Pages



Sunday, 15 August 2021

సిరివెన్నెల పదలీల - స్వాతిముత్యాల మాల - రెండవ అంకం - తరలి రాదా తనే వసంతం

నాకు ఫేస్ బుక్ ఎకౌంట్ ఉన్న రోజుల్లో దానికి, తర్వాత వాట్సాప్ ఎకౌంట్ కి, అలా ఇంకా చాలా చోట్ల "నా కాప్షన్" అంటూ నేను స్వీకరించినది, వాడుకుంటున్నది, ఆకళింపు చేసుకున్నది, అన్వయించుకునేది గురువు గారు రాసిన ఒక అద్భుతమైన వాక్యం...

"పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం"

ఒక గొప్ప ఉద్దేశంతో చక్కటి చిత్రాన్ని తెరకెక్కించదలచిన దర్శకుడు కే.బాలచందర్ గారు, ఆ కథకు ఏమాత్రం తీసిపోని విధంగా, చిత్రం ద్వారా తాను చెప్పదలచుకున్న సందేశమే పది కాలాల పాటు నలుగురి నోళ్ళ లోను నానే విధంగా అందులోని పాటలను తీర్చిదిద్దించారు. శాస్త్రీయత కొరవడకుండానే, అప్పటి యువతను కూడా ఆకట్టుకొనే విధంగా అద్భుతమైన బాణీలను ఇళయరాజా గారు సమకూర్చగా, ఆ స్వర సౌందర్యానికి తన సాహిత్య సౌరభాన్ని అద్ది ముస్తాబు చేశారు గురువుగారు. ఆ ముస్తాబుకు తుది మెరుగులు దిద్దారు మన బాలుడు, యేసుదాసుడు, ఇతర గాయక బృందం.

అక్బర్ చక్రవర్తి వల్ల అతని కొడుకు సలీమ్ ప్రేమ బలయ్యింది అని కథ విన్నాము (నిజానికి ఇది కథ మాత్రమే అంటారు అనుకోండి... అంటే అక్బర్ తానే మతాంతర వివాహాలూ అవీ చేసుకున్నాడని, ఇంట్లో అందరికీ చేశాడని కూడా విన్నాం కదా? కనుక ఒక ప్రేమని కాదన్నాడని, ఆ ఆడపిల్లని ఏకంగా సజీవ సమాధే చేసేశాడని అన్నది ఖచ్చితంగా కథే అయ్యుంటుంది).

రాజరాజ నరేంద్రుడి మూఢ ప్రేమ వల్ల కొడుకు సారంగధరుడి జీవితం బలయ్యింది అని మరో కథ. అంతెందుకు? నిన్న మొన్నటి వరకు "నా చేయి ఇంకా నీ చేతుల్లోనే ఉంది నాన్నా" అని మొత్తుకున్న కొడుకుల కథలు ఎన్నిటినో మన సినిమాల్లో ఇంకా వింటూనే ఉన్నాం. అలాగే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న కథలో కూడా కొడుకుని అర్థం చేసుకోలేని ఒక తండ్రి ఉన్నాడు.

ఆ తండ్రి గొప్ప సంగీత విద్వాంసుడు. అంటే మామూలు విద్వాంసుడు కాదు. "ఐ ఈట్ మ్యూజిక్, ఐ డ్రింక్ మ్యూజిక్" అనే రకం. సంగీతాన్నే దైవంగా భావిస్తూ, తను ఆరాధించి ఆలాపించే రాగాన్నే తన ఇంటిపేరుగా పొంది "బిలహరి గణపతి శాస్త్రి" గా పేరుగాంచిన విద్వన్మణి. చదువుకున్న వారు, డబ్బున్న వారు, 'ఉన్నత' కుటుంబంలో పుట్టినవారు అయితేనే 'బి.గ' శాస్త్రి గారికి మనుషులుగా ఆనుతారు. మాటలాడలేనివాడు కనుక వాదోడుగా ఉండలేకపోయినా, చేదోడుగా ఉంటూ, పితృ వాక్పరిపాలకుడిగా ఉంటూ, సతీసమేతంగా తండ్రి గీసిన గిరిలోనే ఉండే పెద్ద కొడుకు "ఉదయం" కాక, బిగ శాస్త్రి గారికి ఇంకో కొడుకు ఉంటాడు. అతనే మన కథానాయకుడు చిరంజీవి, చిత్రంలో "సూర్యనారాయణ శాస్త్రి ఉరఫ్ సూర్యం". తండ్రి పట్ల అపరిమితమైన భయభక్తులు ఉన్నప్పటికీ, భక్తిశ్రద్ధలతో ఆయన నుంచి సంగీత శిక్షణ పొందినప్పటికీ, సంగీతానికి ఆవల ప్రపంచం అనేది ఒకటి ఉందని, అందులో మనుషులు ఉన్నారని, వారికి జీవితాలు ఉన్నాయని, వాటిలో కూడా సుఖదుఃఖాలు ఉన్నాయని గ్రహించినవాడు సూర్యం. పక్కవారిని పట్టించుకోవటం మనిషిగా మన కర్తవ్యం అని, పట్టించుకోలేకపోవటం దాదాపుగా దౌర్భాగ్యమేనని గట్టిగా విశ్వసించినవాడు.

