Pages



Thursday, 26 November 2020

మాంచి కాఫీ లాంటి మొగుడు

వంటింట్లోంచి అన్నం గిన్నె తెచ్చి, భర్తకి, పిల్లలకి కంచాల్లో వడ్డించటం మొదలుపెట్టింది అఖిల. అప్పటివరకు ఇక్కడే సోఫాలో కూర్చొని పని చేసుకుంటున్న భర్త అనిల్, సరిగ్గా భోజనం వడ్డించే సమయానికి ఎక్కడకి వెళ్లిపోయాడా అని అటూ ఇటూ చూసింది. బాల్కనీలో అటూ ఇటూ తిరుగుతూ ఫోన్లో మాట్లాడటం గమనించి, అతని హావభావాలను బట్టి ఇప్పటిలో తను లోపలకి రాడులే అని గ్రహించి, అతని కంచంలో వడ్డించిన అన్నాన్ని మళ్లీ గిన్నెలోకి ఖాళీ చేసి, వేడి పోకుండా మూత పెట్టింది. ముఖ్యమైన ఫోన్లు ఏమైనా వస్తే బాల్కనీలోకి వెళ్లి మాట్లాడటం అతనికి అలవాటు... పిల్లల అల్లరి, కేకలు వినపడకుండా ఉంటాయని, సిగ్నల్ బాగా వస్తుందని.

 

ఈమధ్య ఇంట్లోంచి పనిచేయటం మొదలయ్యాక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు వేళకు ఇంత తింటున్నారని సంతోషించాలో, పనికి వెళ్ళకుండా నాలుగు గోడల మధ్య ఉండిపోవటం వల్ల సరిగ్గా ఆక్సిజన్ అయినా పీల్చటం మానేశారని బాధపడాలో తెలియట్లేదు అఖిల లాంటి ఇల్లాళ్ళకి. ఆఫీసుకి వెళ్ళే రోజుల్లో పదింటికో కనీసం కంప్యూటర్ కు గుడ్ బై చెప్పి ఇంటిముఖం పట్టేవాడు. ఇప్పుడు పగలూ రాత్రీ కంప్యూటర్ తోనే కాలక్షేపం. తను అనుకున్నట్టే అరగంట తర్వాత బాల్కనీ తలుపు వేసి లోపలకి వచ్చాడు అనిల్.

 

"పిల్లలు తినేసి వెళ్లిపోయారా?" అని అడిగాడు.

             "ఆహా. చక్కగా."

             "నువ్వు తిన్నావా?"

 

అన్నం కంచాల్లో వడ్డిస్తూ, "ఆకలి వేయలేదులే. ఇద్దరం కలిసే తిందాం. ఎవరేంటి అంతసేపు కబుర్లు? మళ్లీ మీ మేనేజరేనా? ఇందాకేగా, ముప్పావుగంట మాట్లాడాడు? ఇంకా మీపై బెంగ తీరలేదటా?" అంది చిరుకోపం నటిస్తూ. "ఇంకో గంట మాట్లాడినా మాకు ఒకరిపై ఒకరికి బెంగలు తీరవులే కానీ, ఫోన్ చేసింది రాముడన్నయ్య" అన్నాడు అనిల్.

 

"ఏమిటట పెళ్లివారి కబుర్లు?" అంటూ టొమాటో పప్పన్నం ముద్ద నోట్లో పెట్టుకుంది. "పాపం సంబంధం వాళ్ళు నో అన్నారట" అన్నాడునమలటం మానేసి, "ఏం? మొన్న పెళ్లిచూపుల్లో అందరూ ఇష్టంగానే ప్రవర్తించారని అన్నారు?" అంది. 


"మనవాళ్ళకి అలాగే అనిపించింది. తీరా వారం ఆగి, జాతకాలు కలవలేదని చెప్పించారట మధ్యవర్తులతో."

 

"జాతకాలు కలిశాయని అనుకున్నాకే కదండీ పెళ్లిచూపులకి వచ్చింది?"

 

"అవును, అప్పుడు అలాగే అన్నారు. మళ్లీ ఇలా అన్నారట. ఏముంది? పెళ్లి సంబంధం వద్దని చెప్పటానికి మర్యాదపూర్వకమైన వంక జాతకాలు కలవకపోవటమే. కూర ఏం చేశావు?"

