.

    రాజేశ్ కూడా చిన్నగా నవ్వి, "మరి ఎవరు సర్దుకుపోతారు?" అని అడిగాడు. "అది సర్దుకోకపోతే నేను, నేను సర్దుకోకపోతే అది" అన్నారు "ఇందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముంది?" అన్న స్వరంతో. "ఎవ్వరూ సర్దుకోకపోతే?" అన్నాడు సత్య. "ఇద్దరం కలిసి సర్దుకుపోవటమే. జీవితం చాలా చిన్నది బాబూ. మనం చూస్తుండగానే ఎదుగుతాము, పెళ్లిళ్ళు అవుతాయి, పేరంటాలు అవుతాయి, పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు, మనుమలు... ఇలా రెప్పపాటులో అందరం కైలాస యాత్ర చేయాల్సిందే. కోపాలతో కాలక్షేపం వల్ల ఏం మిగులుతుంది?" అన్నారు.

    "మీకు కోపం రాదా?" అని అడిగాడు రాజేశ్. "ఎందుకు రాదు? దూర్వాసుడి పక్క సీటు నాకే. మొన్న నాలుగు రోజుల క్రితం దాన్ని ఊరికే కోప్పడ్డాను... నాలుగు సార్లు పిలిచినా పలకలేదని. వినికిడి తగ్గిన మనిషిని పట్టుకొని వినపడనందుకు కేకలేస్తే దానికి మనసు చివుక్కుమనదూ? ఒక పూటకి నాకు తెలివి వచ్చింది. కానీ ఆరోజే అది ఈ హడావుడి చేసింది. ఇప్పుడు సారీ చెప్పాలని నాకున్నా, అది నన్ను గుర్తు పట్టటం లేదు. అసలు కళ్ళు తెరవాలి, నన్ను చూడాలి కదా? సారీ చెప్పగలనో, లేదో" అంటూనే ఆయన కళ్ళ నీళ్ళ పర్యంతం అయ్యారు.

    అంతలో మళ్లీ పెద్దాయన ఫోన్ మోగింది. మాట్లాడాక "నర్సుకి ఈ పాత ఫైలు కావాలట. ఇచ్చేసి వస్తాను. ఇంకోసారి బ్యాగు కనిపెట్టి ఉండండి బాబూ" అంటూ లేవబోయారు. రాజేశ్ చటుక్కున లేచి, "నేను ఇచ్చి వస్తానండీ. ఫైలే కదా? మీరు కూర్చోండి" అన్నాడు. "అలా కాదులే బాబూ. ఆ వంకన ఇంకోసారి దాన్ని చూడచ్చు కదా అని..." అంటూ ఆ చిన్ని చిన్ని అడుగులతో, వణికే చేతులు కాళ్ళతో లిఫ్ట్ వైపుకి నడిచారు.

    కాసేపటికి సత్య బావమరిది వచ్చాడు. సత్య మరోసారి తన మామగారిని పలకరించి, బయల్దేరిపోయాడు. రాజేశ్ కి పనులు ఉన్నా, పెద్దాయన పిల్లలు వచ్చేవరకు తోడుగా ఉండాలనిపించి ఆగాడు. ఇంకాసేపటికి వాళ్ళు వచ్చారు, డాక్టరుతో మాట్లాడారు, సర్జరీ వల్ల లాభం లేదని, ఇన్ఫెక్షన్ బాగా పాకిపోయిందని, ఇంకొన్ని గంటలే ఆవిడకి ఉన్నాయని వాళ్ళు తండ్రికి చెప్పారు. కూతురు వెక్కి వెక్కి ఏడుస్తోంది, కోడలు ఆవిడని ఓదార్చుతోంది. అల్లుడు, కొడుకులు డాక్టర్లతో మాట్లాడుతున్నారు. పెద్దాయన అలాగే కుర్చీలో కూలబడిపోయారు. ఈసారి ఆయన ఏడవటం లేదు. ఆయన చెప్పవలసిన సారీ చెప్పలేకపోయినందుకు బాధపడుతున్నారా? చిన్నతనంలో ఆవిడతో ఆడుకున్నవి గుర్తుచేసుకుంటున్నారా? పెళ్ళయ్యాక కలసి పడిన సుఖదుఃఖాలు ఏమైనా తలచుకుంటున్నారా? బ్రతికించమని దేవుడిని కోరుకుంటున్నారా? ఆయనకే తెలియాలి. ఏమో, బహుశా ఆయనకి కూడా తెలియదేమో. శూన్యంలోకే చూస్తూ అలా ఉండిపోయారు.

    ఆవిడకి ఏమైనా అయితే, ఆయన ఒంటరి అయిపోతారు. కంటికి రెప్పలా చూసుకొనే పిల్లలు ఉన్నారని తెలుస్తోంది. కానీ, పిల్లలు పిల్లలే. ఆవిడ ఆవిడే. ఆ స్నేహితురాలు లేని లోటుని ఎవ్వరూ తీర్చలేరు కదా? ఇక బయట చీకటి పడుతోంది. 20 కిలోమీటర్లు వెళ్ళాలి కనుక ఆయన్ని పిలిచి, "బాబాయ్ గారూ, ఆవిడకి ఏమీ కాకూడదని కోరుకుంటున్నాను. కంగారు పడకండి" అన్నాడు. "దేవుడు కాయాలి బాబూ. వెళ్లి రండి" అన్నారు హ్యాండ్ షేక్ చేస్తూ.  

    *****
రాజేశ్ కాలింగ్ బెల్ కొట్టగానే నిత్య నవ్వు ముఖంతో తలుపు తీసింది. లోపలకి వెళ్లి హెల్మెట్ తీసిన వెంటనే, మంచినీళ్ళు ఇస్తూ, "సారీ రాజేశ్. పొద్దున్న ఏదో హడావుడి టైమ్ అవ్వటం వల్ల నేనే పిచ్చిదానిలా నిన్ను..." అంటున్న నిత్య నోటికి చూపుడు వేలు అడ్డుపెట్టి "ష్...!" అన్నాడు. తనతో తెచ్చిన క్యారీ బ్యాగ్ తీసి ఇచ్చాడు. నిత్య తనకిష్టమైన పానీపూరీల వాసనని మనసారా పీల్చి చిరునవ్వు నవ్వింది. తిరిగి చూసేసరికి టేబుల్ మీద పొగలు కక్కుతున్న తాజా కాఫీ కప్పులోంచి నురగను జుర్రుకుంటూ నిత్యకి కన్నుకొట్టాడు రాజేశ్.




ఈ కథ "సారీ చెప్పాలని..." అనే పేరుతో 2022 జనవరి 30 న ఈనాడు ఆదివారం సంచికలో ప్రచురించబడింది.


https://www.eenadu.net/telugu-article/sunday-magazine/eenadu-sunday-book-stories/7/322000073







2 comments:

  1. Replies
    1. అవునండీ. కొన్నాళ్ళు. కానీ ఇప్పుడు మళ్లీ అనుపమ యేలూరిపాటి గానే రాస్తున్నాను.

      Delete