పాట గురించి మాట్లాడవలసి ఉండగా చిత్ర కథంతా చెప్తున్నాను ఎందుకని అనుకోవటానికి లేదు. ఎందుకంటే, ఇందాక చెప్పినట్టు ఈ కథలో చెప్పబడిన సిద్ధాంతాలను, ఆదర్శాలను పాటల్లో  ఇమిడ్చి, ఈ చిత్ర స్థాయినే కాదు, తాను రాసిన ఇతర పాటల్లాగే, ఈ పాటలతో కూడా తెలుగు సినీ గీతాల స్థాయిని నిలబెట్టారు గురువుగారు.

తనకి జనం మధ్య మెలగటం ఇష్టం. కలిమి-లేమి, పెద్ద కులం-చిన్న కులం అన్న తారతమ్యాలు తనకి ఎప్పుడూ కనపడవు. వాళ్ళ మధ్య ఉంటాడు, వాళ్ళు తినేది తింటాడు, వాళ్ళ ఆనందమే తనదనుకుంటాడు. వాళ్ళని ప్రేమగా చూస్తాడు. తన ఆదర్శాలకు మరింత ఊపిరి పోసే పడతి తన తోడుగా నడుస్తాననటంతో ఆనందంగా తనకు నచ్చినట్లు వాళ్ళతో మెలుగుతూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకరోజు వాళ్ళు తనని ఒక పాట పాడమంటారు. శాస్త్రీయంగా ఆలాపన చేయటంతో, కట్టెలు కొట్టుకొని రోజుకూలీ సంపాదించే వాళ్ళకి ఏమీ అర్థం కాక, బుర్రలు గోక్కుంటారు. తనలో తానే చిన్న నవ్వు నవ్వుకుంటాడు సూర్యం. ఆ నవ్వు వెనుక ఎంత అర్థం ఉందో, అదే ఈ పాటలో ప్రతిబింబిస్తుంది.

తరలి రాదా తనే వసంతం

తన దరికి రాని వనాల కోసం

గగనాల దాకా అల సాగకుంటే

మేఘాల రాగం ఇల చేరుకోదా


వసంత కాలానికి చెట్లు, చేమలను అందంగా మార్చాలని ఉంటుంది. కానీ అది ఉన్న చోటనే ఉంటే వనాలు తన దగ్గరకు రావు కదా? అందుకని తానే దిగి వస్తుందిట.

ఆకాశాన్ని చేరాలనే ఉత్సాహంతో నదులలో, సముద్రాల్లో ఉండే అలలు ఎంత పైకి ఎగసిపడినా కొంత దూరమే ఎగరగలవు కనుక, వాటిని చేరటం కోసం వర్షం కిందకి వస్తుందిట ఆకాశం నుంచి. వర్షాన్ని "మేఘాల రాగం" అనటం కేవలం గణాల అమరిక కోసమా, లేక ఈ చిత్రంలో సంగీతానికున్న ప్రాముఖ్యతను మరోసారి ప్రస్తావించటమా?