 

"వంకాయ. అప్పుడు కలిసినవి ఇప్పుడెందుకు కలవవు?"

 

"ఇప్పుడు ఇంకో పెద్ద సిద్ధాంతికి చూపించామని అన్నారట. ఎలా చేశావు? కారం పెట్టావా, వేయించావా?"

 

"కొత్తిమీర కారం వేశాను. నేనే ఇంత కంగారు పడుతుంటే, మీరేంటి కూర వివరాలు అడుగుతారు తాపీగా?"

 

"కంగారెందుకు పడుతున్నావు? అన్నయ్యే పడటంలేదు. చాలా రోజులయ్యింది నువ్వు కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర చేసి. ఈమధ్య ఎప్పుడు వంకాయలు కొన్నా గుత్తి వంకాయ చేసి చంపుతున్నావు".

 

"పెడితే తినటం అంత కష్టంగా ఉందా మీకు? ఇదిగో మీరే తినండి. నాకెలాగూ తినాలని లేదింక".

 

"ఏమిటి? మాటకేనా అంత కోపం? ఇలాంటి మాటలకి ఇంత వైల్డ్ గా రియాక్ట్ అవ్వవు కదా నువ్వెప్పుడూ?

 

"శృతి విషయంలో మీకసలు చీమ కుట్టినట్టైనా లేదు ఎందుకు? మీ అన్నయ్య ఎందుకు ఫీల్ అవ్వట్లేదో నాకు తెలియదు. తనొక మామూలు ఆడపిల్ల. ఒక కుటుంబమంతా వచ్చి తన చుట్టూ కూర్చొని, తన ఇంట్లో వాళ్ళతో బోలెడంత ఇష్టంగా మాట్లాడి వెళ్ళాక, తన ఇంట్లో వాళ్ళంతా సంబంధం ఇక కుదిరిపోయినట్టే అని అనేసుకున్నాక, వచ్చిన పెళ్లికొడుకే తన కాబోయే మొగుడేమో అనుకొని ఆశలు పెట్టుకున్నాక, ఉన్నట్టుండి వాళ్ళు తనని కాదన్నారని తెలిస్తే, తను ఎలా ఫీల్ అవుతోందో అసలు ఆలోచించారా?" అంది అఖిల కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉక్రోషంగా.

 

అఖిల తల నిమురుతూ అన్నాడు అనిల్, "అదా నీ బాధ? పిచ్చి పుల్లమ్మా, శృతి ఏమాత్రం ఫీల్ అవ్వట్లేదు. ఇందాక అది కూడా నాతో మాట్లాడింది."

 

"ఫీల్ అయితే మాత్రం అలాగని చెప్పగలదా?"

 

"నీకంత అనుమానంగా ఉంటే నువ్వే మాట్లాడు" అంటూ ఫోన్ చేసి అఖిలకందించబోయాడు.

 

అఖిల అందుకొని ఫోన్ కట్ చేస్తూ, "వద్దులెండి, మీరు మాట్లాడానంటున్నారు కదా? ఇప్పుడు ఏడుపు గొంతుతో మాట్లాడితే మళ్లీ చంటి పాపలా ఏడుస్తానని నన్నే ఆటపట్టిస్తుంది. మీరే చెప్పండి ఏమందో" అంది చారు వడ్డిస్తూ.

 

"ములక్కాయ చారు నువ్వు భలే పెడతావు అక్కీ" అంటూ నోట్లో ముద్ద పెట్టుకున్నాడు అనిల్.

 

"ఇప్పుడు అంత మోయక్కరలేదు లెండి, చెప్పండి" అంది తనకూ చారు వడ్డించుకుంటూ.

 

"జాతకాలూ అవీ కాదు బాబాయ్, ఫోటోలు చూసి ముందే అన్నాను కదా, స్టూడియో వాడు ఫోటోషాప్ చేశాడని? అవి చూసి పర్లేదనుకొని ఉంటారు. లైవ్ లో నా ఆకారం చూసి భయపడి ఉంటారు. ఏం పర్లేదు బాబాయ్. నేనూ అనుకున్నాను బక్క ఫెలో పక్కన నేను బొండంలా ఉంటానని. అతనితో పెళ్లయినా, మేము పాత సినిమాల్లో రమణారెడ్డి పక్కన సూర్యకాంతం ఉన్నట్టు ఉంటాము" అందని చెప్పాడు అనిల్.

 

"అవునా? అంత హాయిగా మాట్లాడిందా?" అని కళ్ళు పెద్దవి చేసింది అఖిల.

 

"మరి? కాలం పిల్లలు అంతే. దేనినీ మనసులో పెట్టుకొని చింతిస్తూ కూర్చోరు. సరే, నెక్స్ట్ ఏంటి? అంటూ పరుగెడతారు పిచ్చిదానా" అన్నాడు ప్రేమగా.

 

"నిజమే లెండి. ఎందుకో శృతిని చూస్తే పదిహేనేళ్ళ క్రితం అఖిలే గుర్తొస్తుంది నాకు. చాలా విషయాల్లో మా ఇద్దరి అభిరుచులూ ఒకటే కావటం వల్ల కలసి కాలక్షేపాలు చేయటంతో, తను నాకొక చిట్టి చెల్లిలా అనిపిస్తుంది. కాకపోతే మీరన్నట్టు విషయంలోనూ నా అంతగా అది చింత పడదు" అంది అఖిల.

 

"అవును. ఇక ప్రశాంతంగా భోజనం చెయ్యి. నాకొక మీటింగ్ ఉంది" అంటూ వెళ్లిపోయాడు అనిల్. పెరుగన్నం తింటూనే దీర్ఘాలోచనలో పడింది అఖిల.

 

రాత్రి టిఫిన్లు పూర్తయి పిల్లల్ని నిద్రబుచ్చాక, భర్త పని చేసుకుంటున్న గది తలుపు సగం తీసి, "మీటింగ్ లో ఉన్నారా?" అని సైగలతోనే అడిగింది. "లేదమ్మా, దా. ఏమిటి, చెప్పు" అన్నాడు. రోజంతా పని చేసి అలసిపోయి ఉన్న భర్త అప్పుడప్పుడూ విసుక్కున్నా, ఒక్కోసారి అంత అలసట లోనూ ఇలా ప్రశాంతంగా నవ్వుతూ మాట్లాడినప్పుడు తనకు చాలా ముద్దొస్తాడు.

 

"ఏం లేదు, మధ్యాహ్నం నుంచి ఏవేవో ఆలోచనలు. శృతి టాపిక్ లో ఎందుకు నాకంత ఉక్రోషం వచ్చిందో తెలిసింది" అంది.

 

ఎందుకన్నట్టు సైగ చేశాడు అనిల్. అఖిల ఒక పెద్ద నిట్టూర్పు విడిచింది. అఖిల అతని కుర్చీ పక్కకి ఇంకో కుర్చీ లాక్కుని కూర్చోబోయింది. అనిల్ వెంటనే "అమ్మో, అంత నిట్టూర్చావంటే విషయం పెద్దదే. ఉండు, ఒక్క ఈమెయిల్ పెట్టేస్తే నా పని అయిపోతుంది. నేనే వచ్చేస్తాను. నడుము వాల్చాక చెప్పుకుందాం" అంటూ ఈమెయిల్ పెట్టటంలో పడిపోయాడు. అఖిల కూడా పని తెముల్చుకొని మంచంపై వాలింది.

 

పది నిముషాల తర్వాత "ఇప్పుడు చెప్పు అక్కీ డియర్, నిట్టూర్పు వెనుక కథ ఏమిటో. ఎందుకు నా బంగారానికి అంత కోపం వచ్చిందిట?" అన్నాడు పక్కకి తిరిగి విష్ణుమూర్తిలా పడుకొని. అఖిల  చెప్పటం మొదలుపెట్టింది...