సమాజంలోని ఉన్నత వర్గాలకు, అణగారిన వర్గాలకు మధ్య ఉన్న దూరాన్ని తూర్పారబట్టటం ఈ చిత్రం ఉద్దేశం. సంగీతాన్ని తప్ప పక్క మనిషిని గౌరవించని మూర్ఖ వ్యక్తిగా తండ్రి పాత్రని మలచి, ఆయనకు విరుద్ధమైన పాత్రలో చిన్న కొడుకుని సృష్టించి, వారి మధ్య జరిగే అదృశ్య యుద్ధం ద్వారా చక్కటి సందేశాన్ని సమాజానికి ఇచ్చారు దర్శకుడు. ఆ దూరాన్ని ప్రకృతిలోని అంశాల ద్వారా సున్నితంగా పోల్చారు గురువుగారు. వసంతం, ఆకాశం ఉన్నతమైనవి అయితే, ఆ స్థాయికి చేరలేని అలలతోను, వనాలతోను కార్మికులను, కర్షకులను పోల్చటం ఎంత అపురూపమైన భావన?

వెన్నెల దీపం కొందరిదా? అడవిని సైతం వెలుగు కదా?

ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా

చందమామ, చంద్రుడు, నెలవంక, చుక్కలఱేడు, నెలరాజు, రేరాజు అన్నీ విన్నాము. "వెన్నెల దీపం" ఎంత ముద్దైన ప్రయోగం? ఇంతకీ ఆ చందమామ ఏ ఒక్కరికో సొంతం కాదు కదా? జాతి, కుల, మత, వర్గ భేదాలే కాదు, పశుపక్ష్యాదులకు, మృగాలకు, మొక్కలకు, ఇంకా చరాచర వస్తువులకు కూడా సమానంగా వెన్నెలను పంచుతుంది కదా? అలాగే గాలి కూడా కొందరి కోసం వీచి, కొందరి జోలికి పోకపోవటం జరగదు కదా? అందరికీ సమానంగా అందుతుంది కదా?

ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం

గురువుగారికి ఉదయం వేళను ఉపమానంగా వాడటమంటే చాలా ఇష్టమని నా అభిప్రాయం. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా ప్రేరణనిచ్చే సాహిత్యం రాయవలసివచ్చినప్పుడు తప్పకుండా ప్రస్తావిస్తారు ఉదయాన్ని. ఈసారి ప్రభాత రాగం అని ముద్దుగా పిలిచారు. ఈ రాగం ప్రతిరోజూ ప్రతి మనిషినీ ఒకేలా నిద్ర లేపి తాజాదనం నింపుతుందిట. అదే మనకి మార్గనిర్దేశమట.

ఈ పోలికలు, ఈ ప్రస్తావనలు చూస్తుంటే నాకు సుప్రసిద్ధ అన్నమాచార్య కీర్తన "బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే" గుర్తు రాక మానదు. "నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే, అండనే బంటునిద్ర అదియునొకటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమియొకటే, చండాలుడుండేటి సరిభూమియొకటే, కడగి యేనుగు మీద కాయు ఎండొకటే, పుడమి శునకము మీద పొలయు ఎండొకటే"... పద కవితా పితామహుడు ఏనాడో చెప్పిన ఈ అమూల్యమైన నీతినే 1988 లో మళ్లీ ఈ చిత్రం ద్వారా నొక్కి వక్కాణించారు.

ఏదీ సొంతం కోసం కాదను సందేశం

పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం

ఇది తెలియని మనుజుని కథ దిశలెరుగని గమనము కదా?

కనుక గురువుగారు చెప్పవచ్చేది ఏమిటంటే, ఏదీ ఎవరికీ సొంతం కాదని, పక్కవారికి పంచటానికే ఏదైనా ఎవరికైనా ఉందని. ఇందులో ఎంతటి సృష్టి రహస్యం ఉందని? ఇది నాకు అత్యంత ప్రీతిపాత్రమైన వాక్యం... "పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం". సూర్యుడు వెలుగుని పంచకపోతే మనకి గానీ, ఏ జీవరాశులకైనా గానీ మనుగడ ఉందా? సముద్రం ఉప్పుని పంచకపోతే బ్రతుక్కి ఒక రుచి ఏడుస్తుందా? నదీనదాలు నీళ్ళు పంచకపోతే ఒక్క పూటైనా గడుస్తుందా? చెట్లు-చేమలు కాయల్లోను, పళ్ళలోను, ధాన్యంలోను ఆహారం పంచకపోతే భుక్తి ఎలా? పశువులు పాలు పంచకపోతే పాడి ఎలా? అమ్మ, నాన్న ప్రేమ పంచకపోతే ఎదుగుదల ఎలా? మనకి జబ్బు వస్తే తగ్గించే డాక్టర్లు తమ పరిజ్ఞానాన్ని పంచినట్లే. మనకి బాధ కలిగితే ఓదార్చే స్నేహితుడు మనకి సానుభూతిని పంచినట్లే. మన కాళ్ళకి అడ్డాలు పడుతూ ఇంట్లో తిరిగే మన పసి పిల్లలు మనకి ఆనందాన్ని పంచుతారు. వెరసి చెప్పవచ్చేది ఏమిటంటే, "పంచటం" అనేది లేకపోతే ఇంకేమీ లేదు, అంతా సూన్యమే. ఇది తెలుసుకోలేకపోతే, ఆ మనిషి మనుగడకి ఒక దారీ తెన్నూ లేనట్లే అంటారు గురువుగారు.

ఇకపోతే రెండవ చరణాన్ని మన కథలోని తండ్రీకొడుకుల భావజాలంలోని వ్యత్యాసం వల్ల ఏర్పడే ఘర్షణను అద్దం పట్టేలా రాశారు కవి. మరి సమయాభావం అవ్వటం వల్లో, రసాభాస అయ్యేటట్టు ఉందనుకున్నారో, ఒక చరణంలో చెప్పిన విషయాలను వాక్యాల్లోనో, కనుసైగలతోనో చెప్పించేద్దాం అనుకున్నారో, ఏ కారణం వల్లనో గానీ అది చిత్రీకరించలేదు, రించినా మనకి చూపించలేదు. కనుక సినిమాలో ఈ చరణం మనకు తారసపడదు. అయితే ఆడియో కేసెట్లలో ఉంటుంది.

తండ్రి సంగీతానికి ఇచ్చే ప్రాధాన్యతనే జీవితానికి వర్తింపజేస్తూ, తనయుడు పలికే సుభాషితాలు ఇవి...

బ్రతుకున లేని శృతి కలదా? ఎద సడి లోనే లయ లేదా?

ఏ కళకైనా ఏ కలకైనా జీవిత రంగం వేదిక కాదా?

ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం

కూసే కోయిల పోతే కాలం ఆగిందా?

పారే ఏరే పాడే మరో పదం రాదా?

మురళికి గల స్వరముల కళ పెదవిని విడి పలుకదు కదా?

మొదటి అంకంలో మనం చెప్పుకున్నట్టు, గురువుగారు తనకు ఎంతో పేరును, ఇంటి పేరును తెచ్చిపెట్టిన సిరివెన్నెల గీతంలో గుండె చప్పుడును "హృదయ మృదంగ ధ్వానం" అని యమా బరువుగా అన్నప్పటికీ, ఈ పాటలో అతి సరళంగా "ఎద సడి" అనేశారు. ఈ రెండు ప్రయోగాలను చూస్తే "సీతారామయ్య గారి మనవరాలు" చిత్రంలో సుధాకర్ "హ్హెవ్వీ...", "లై...ట్" అనటం గుర్తొస్తుంది నాకు.

ఇంతకీ సంగీతానికి అతిముఖ్యమైన శృతిలయలను జీవితానికి అన్వయిస్తూ, "బ్రతుకున లేని శృతి కలదా? ఎద సడి లోనే లయ లేదా?" అన్నారు. ఏ పాటైనా ఏ శృతిలో మొదలుపెట్టామో, చివరి వరకు ఆ శృతిలో పాడతాము. అంటే ఒక నిర్ణీత శృతిస్థానంలో మొదలైన పాట మనం అనుకున్నట్టు అదే శృతిలో సాగాలి అనుకోవటం మామూలే. అలాగే జీవితం కూడా ఏ అపశృతీ ఎదురవ్వకుండా అనుకున్నట్టుగా సజావుగా సాగాలని కోరుకుంటాము. అలాగే మనుగడకు అన్నిటికంటే ముఖ్యంగా కావలసినది గుండె కొట్టుకోవటం. ఆ చప్పుడు ఆగితే ఇంకేమైనా ఉందా? కనుక జీవితానికి, శృతిలయలకి అవినాభావ సంబంధం ఉందనటంలో ఏ సందేహమూ లేదు. కాబట్టి, జీవితం సజావుగా సాగాలంటే అది శృతిలయలు తప్పకుండా సాగాలి, కళ విరాజిల్లాలంటే జీవితం దానికి వేదికవ్వాలి.