 

*****

 

"మీ అమ్మాయికి పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు" అని జనం అడగటం, "ఇంకా చదువు అవ్వాలి కదండీ" అని మా అమ్మ, నాన్న నవ్వుతూ సమాధానం ఇవ్వటం... తతంగం మొదలైన మూడు నాలుగేళ్ళకి ఒకరోజు నేను నోట్స్ రాసుకుంటున్నాను. పక్క గదిలో మా అమ్మ, నాన్నగారు మాట్లాడుకోవటం నాకు స్పష్టంగా వినిపిస్తోంది. "ఈరోజు కాకపోతే రేపు దానికి పెళ్లి చేయాలి కదా? ఇంకో ఏడాది చదువు ఉంటే ఉంది, సంబంధం కుదిరాక మూడు ముళ్ళూ పడేసరికి ఆమాత్రం టైం ఎలాగూ పడుతుంది" అంటూ ఏదేదో చెప్పి ఆయన్ని ఒప్పించేసింది మా అమ్మ.

 

"అంత ఉత్సాహపడుతున్నావు, సంబంధం కూడా చూసేశావా ఏమిటే?" అన్నారు నాన్న నవ్వుతూ. "అవునండీ, మొన్న మా పెదనాన్నగారి మనవడి పెళ్లికి వెళ్లినప్పుడు ఒక కుర్రాణ్ణి చూశాను" అంది నెమ్మదిగా. "అదీ సంగతి. ఇంకనేం?" అంటూ వివరాలు అడిగారు నాన్న. కుర్రాడు చూడటానికి చక్కగా ఉన్నాడు. వాళ్ళ అన్న, వదిన కూడా వచ్చారు పెళ్లికి. అమ్మాయి ఎంత బాగుందో, అంత అణకువగా ఉంది. లక్ష్మీ కళ, సరస్వతీ కళ ఉట్టిపడిపోతున్నాయి. ఎంత చక్కటి పిల్లో! అలాంటమ్మాయి మనమ్మాయికి తోటికోడలిగా వస్తే ఎంత బాగుంటుంది? వాళ్ళాయన పెళ్లికి ముందే ఇల్లు, కారు, ఇంట్లోకి సామాను కొనేసి పెట్టుకున్నాడట. ఎంత ముందుచూపో కదా?"

 

"అది సరేనోయ్. కుర్రాడి అన్న, వదిన యోగ్యులైతే మన పిల్లకి ఒరిగేది ఏముంది? ఇది అసలే తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్ళు అనుకునే పిల్ల. వచ్చేవాడైనా గడసరి అయ్యుండకపోతే ఇంతే సంగతులు" అన్నారు నాన్న. వాళ్ళ చుట్టాల మాటల్ని బట్టి కుర్రాడూ యోగ్యుడే అని తెలిసింది. అయినా వివరాలు కనుక్కోకుండా కన్యధార పోసేయమన్నానా ఏమిటి?" అంటూ తిప్పుకుంది మా అమ్మ. మొత్తానికి వివరాలు కనుక్కొని, సంబంధం కదుపుదామని అమ్మ, నాన్న నిర్ణయించుకున్నారు ఆరోజు.

 

వాళ్ళు మాట్లాడుకునే కుర్రాడు నాకు తెలిసినవాడే. అమ్మ చెప్పిన పెళ్లికి నేనూ వెళ్ళాను. తెలిసిన వాళ్ళెవ్వరూ ఉండరని పెళ్లికి రానని గొడవ చేశాను. తనకి తోడుగా ఉంటానని అమ్మ నన్ను బలవంతంగా లాక్కెళ్లింది. చీర కట్టుకోమని అమ్మ మళ్లీ గొడవపెడితే, నా వల్ల కాదని, కావాలంటే లంగా ఓణీ వేసుకుంటానని నేను చెప్పేశాను.

 

నన్ను తోడు తీసుకువెళ్లినా, అక్కడకి వెళ్ళాక నన్ను వదిలేసి పెళ్లికి వచ్చిన అమ్మలక్కలతో కబుర్లలో పడిపోయింది మా అమ్మ. మంచినీళ్ళు తాగుదామని వెళ్ళాను. అక్కడ కనిపించాడు అతను. ఎర్ర చొక్కా వేసుకొని బాగానే ఉన్నాడు. నన్ను చూసి "హలో, మీరు ఆడపెళ్లివారా?" అని అడిగాడు. నేను ఏమీ మాట్లాడకుండా నీళ్ళు తాగి వచ్చేసి అమ్మ పక్కన కుర్చున్నాను. అతను నా వెనుకే వచ్చి, అల్లంత దూరంలో వేరే కుర్చీలో కూర్చున్నాడు. చొక్కా రంగు ఎర్రటి ఎరుపు అవ్వటం వల్ల నేను తల తిప్పి చూడకపోయినా అతను అక్కడే కూర్చున్నట్టు, మా వైపే చూస్తున్నట్టు నాకు తెలుస్తూనే ఉంది.

 

స్నాతకం అయ్యింది. రాత్రి ముహూర్తం. అంతా ఖాళీగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈలోగా నాకు సంగీతం వచ్చని మా అమ్మ అనటంతో అమ్మలక్కలంతా నన్ను పాట పాడమన్నారు. నేను మొహమాటపడుతూ ఒక కీర్తన పాడాను. అతను అక్కడే ఉన్నాడు. ఇటే చూస్తున్నాడు. "చక్కగా పాడుతోంది. చెవుల తుప్పు వదులుతోంది. ఒక రామదాసు కీర్తన పాడమ్మా", "ఏమ్మా, నికు మరుగేలరా వచ్చా?" అంటూ అడిగి అడిగి ఇంకో పది పాటలు పాడించుకున్నారు. నేను అతని వైపు చూడట్లేదు. అతను మాత్రం అక్కడక్కడే తచ్చాడుతూ ఇటే చూస్తున్నాడు.

 

రాత్రి పెళ్లి భోజనాలప్పుడు, పెళ్లిలోనూ కూడా నేనెక్కడకి వెళ్తే అక్కడకి వెళ్తూ, రెండు మూడు సార్లు నాతో మాట్లాడే ప్రయత్నం చేశాడు. నాకు బిడియం, భయం ఉండటం వల్ల నేను మాత్రం అతనితో మాట్లాడకుండా, అతన్ని చూడనట్టే పారిపోయేదాన్ని. తెల్లారాక మా దారిన మేము వచ్చేశాం. అతను మళ్లీ కనిపించలేదు. ఈలోగా పెళ్లివారితో మాట్లాడి వాళ్ళ కుటుంబ వివరాలన్నీ సేకరించింది అన్నమాట.

 

అతను నా వెనుకే తిరగటం అమ్మ పసిగట్టి ఉంటుందా అన్న ఊహతోనే నా ముఖం కందగడ్డలా మారింది. రేపు పెళ్లిచూపులంటూ అతన్ని నా ముందు కూర్చోపెడితే? అప్పుడైనా అతనితో మాట్లాడాలి కదా? మాట్లాడగలనా? అతను ఏం మాట్లాడతాడు? అసలు అప్పుడు పెళ్లిలో ఏం మాట్లాడదామనుకున్నాడు? అతనికి నేను నిజంగా నచ్చి ఉంటానా? ఒకవేళ మాకు పెళ్ళైతే దీన్ని లవ్ మ్యారేజ్ అనచ్చా? ఇలా రకరకాలుగా పిచ్చిపిచ్చి ఆలోచనలన్నీ వచ్చేవి ఒక పది రోజుల వరకు. అతనితో మాట్లాడనేలేదు. అయినా అతని చుట్టూ ఆలోచనలు వెళ్తున్నాయి. అది తప్పేమో అనిపించేది. కానీ ఆలోచించబుద్ధి వేసేది. ఇదంతా పది రోజులే.

 

అమ్మ, నాన్న మాట్లాడుకున్న నాటి నుంచి సరిగ్గా పది రోజుల తర్వాత మళ్లీ అదే విషయం మీద వాళ్లిద్దరూ అలాగే పక్క గదిలో మాట్లాడుకున్నారు. వాళ్ళ మాటలు అలాగే నా చెవిన పడ్డాయి

 

"వాళ్ళు సంబంధం వద్దన్నారట" అన్నారు నాన్న.

 

"పిల్ల జాతకం, ఫోటోలు పంపారా అసలు మీ పెదనాన్నగారు?" అంది అమ్మ ఆదుర్దాగా.

 

"అంతవరకు ఎక్కడయ్యింది? అసలు పుట్టిన తేదీ వినటంతోనే వద్దని అనేశారట. ఎనిమిదేళ్ళ తేడా ఉందట ఇద్దరికీ" అన్నారు నాన్న.