అయితే, జీవితం కంటే సంగీతమే ప్రధానమనుకునే తన తండ్రికి రెండు ముక్కల్లో జీవితం ప్రాధాన్యతను చెప్పేస్తాడు సూర్యం. వసంతకాల ఆగమనానికి సంకేతంగా కూసే కోకిల, దాని కూతకి కాలం చెల్లితే  కూయటం ఆపేస్తుంది. కానీ దానివల్ల కాలం ఆగదు, సాగుతూనే ఉంటుంది. అది కాకపోతే, పారే ఏరు లోంచి సంగీతాన్ని వినిపిస్తుంది ప్రకృతి. సంగీతం రూపం మారచ్చు, కానీ కాలం ఆగదు, జీవితం ఆగదు. మనసుల్ని ఆనంద డోలికల్లో ఊపగల మురళీగానం కూడా పుట్టేది దాన్ని పెదవులు పలికిస్తేనే కదా?

ఇంకా "చుట్టుపక్కల చూడరా" లాంటి అద్భుతమైన పాటలు ఇందులో ఉన్నాయి. మరోసారి వాటి గురించి మాట్లాడుకుందాం. మంచి నటీనటవర్గం, సాంకేతిక బృందం కలిసి మీటిన ఈ "రుద్రవీణ" గురించి కూడా ఒకరోజు మాట్లాడుకుందాం.






సిరివెన్నెల పదలీల - స్వాతిముత్యాల మాల - ఒకటవ అంకం:

https://pulihora-perugannam.blogspot.com/2020/06/blog-post.html

10 comments:

  1. బాగుందండీ👍, ప్రకృతి లోని అణువణువూ మనకి పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది... *ఎద కనుల తో చూస్తే ప్రతి కదలిక లోనూ నాట్యాన్ని, ప్రతి ఋతువు లోనూ ఒక చిత్రాన్ని చూడొచ్చని* మరో పాట లో శాస్త్రి గారే చెప్పారు...
    పంచే గుణాన్ని కూడా మనం ప్రకృతి నుండే నేర్చుకోవాలని, జీవిత రంగం లో లేని కళ ఏదీ లేదని, ఎంత గొప్పవారైనా ప్రకృతి ముందు తల వంచాల్సిందేనని, అద్భుతమైన ఉపమానాలతో సీతారామ శాస్త్రి గారు చెప్పిన భావాన్ని మీ మాటల్లో విశదీకరించే మీ ప్రయత్నం అభినందనీయం.
    ప్రభాత వేళ తో మన దైనందిత జీవితం మొదలవుతుంది, అలాంటి ప్రభాత వేళలు ఎన్నో ప్రధాన మార్గంగా మన జీవితం సాగుతుంది...మీ రచనా ప్రవాహం కూడా మీరు ఎంచుకున్న విషయాల్లో నిరాటంకంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. బాగా చెప్పారు. Thank you అండీ. 😊🙏

      Delete
  2. మస్తుగ చెప్పావు కదా
    నచ్చింది. అభినందనలు

    ReplyDelete
  3. బాగా రాసారు. మంచి పాట ఎంచుకున్నారు.

    ReplyDelete
  4. చాలా బాగా వ్రాశారు.
    ఆ మధ్య ఎవరో ట్విట్టర్ లో ఒకాయన ఈ చిత్రాన్ని ప్రస్తావిస్తూ
    పెద్ద కొడుకు ఉదయం పాత్రధారి శ్రీ ప్రసాద్ గారిది
    "The most underrated performance"
    అన్నారు. ఆయన చెప్పింది నిజమే.

    https://youtu.be/A2yUtLJo7sw?t=97

    ReplyDelete