 

"ఎనిమిదా? ఒక ఐదారేళ్ళు ఉంటే పర్వాలేదు. ఎనిమిదంటే ఎక్కువే అనుకోండి, అయినా మంచి సంబంధం కదా? పోనీ ఓకే అనేసుకుందామేమిటి?" అంది అమ్మ ఆశగా.

 

"నువ్వూ నేనూ ఓకే అనేసుకుంటే పెళ్ళైపోతుందా? రెండు మూడేళ్ళకు మించి వయోభేదం ఉండకూడదని అనేశారట వాళ్ళు" అన్నారు నాన్న.

 

"సరేలెండి. మన అల్లుడు ఇంకెక్కడో పుట్టి ఉంటాడు" అని అమ్మ నిట్టూర్చింది.

 

కాసేపు నేను అలాగే ఉండిపోయాను. పెళ్లిలో చూసినమ్మాయే పెళ్లికూతురని అతనికి తెలిసి ఉంటుందా? అసలు ఇలా ఒక సంబంధం వచ్చిందని అతని వరకు వెళ్ళే ఉంటుందా, లేక పెద్దవాళ్ళే చెప్పేసి ఉంటారా? లేక అతనే కావాలనే వద్దని ఉంటాడా? నాకు మళ్లీ పిచ్చిపిచ్చి ఆలోచనలు. నిజానికి నేను అతన్ని ప్రేమించలేదు, మాట్లాడలేదు, అసలు సరిగ్గా అతని ముఖం కూడా చూడలేదు. అయినా నా మనసంతా అలజడిగా ఉంది. అతనేదో నన్ను మోసం చేసినట్టు ఉడికిపోయాను.

 

మరో వారం వరకు ఏదో బాధ మనసంతా నిండిపోయింది. పెళ్లి చేసుకోవటానికి అడ్డు వచ్చిన వయోభేదం పెళ్లిలో ఒక ఆడపిల్లకి సైటు కొట్టటానికి రాలేదా అని మనసు రగిలిపోయింది. తన కంటే ఎనిమిదేళ్ళు చిన్నదైన పిల్ల... ఇంకా చదువుకుంటున్న చిన్నపిల్ల... తల్లిదండ్రుల చాటు ఆడపిల్ల... పిల్ల వెంట పడటం, మాట్లాడితే చాలని తహతహలాడటం, తనను పిల్ల చూస్తే బాగుండని ఉబలాటపడటం... అదంతా ఏమిటి? నటనా, బోరు కొట్టినప్పుడు చేసిన కాలక్షేపమా? సహధర్మచారిణి మాత్రం చిన్నపిల్లలా కాక, వివేకం కలిగి ఉండాలి. ఇల్లూ వాకిలీ తీర్చి దిద్దాలి, పిల్లాజల్లా పుడితే సమర్థవంతంగా సాకాలి, తనకు అవసరమైనప్పుడు సలహాలిస్తూ కలసి నడవాలి. ఇలా ఆశించటం తప్పు కాదు. కానీ మరి పెళ్లి పేరంటాల్లోనో, బస్టాప్ లోనో, తమ కాలనీలోనో కనిపించే ఆడపిల్లలు మాత్రం ఎంత చిన్నపిల్లలైనా పర్వాలేదు, వెంటపడిపోతారు. అది తప్పు కాదా? అని చాలా బాధపడ్డాను.

 

ఇదంతా ఒక వారం పది రోజులే. తర్వాత పరీక్షలు వచ్చాయి, హడావిడిలో పడ్డాను. తర్వాత ఇంకో ఏడాదికి నాకు మీతో పెళ్ళయింది. మిగతా కథంతా మీకు తెలుసు. అతను మళ్లీ ఎప్పుడూ కనపడలేదు, అత్ని పేరు కూడా నాకిప్పుడు గుర్తులేదు. అతని ముఖమైతే పెళ్లిలో కూడా సరిగ్గా చూడలేదు. కానీ ఎవరైనా పిచ్చిపిచ్చి సాకులు చూపించి ఇలా ఆడపిల్లల సంబంధాలు కాదన్నారని తెలిస్తే చాలా కోపం వస్తుంది. ఈరోజు జరిగింది అదే. ఎందుకో మీకు చెప్పాలనిపించింది. విషయం ఇన్నాళ్ళూ కావాలని దాచినది కాదు. చెప్పేంత పెద్ద విషయం కాదు కనుక తట్టలేదు. అంతే...

 

*****

 

అంటూ ముగించింది అఖిల. అనిల్ కాసేపు మౌనంఆ ఉండిపోయాడు.

 

"ఏమిటి? ఏమీ మాట్లాడట్లేదు? మీకు చెప్పలేదని కోపమా?" అని అడిగింది అఖిల.

 

"నా మౌనానికి కారణం కోపం కాదు. అతనిపై నీకు ఉన్నది కూడా కోపం కాదు. నువ్వు ఊహించినట్టు జరగనప్పుడు నీకు కలిగిన ఉక్రోషం. ఈరోజు నీకు కోపం రావటానికి కారణం... నీ సాటి మనిషి... నువ్వు అభిమానించే మనిషి... బాధపడుతుందేమో అని నువ్వు పడ్డ ఆవేదన, చూపించిన సహానుభూతి. అది నీ సున్నతమైన మనసుకి తార్కాణం" అన్నాడు అనిల్.

 

"కానీ అలా వెంటపడటం తప్పు కాదంటారా? నాకు అతనిపై కోపం రావటం న్యాయం కాదా" అంది అఖిల భృకుటి ముడిపెట్టి.

 

"తప్పా ఒప్పా అని తర్కించుకోవటం అనవసరం కన్నా. నువ్వే చెప్పావు కదా? అతనేమీ నిన్ను మోసం చేయలేదు కదా? ఇకపోతే... పెళ్లికాని ఒక మగపిల్లవాడు వయసులో ఉన్న ఒక ఆడపిల్లని చూసి ఆకర్షి తుడవ్వటాన్ని 'తప్పు' అనో, 'నేరం' అనో, 'పాపం' అనో వర్గీకరించలేము. 'సహజం' అని మాత్రమే చెప్పగలము" అన్నాడు అనిల్.

 

"సహజమా?"

 

"అంతే కదా మరి? నీకో మాట చెప్పనా? ఇది యుగయుగాలుగా జరుగుతున్నదే, తరతరాల నుంచి జరిగినదే. మన తాతలు, తండ్రుల తరంలోనూ జరిగే ఉంటుంది. అంతెందుకు? మన కూతురు ఇంకొంచెం పెద్దైతే దాన్నీ కుర్రాళ్ళు చూస్తారు. మన రౌడీగాడు కూడా ఇంకో ఏడెనిమిదేళ్ళు పోతే ఆడపిల్లలకి సైటు కొడతాడు. ఇంకా చెప్పాలంటే, నేను కూడా నా బంగారాన్ని చూసేవరకు బోలెడుమంది అమ్మాయిలను చూసేవాడిని" అని చెప్పాడు అనిల్ నెమ్మదిగా.

 

చుర్రుమని ఒక్క చూపు విసిరింది అఖిల. కానీ మళ్లీ హాయిగా నవ్వేసింది. తనకి దొరికినవాడు స్నేహితుడిలా కబుర్లు చెప్తాడు, తండ్రిలా గారం చేస్తాడు, తల్లిలా లాలిస్తాడు. తనకేం తక్కువ? అతను పెళ్లికి ముందు ఎంతమంది ఆడపిల్లలను చూస్తేనేం? నిజమే, మగపిల్లలు ఆడపిల్లలను చూడటం సహజం. తను చదువుకొనే రోజుల్లో ఎన్నోసార్లు తన ఫ్రెండ్స్ విషయంలో కూడా అలా జరిగింది. అంతెందుకు? తన ఫ్రెండ్స్ లో కూడా కొంతమంది మగపిల్లలను చూసేవారు, వాళ్ళ గురించి రౌడీల్లా మాట్లాడుకొనేవాళ్ళు. నిజమే కదా? అతి సహజమైన విషయాన్ని తానెంత సీరియస్ గా తీసుకుంది? అది గ్రహించి తనలో తనే నవ్వుకుంటూ హాయిగా నిద్రలోకి జారుకుంది.

No comments:

Post a Comment